ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సరికాదు
కాలేజీలను కేంద్రం, నాబార్డ్ నిధులతో నిర్మిస్తారు
లబ్ధి మాత్రం ప్రైవేటు వ్యక్తులు పొందుతారు
ఇలాంటి కేసుల్లో ప్రజా ప్రయోజనాలనే కోర్టులు పరమావధిగా పరిగణించాలి
హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు
కౌంటర్‌కు గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాది
అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణ నవంబర్ 19కి వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లించినట్లు భారీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఇలాంటి కేసుల్లో ప్రజా ప్రయోజనాలనే కోర్టులు పరమావధిగా పరిగణించాలని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ బుధవారం హైకోర్టును అభ్యర్థించారు.
రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ముందు తాజాగా ఈ పిల్ విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫున శ్రీరామ్ తన వాదనలను వినిపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను లీజుకివ్వడం వల్ల ప్రైవేటు వ్యక్తులు రూ. కోట్లు ఆర్జిస్తారన్నారు. కాలేజీలను కేంద్రం, నాబార్డ్ ఇచ్చే నిధులతోనే నిర్మిస్తారని తెలిపారు. లబ్ధి మాత్రం ప్రైవేటు వ్యక్తులే పొందుతారన్నారు. ప్రభుత్వ వైద్య సేవలకు పేదలు దూరమవుతారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది.


