రాత్రిళ్లూ పట్టపగళ్లవుతున్న నగరాలు
ఇళ్లలోనూ లైట్లు, స్క్రీన్‌ల వెలుగులు
కృత్రిమ కాంతులతో గుండెజబ్బులు
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్టడీ
సాక్షి, స్పెషల్‌డెస్క్: రాత్రి పూట కళ్లు చెదిరే కాంతిలో ఉండటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ (ఎ.హెచ్.ఎ.) ప్రాథమిక అధ్యయ నంలో వెల్లడైంది. కాంతి తీవ్రత మెదడుపై ఒత్తిడిని కలిగించటమే కాక, ధమనుల వాపునకూ కారణమై పలు రకాల హృద్రోగాలకు దారితీస్తున్నట్లు అధ్యయనవేత్తలు గుర్తించారు.
రాత్రిపూట ఉండే కృత్రిమ కాంతిని కూడా ‘కాలు ష్యమే’ అంటున్నారు శాస్త్రవేత్తలు. అది ఎంత ఎక్కు వ ఉంటే అంత ఎక్కువ కాలుష్యం అన్నమాట. ఇలా రాత్రిపూట కృత్రిమ కాంతికి, గుండెజబ్బులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ (ఎ.హెచ్.ఎ.) పరిశోధకులు.. ప్రధానంగా మెదడు స్కాన్‌లను పరిశీలించారు.
వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి పర్యా వరణ కారకాల ఒత్తిడి మన నరాలు, రక్తనాళాలను ప్రభావితం చేయటం ద్వారా గుండె జబ్బులకు దారితీస్తాయన్నది తెలిసిందే. అయితే ఇప్పుడు తీవ్రస్థాయి కాంతి కాలుష్యం కూడా అందుకు ఏ మాత్రం తీసిపోలేదని ఎ.హెచ్.ఎ. గుర్తించింది.
గుండెపోటు అవకాశాలు ఎక్కువ
» రాత్రిపూట అధిక స్థాయి కృత్రిమ కాంతికి గురవు తున్న వ్యక్తుల మెదడుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అది రక్తనాళాల వాపునకు కారణం అవుతోంది.
» మెదడు ఒత్తిడిని గ్రహించినప్పుడు అది రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించటం వల్ల రక్తనాళాల్లో వాపు మొదలౌతోంది. క్రమేణా ఈ వాపు... ధమనులు గట్టి పడటానికి దోహ దం చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోంది.
» రాత్రిపూట ఎక్కువగా కాంతి అధికంగా పడిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 47 శాతం ఎక్కువగా ఉంది.
» కృత్రిమ కాంతి ప్రభావం.. నిద్రించే వ్యవధి, శారీరక శ్రమ, సామాజిక ఆర్థిక స్థితిగతులు, పొరుగింటి చప్పుళ్లు వంటి అంశాలతో సంబంధం లేకుండా అందరిపైనా ఒకేలా ఉంటోంది.
» శరీరంపై కృత్రిమ కాంతి ఎక్కువగా పడటం వల్ల దేహధర్మాల సహజత్వానికి అంతరాయం ఏర్పడు
తోంది. ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తోంది. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటోంది. తద్వారా అధిక రక్త పోటు, ఊబకాయం, మధుమేహం మొదలౌతున్నాయి. మెదడులో నాళాలు చిట్లటమూ జరుగుతోంది.
ఇలా తగ్గించుకోవచ్చు
ఇండోర్ లైట్‌లను మసకబార్చటం, వెలుతురును తగ్గించే బ్లాక్ అవుట్ కర్టెన్‌లను ఉపయోగించటం, నిద్రకు ఉపక్రమించే ముందు స్క్రీన్ వర్క్ (స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ వంటివి) ఆపేయటం వంటివి మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
35 శాతం అధికం
అమెరికా, యూకే వంటి దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల ప్రకారం.. 5 ఏళ్ల పాటు రాత్రిపూట అధిక కృత్రిమ కాంతి ప్రభావం వల్ల హృద్రోగాల ప్రమాదం దాదాపు 35% వరకు ఎక్కువగా ఉందని తేలింది. గుండెకు ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సంకోచించే అవకాశాలూ (కరొనరీ ఆర్టెరీ డిసీజ్ – సీఏడీ) ఎక్కువగా ఉన్నాయట.


