పదేళ్ల పాటు 8 ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ సేవలకు టెండర్లు పిలిచిన వైద్య శాఖ
అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టి రూ.కోట్లు కొట్టేసేలా పీపీపీకి ప్రభుత్వం జై
ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ల పేరిట ప్రైవేట్ సంస్థల అక్రమాలు
డబ్బు కోసం రోగులకు అనవసర స్కాన్‌లు, దొంగ బిల్లులతో ఖజానాకు గండి
లాభాపేక్షతో ప్రజల ప్రాణాలతో చెలగాటం..
పీపీపీ దోపిడీకి చెక్ పెట్టాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అడుగులు
ఎంఎస్‌ఐడీసీలో డయగ్నోస్టిక్స్ విభాగం ఏర్పాటుకు చర్యలు
ఇటీవల రాత్రి వేళ కడుపు నొప్పితో ఓ యువతి (19) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పాథాలజీ డాక్టర్ ఆమె సమస్యను సరిగా తెలుసుకోకుండానే సీటీ స్కాన్‌కు రిఫర్ చేశారు.ఏకంగా మూడు స్కాన్‌లు చేశారు. వాస్తవానికి గైనిక్, జనరల్ మెడిసిన్ వైద్యుల సూచన మేరకు అవసరమైతేనే స్కాన్ చేయాలి. కానీ, ఎలాంటి క్లినికల్ నోట్స్ లేకుండా చిన్న రిఫరెన్స్‌తో ఒకేసారి మూడు స్కాన్‌లు చేశారు. యువతి శరీరాన్ని రేడియేషన్‌కు గురిచేశారు.
కొద్ది రోజుల కిందట దాడి ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ) కావడంతో వైద్యుల సూచన మేరకు తలకు సీటీ స్కాన్ చేశారు. ఇదే వ్యక్తికి చెందిన ఆధార్ నంబరుతో మరుసటి రోజు సదరం క్యాంప్‌లో సీటీ బ్రెయిన్ స్కాన్ నిర్వహించారు. అంటే.. 12 గంటల వ్యవధిలో ఒకే వ్యక్తికి రెండుసార్లు స్కాన్.. దీనికి కారణం... ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల డబ్బుల కక్కుర్తి.
వెంకటేశ్ అనే వ్యక్తి కడుపునొప్పితో విశాఖ జీజీహెచ్‌కు వెళ్లగా ఉదరభాగం స్కానింగ్‌కు వైద్యుడు రిఫర్ చేశారు. ఆస్పత్రిలోని పీపీపీ స్కానింగ్ సెంటర్‌లో... లోయర్, అప్పర్, సైడ్ అంటూ ఏకంగా నాలుగు స్కాన్‌లు చేసేశారు.
సాక్షి, అమరావతి : ఈ ఉదాహరణలను గమనిస్తే ప్రభుత్వఆస్పత్రులకు వెళ్లే పేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) సేవల రూపంలో ప్రైవేట్ వ్యక్తులు డబ్బును ఎలా దోచేస్తున్నారో, వారి ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నారో అర్థమవుతోంది. ఈ దందాకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవలను బలోపేతం చేయడం పక్కనపెట్టి... మరో పదేళ్లు పీపీపీ దోపిడీకి లైసెన్స్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)కు చెందిన ఎనిమిది ఆస్పత్రుల్లో పీపీపీ స్కానింగ్ సేవలను తమవారికి కట్టబెట్టడానికి పరుగులు పెడుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే... పదేళ్ల తర్వాత మరో ఐదేళ్లు కాంట్రాక్ట్‌ను పొడిగించేలా టెండర్ నిబంధనలను రూపొందించింది.
కమీషన్ల కోసం అడ్డగోలు దోపిడీకి...
ప్రభుత్వ ఆస్తులు, నిధులను అందినంత దోచేయడానికి ప్రభుత్వ పెద్దలు పీపీపీని ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్న తీరును రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా పీపీపీ ప్రాజెక్ట్‌ల పేరిట పెద్దఎత్తున ప్రభుత్వ నిధులకు గండికొట్టారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ కాంట్రాక్ట్‌లను పదేళ్ల కాల వ్యవధితో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారు. కాగా, ఏపీవీవీపీలో పలు ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ కాలపరిమితి ముగుస్తుండడంతో పాటు, కొత్తగా కొన్ని చోట్ల స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో కమీషన్ల కోసం పీపీపీ విధానానికి మళ్లీ జై కొట్టారు. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు బిల్లులను ఎక్కువగా చూపుతూ భారీఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ఒకే తరహా స్కాన్‌కు రెండు, మూడు రకాలుగా బిల్లులు పెట్టడం, నకిలీ రిఫరల్ స్లిప్స్‌తో స్కాన్‌లు చేసినట్లు చూపడం, అవసరం లేకున్నా రోగులకు ఒకటి కంటే ఎక్కువ స్కాన్‌లు చేస్తూ అటు డబ్బు దండుకుంటూ, ఇటు ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారు. ఒక సీటీ స్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం. అనవసర సీటీ స్కాన్‌లతో కేన్సర్ ముప్పుతో పాటు, శరీరంలోని ఇతర భాగాలపైనా ప్రభావం పడుతుందని అంతర్జాతీయ వైద్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ప్రైవేట్ వ్యక్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వీరు నిర్వహించే స్కాన్‌లు, ఎంఆర్‌ఐలు, బిల్లింగ్‌పై అధికారుల పర్యవేక్షణ లేమి, సరైన ఆడిట్ లేకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
తమవారికి తగినట్లుగా... నిబంధనలతో
ప్రస్తుతం రూ.వంద కోట్లకు పైగా విలువైన సీటీ స్కాన్‌ల కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టేందుకు వారికి తగినట్లు (టైలర్ మేడ్)గా నిబంధనలతో ప్రభుత్వ పెద్దలు టెండర్ డాక్యుమెంట్ రూపొందించారు. పెద్ద ప్రాజెక్టులన్నీ అయినవారికే దక్కేలా చేసేందుకు టెండర్‌లలో క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్)ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. 108, 104 టెండర్‌లలో క్యూసీబీఎస్ ఆధారంగానే కనీస అనుభవం లేని సంస్థకు రూ.వేల కోట్ల కాంట్రాక్ట్ వెళ్లేలా చేశారు.
అలాగే, ఇప్పుడు కూడా ఓ సంస్థతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు దానికే కాంట్రాక్ట్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని వైద్య శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టెక్నికల్ ఎవాల్యుయేషన్‌కు 80, ఫైనాన్షియల్ బిడ్‌కు 20 మార్కుల ప్రమాణంతో టెండర్ నిబంధనలున్నాయి. 80 మార్కుల్లో 25 టెక్నికల్ ప్రజెంటేషన్ ద్వారా అస్మదీయ సంస్థకు వేసుకునే వెసులుబాటు పెట్టుకున్నారు. మరో ఏడు అంశాల్లోనూ కావాల్సిన వారి సంస్థ అనుకూలతల ఆధారంగానే మార్కులు నిర్దేశించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దోపిడీకి వైఎస్ జగన్ సర్కార్ అడ్డుకట్ట
వైద్య రంగంలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ రంగంలోనే అన్ని సేవలను బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ వైద్య, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ)లో ప్రభుత్వం ఆధ్వర్యంలో డయగ్నోస్టిక్స్ విభాగం ఏర్పాటు చేయాలని కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నుంచి ఆస్పత్రులకు సీటీ, ఎంఆర్‌ఐ, క్యాథల్యాబ్స్ వంటి సౌకర్యాలు కల్పించి, ఎంఎస్‌ఐడీసీ నుంచి వాటిని నిర్వహించేలా చూసింది.
రూ.67 కోట్లతో సిటీస్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలను ప్రభుత్వమే సమకూర్చింది. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరులో సిటీ, ఎంఆర్‌ఐ, కడప జీజీహెచ్‌లో సిటీస్కాన్ సేవలను జగన్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో నియమించిన సిబ్బంది వాటిని నిర్వహిస్తున్నారు. ఇక మిగిలిన ఆస్పత్రుల్లో కాంట్రాక్టర్ల గడువు ముగిసినప్పుడు మళ్లీ కొత్తగా ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా.. ప్రభుత్వమే యంత్రాలు సమకూర్చి నిర్వహించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రణాళికలు రచించారు.
తద్వారా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి అడ్డుకట్ట వేసి, రోగులకు నాణ్యమైన సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. కానీ, ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదన్నట్టుగా కూటమి ప్రభుత్వం పీపీపీ దోపిడీ ప్రాజెక్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తోంది.


