బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడానికి వీల్లేదు
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదన
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన 811 టీఎంసీలను యథాతథంగా కొనసాగించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అంతర్‌రాష్ట్ర నదీజల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956 సెక్షన్–6(2) ప్రకారం.. ఒక ట్రిబ్యునల్ పరిష్కరించిన జలవివాదాన్ని పునఃసమీక్షించడానికి వీల్లేదని గుర్తుచేసింది. కేంద్రానికి 2013 నవంబర్ 29న కేడబ్ల్యూడీటీ–2 ఇచి్చన తుది నివేదికలో కూడా ఇదే అంశాన్ని పేర్కొందని వివరించింది.
బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించలేదని, ప్రాజెక్టుల వారీగా కేటాయించిందని తెలిపింది. వాటిని పరిగణనలోకి తీసుకునే 2015 జూలై 18–19న కేంద్ర జల్‌శక్తిశాఖ ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేసిందని గుర్తు చేసింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణానది జలాలను పంపిణీ చేయడంపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ తాళపత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన ట్రిబ్యునల్ బుధవారం ఢిల్లీలో విచారణ చేపట్టింది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తుది వాదనలు వినిపించగా.. బుధవారం ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా తుది వాదనలు వినిపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జారీచేసిన జీవో 246ను రద్దుచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏ (ఇంటర్ లొకేటరీ) అప్లికేషన్‌పై విచారణ చేసినప్పుడు.. ఆ అంశం తమ పరిధిలోకి రాదని చెప్పి.. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల పునఃపంపిణీపై ఎలా విచారణ చేపడతారని ట్రిబ్యునల్‌ను ప్రశ్నించారు.
దీనిపై ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్ కుమార్ స్పందిస్తూ అప్పట్లో విభజన చట్టంలో సెక్షన్–89లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వాదనలు విన్నామని, ఆ తర్వాత కేంద్రం అదనపు విధివిధానాలను జారీచేసిందని తెలిపారు. ఇప్పుడు తమ పరిధి పెరిగిందని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడంపై వాదనలు వింటామని చెప్పారు. తర్వాత జయదీప్ గుప్తా వాదనలు కొనసాగిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాలను బేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలా? రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? అనే అంశంపై ట్రిబ్యునల్ విచారించి.. 2016 అక్టోబర్ 19న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు.
కానీ ఇప్పుడు ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ–1956లో సెక్షన్–3 ప్రకారం విచారణ చేస్తున్నారని, ఇది 2016 అక్టోబర్ 19న జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని చెప్పారు. సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిలో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా.. అదనపు విధివిధానాలను నిర్దేశిస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ తప్పులతడకగా అభివర్ణించారు. విభజన చట్టంలో సెక్షన్–89లో నిర్దేశించిన మార్గదర్శకాలకే పరిమితమై రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, రెండు రాష్ట్రాల అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు విచారణకు హాజరయ్యారు.
విచారణ నవంబర్ 25–27కు వాయిదా
షెడ్యూలు ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారం నుంచి శుక్రవారం వరకు కొనసాగాలి. కానీ ట్రిబ్యునల్ సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత పనులు ఉండటంతో బుధవారం విచారణను వచ్చే నెల 25, 26, 27 తేదీలకు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. వచ్చే నెలలో జరిగే విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా తుది వాదనలను కొనసాగించనున్నారు.


