గాంధార నవ్వు | Weekly Evaram Katha Funday | Sakshi
Sakshi News home page

గాంధార నవ్వు

May 17 2026 1:32 PM | Updated on May 17 2026 1:53 PM

Weekly Evaram Katha Funday

‘‘నాన్నా! నీకు ఫోన్‌ వచ్చింది.’’ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతూ, వరండాలో బూట్లు పాలిష్‌ చేసుకుంటున్న ఆనంద్‌కు వినిపించింది కూతురి అరుపు.‘‘ఎవరమ్మా, పేరు చూడు.’’ అన్నాడు తన పని ఆపకుండా. ‘‘ప్రవల్లిక అమెరికా... అంట నాన్నా.’’ కూతురి మాట ఇంకా పూర్తవకముందే, పాలిష్‌ మధ్యలోనే ఆపేసి ‘‘లిఫ్ట్‌ చేయొద్దూ...’’ అని అంటూ చటుక్కున పైకి లేచాడు. కూతురు ఎక్కడ కాల్‌ లిఫ్ట్‌ చేస్తుందో అని హడావిడిగా ఇంట్లోకి కదిలాడు. ఈ తొందరలో అప్పటికే పాలిష్‌ పూర్తయిన ఒక షూ కాలికి తగులుకొని దూరంగా పడింది.

ఈలోగానే ‘‘సరే నాన్నా..’’ అంటూ కూతురి మాటతో పాటు ఫోన్‌ మోగుతున్న శబ్దం ఆగిపోవడంతో కాస్త నెమ్మదించాడు.కూతురి చేతుల్లోంచి మొబైల్‌ తీసుకుని, మళ్లీ కాల్‌ వస్తుందేమో అని కాసేపు వేచి చూశాడు. రాకపోవడంతో తిరిగి చార్జింగ్‌ పెట్టబోయి, ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం మానుకున్నాడు. మొబైల్‌ను ప్యాంట్‌ జేబులోకి తోశాడు. ఇదంతా వంటింట్లోంచి గమనిస్తోంది మీనాక్షి. 

‘‘మాట్లాడడం ఇష్టం లేకపోతే బ్లాక్‌ చేయమని చాలాసార్లు చెప్పాను...’’ భర్తకు వినపడేలా గట్టిగా అంది.ఏమీ పలకలేదు ఆనంద్‌. ఆఫీస్‌కు రెడీ అవడంలో మునిగిపోయాడు. ‘‘.. అయినా, తను ఏం అడుగుతోంది? ఒకసారి కలసి మాట్లాడాలనే కదా? కలిపిస్తాననో కలిపించననో చెప్పొచ్చు కదా? ఇలా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకుండా, మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతేనా?..’’ ఈసారి మరింత గట్టిగా వినిపించింది వంటగది నుంచి.

‘‘ఏం నేనే చెప్పాలా?..నువ్వు చెప్పకూడదా? నీకూ ఫ్రెండే కదా?..’’నోరు తెరవొద్దనే నియమం మరచిపోయి అసంకల్పితంగా అనేశాడు. ఆ మాటతో విసురుగా హాల్లోకి వచ్చేసింది. ‘‘ఆ విషయం దానికి తెలియదా? అయినా నన్ను కాకుండా మిమ్మల్నే ఎందుకు అడుగుతోంది? మీ ఇద్దరూ జాన్‌ జిగిరీలు... నువ్వు చెబితే ఏమైనా చేస్తాడు. ఏదైనా వింటాడనే కదా? లేకపోతే తనే నేరుగా వెళ్లలేదా?.’’ దగ్గరికి రావడం వల్ల కాబోలు అరుస్తున్నట్లు వినబడింది. 

ఈసారి మాత్రం నోరు తెరవలేదు ఆనంద్‌. తెరిస్తే పెద్ద యుద్ధమే! అంతేకాదు, మరో నిమిషంలోనో అర నిమిషంలోనో అదే నెంబరు నుంచి మీనాక్షికి కాల్‌ వస్తుందనీ తెలుసు. అందుకే తిరిగి తన పనిలో తాను లీనమయ్యాడు. ఊహించినట్లే కాసేపటికి మీనాక్షి ఫోన్‌ మోగింది. భర్తను కొరకొరా చూస్తూ ఫోన్‌ తీసింది. కాసేపు మాట్లాడాక స్పీకర్‌ ఆన్‌ చేసింది. అటువైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘అన్నయ్యా... మీరు నాతో ఎందుకు మాట్లాడరో నాకు తెలుసు. నన్ను తన దగ్గరికి తీసుకెళ్లమని మిమ్మల్ని ఇకపైన అడగను. ఎందుకంటే, నేనే వెళ్లి కలుస్తాను. రెండ్రోజుల్లో ఇండియాకు వస్తున్నాను. కానీ, మిమ్మల్ని, మీనాక్షిని, పాపను చూసే అవకాశం మాత్రం ఇవ్వన్నయ్యా!’’ అంటూ అభ్యర్థనగా పలికింది ప్రవల్లిక గొంతు. 

సమాధానం కోసం అటువైపు నుంచి ఎదురు చూస్తున్నట్లు భార్యాభర్తలిద్దరికీ అర్థమవుతోంది. 
ఏం జవాబు చెప్తాడో అని ఆనంద్‌ వైపే చూస్తోంది మీనాక్షి. అది గమనించి ‘సరే’ అని అంగీకరిస్తున్నట్లు తలూపి, హడావిడిగా ఇంటి నుంచి బయటపడ్డాడు. ఈ తొందరలో క్యారియర్‌ తీసుకోవడం మర్చిపోయి వెళుతున్న భర్తనే చూస్తూ ప్రవల్లికతో మాట్లాడుతోంది మీనాక్షి. 
∙∙ 
ఆఫీస్‌కు వచ్చాడే గాని, పనేమీ చేయాలనిపించడం లేదు. కాసేపు అన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. తలనొప్పి ప్రారంభమైనట్లు అనిపించడంతో క్యాంటీన్‌ బాట పట్టాడు. ఎవరూ లేని టేబుల్‌ దగ్గర కుర్చీలో కూర్చొని, కాస్త కాఫీ తాగాక ఆనంద్‌ ఆలోచనలు గతం వైపు పరుగు తీశాయి. 

ఆనంద్, రామకృష్ణ ఇద్దరూ ఇంటర్‌ నుంచి ఫ్రెండ్స్‌. ఒకే ఊరు, ఒకే గ్రూప్‌ కాకపోయినప్పటికీ అనుకోకుండా అయిన పరిచయం వాళ్లిద్దర్నీ మంచి స్నేహితులుగా మార్చింది. ఆ బంధం డిగ్రీలోనూ కొనసాగింది. అయితే, అక్కడా ఇద్దరివీ వేర్వేరు గ్రూపులే. ఒకరు బీఎస్సీ, మరొకరు బీకామ్‌. వీరి స్నేహం కాలేజీలో చాలామందికి విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే ఆనంద్‌ నెమ్మదస్తుడు. తక్కువ మాట్లాడతాడు. బాగా దగ్గరైతే తప్ప ఎక్కువగా నోరు విప్పడు. అయితే, చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్టే. 

రామకృష్ణ చదువులో మరీ ఫస్ట్‌ ర్యాంక్‌ స్థాయి కాకపోయినా, మెరిట్‌ స్టూడెంటే. అయితే, ఆటల్లో, కాలేజీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం అందరికంటే ముందుంటాడు. చలాకీగా, జోష్‌గా ఉండే రామకృష్ణ తీరు కాలేజీలో అమ్మాయిలకు ఎంతో నచ్చేది. దానికి తోడు కాస్త అందగాడు కూడా కావడంతో మొదటి ఏడాదిలోనే లవర్‌బాయ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే, అందరూ అతని పేరులోని రాముణ్ణి వదిలేసి కృష్ణుణ్ణి మాత్రమే గుర్తుచేసేలా.. ‘క్రిష్‌’ అని పిలుచుకునేంతగా.

ఆ కాలేజీలోనే వీళ్లకు ప్రవల్లిక, మీనాక్షి పరిచయం. వీళ్లది ఒకే ఊరు. కానీ, కాలేజీలో మాత్రం ప్రవల్లిక బీకామ్, మీనాక్షి బీఏ. అందువల్ల మధ్యాహ్నం లంచ్‌ సమయంలోనో, క్యాంటీన్‌లోనో, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడో తప్ప మీనాక్షి ఎక్కువగా వీళ్లతో కలిసేది కాదు. మరీ అంత నల్లగా కాకుండా, చామన ఛాయతో, కొంచెం బొద్దుగా కనిపించే ప్రవల్లిక మొహంలో కళ బాగుండేది. మొదటి ఏడాదిలోనే ఆనంద్‌కు, రామకృష్ణకు మంచి స్నేహితురాలైంది. ఆ ప్రయాణంలోనే రామకృష్ణ మీద ఏర్పడిన ఇష్టం ప్రేమగా మారింది. చివరి ఏడాది హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు ముగిసిన రోజు తన మనసులోని మాటల్ని అక్షరాలుగా చేసిన ప్రేమలేఖను రామకృష్ణకు ఇచ్చింది.

కానీ, వారం రోజులు ఎదురు చూసినా రామకృష్ణ నుంచి సమాధానం లేదు. రోజూ కాలేజీలో, క్లాసులో మాట్లాడడం, కలసి లంచ్‌ చేయడం అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కానీ, రామకృష్ణ అభిప్రాయం మాత్రం చెప్పలేదు. రెండు మూడుసార్లు అడిగి చూసింది. అయినా జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు. ఉండబట్టలేక విషయాన్ని ఆనంద్‌కు చెప్పింది. అప్పటికే తనకు ఇద్దరు లవ్‌ ప్రపోజ్‌ చేశారని, లెటర్లు ఇచ్చారని చెప్పిన రామకృష్ణ– ప్రవల్లిక గురించి తన దగ్గర దాచడం ఆనంద్‌కు ఆశ్చర్యమనిపించింది. 

అదే విషయం గురించి సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరాక మిత్రుడిని కదిపాడు. 
ఆరోజు రామకృష్ణ చెప్పిన సమాధానం విన్నాక, ఆ తర్వాత ఆనంద్‌ కూడా ప్రవల్లికను తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ప్రవల్లిక అడిగినా మాట దాటవేసేవాడు. మరో ఆర్నెల్లు గడిచి, డిగ్రీ పూర్తవగానే ఈసారి చదువు వాళ్లను విడదీసింది. ఎంసీఏ చేయడానికి ఆనంద్‌ హైదరాబాద్‌కు, సీఏ చేయడానికి రామకృష్ణ విజయవాడకు, పీజీ చేయడానికి ప్రవల్లిక తిరుపతికి వెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత చదువులు పూర్తవడం, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. 

ఆనంద్‌కు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని, మీనాక్షి ఇంట్లో వాళ్లతో మాట్లాడి వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించింది ప్రవల్లికే. ‘‘సార్‌.. మేనేజర్‌గారు పిలుస్తున్నారు..’’ అనే పిలుపుతో ఆనంద్‌ ఆలోచనలు చెదిరిపోయాయి. వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి మొహం కడుక్కొని, క్యాబిన్‌కు వెళ్లి మేనేజర్‌ను కలిశాడు. సాయంత్రం వరకు ఆఫీసులో అన్యమనస్కంగానే గడిపి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అడుగుపెట్టగానే పొద్దున్నుంచి పరిస్థితిలో ఏమీ మార్పు లేదని గ్రహించాడు.

మీనాక్షి ఏమీ మాట్లాడకుండా, తన పని తాను చేసుకుపోతోంది. మధ్య మధ్యలో విసిగిస్తున్న కూతుర్ని కోప్పడుతోంది. అదంతా తన మీద కోపమే అని ఆనంద్‌కు తెలుసు. భోజనాలు అయిపోయి, కూతుర్ని బెడ్రూమ్‌లో నిద్రపుచ్చిన తర్వాత హాల్లో టీవీ ఆన్‌చేసి కూర్చుంది మీనాక్షి. ‘ఇక తప్పదు ఈరోజు చెప్పాల్సి వచ్చేలా ఉంది’ అని మనుసులో అనుకుంటూ తాను కూడా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ‘‘ఇంతకీ ఏమంటోంది మీ ఫ్రెండ్‌..’’ అంటూ నోరుతెరిచాడు. భర్తను సీరియస్‌గా చూసింది మీనాక్షి. ‘‘ఏమంటుందో మీకు తెలియదా?’’ ఎదురు ప్రశ్నించింది. ‘‘తెలుసు... కానీ...’’ అని ఏదో చెప్పేలోపే అందుకుంది. 

‘‘అయినా... అది రెండేళ్ల నుంచి మిమ్మల్ని ఏమడుగుతోంది? తనను రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్లి ఒక్కసారి మాట్లాడనివ్వమనే కదా? తీసుకెళ్లడానికి మీకేంటి బాధ? తనేమైనా చిన్నపిల్లా... పన్నెండేళ్ల తర్వాత భర్తను, పిల్లల్ని వదిలేసి ఇండియాకు వచ్చి రామకృష్ణను పెళ్లి చేసుకోవడానికి? అయినా, తను అనుకుంటే సరిపోతుందా? భార్య, పిల్లల్ని వదిలేసి రామకృష్ణ అయినా ఎలా చేసుకుంటాడు దీన్ని?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మౌనంగా వింటున్నాడు. 

‘‘రామకృష్ణ ఎందుకు వద్దనుకున్నాడు? ఏ విషయం చెప్పకుండా ఎందుకు తప్పించుకు తిరిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసమే కదా తనని కలుస్తానంటోంది? మరి మీరెందుకు కలపడానికి ప్రయత్నించడం లేదు? అసలు మీ ఫ్రెండ్‌ ఆరోజు ఏమన్నాడో కనీసం నాకైనా చెప్పొచ్చుకదా?’’ అంటూ ఆగింది. ఇక తప్పదనుకొని నోరు విప్పాడు ఆనంద్‌. కాలేజీలో ప్రవల్లిక రాసిన ప్రేమలేఖ గురించి అడిగిన రోజు తనతోపాటు మిత్రుణ్ణి వాళ్ల ఊరికి తీసుకెళ్లాడు రామకృష్ణ. 

ఊరికి అరకిలోమీటరు దూరంలో ఒక పొలంలో ఉన్న ఆ ఇంట్లో రాత్రి భోజనాలయ్యాక, మిద్దె మీద పడుకొని ఉండగా మళ్లీ విషయం కదిపాడు ఆనంద్‌. సమాధానం చెప్పకుండా, దూరంగా ఊళ్లో కనిపిస్తున్న కొన్ని ఇళ్లను చూపించాడు రామకృష్ణ. ‘‘ఆ పెద్ద పెద్ద ఇళ్లు మా దాయాదులవి. ఇంకా చెప్పాలంటే... మా పెద నాన్న, చిన్నాన్న వాళ్లవి. వాళ్ల కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కలిపి అందరూ నలభైమంది వరకు ఉంటారు. కానీ, వాళ్లెవరూ మాతో మాట్లాడరు. ఎందుకో తెలుసా?..’’ అంటూ ఆనంద్‌ వైపు చూశాడు. తెలియదన్నట్లు ఆనంద్‌ ప్రశ్నార్థకంగా మొహంపెట్టాడు.

‘‘మా నాన్న పెళ్లి... తాతయ్యకు, అమ్మమ్మకు... ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకుండా చేసుకున్న ప్రేమ పెళ్లి. తనను ఇష్టపడిందని మా అమ్మను చేసుకున్నాడు. మా అమ్మ తరఫు వాళ్లు ఏమీలేనోళ్లు. అయినా, కట్నం కూడా లేకుండా చేసుకున్నాడు. ఇంట్లోవాళ్లెవరూ ఈ పెళ్లిని ఒప్పుకోకపోవడంతో తన వాటాకు వచ్చిన భూమిలో ఈ ఇల్లు కట్టుకొని వాళ్లందరికీ దూరంగా ఉంటున్నాడు. ముగ్గురు కూతుళ్లు, తర్వాత నేను పుట్టాక అమ్మ అనారోగ్యం పాలైంది. 

పంటలు కలిసి రాలేదు. అక్కలకు పెళ్లి చేసేసరికి మాకు మిగిలింది రెండెకరాల ఈ పొలం... అందులోని ఈ ఇల్లు...’’ అంటూ ఆగాడు. తన మాటల్లోని భావం కొంచెం కొంచెం అర్థమవసాగింది ఆనంద్‌కు. ‘‘ఓహో మీ నాన్నకు జరిగినట్లే నీకూ జరుగుతుందని ప్రేమ పెళ్లి వద్దనుకుంటున్నావా? అలాగయితే మరి ఈ విషయం నేరుగా ప్రవల్లికకే చెప్పొచ్చు కదా? అసలు ప్రవల్లిక అంటే ఇష్టం ఉందా లేదా?’’ అన్నాడు ఆనంద్‌.

వెంటనే రామకృష్ణ. ఇంట్లోకి వెళ్లి రెండు లెటర్లు తీసుకొచ్చాడు. అవి అదే క్లాస్‌లో ఉండే మరో ఇద్దరు అమ్మాయిలు రాసిన ప్రేమలేఖలు. ‘‘ప్రవల్లికే కాదు... వీళ్లన్నా నాకు ఇష్టమే. కానీ, వీళ్లెవరికీ నేను కోరుకునేంత ఆస్తి లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్లదీ మాలాంటి బతుకే...’’ స్నేహితుని నోటి నుంచి వస్తున్న మాటలు వింటూ తన నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ‘అయితే, ఆస్తి కోసమా ప్రవల్లికను వద్దనుకుంటున్నది?!’ 

ఆనంద్‌ మనసులోని మాటను చదివేసినట్లు చెప్పసాగాడు రామకృష్ణ. ‘‘అవును. ఆస్తి కోసమే వద్దనుకున్నాను. ఆస్తే కాదు వీళ్లెవరూ అంత అందంగానూ లేరు. మిగిలిన ఇద్దరూ కొంచెం తెల్లగా అయినా ఉన్నారు. ప్రవల్లిక అయితే నలుపు. పైగా లావు. అయినా, పెళ్లి, జీవితం విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకోసమే నన్ను నేను మలచుకున్నాను. అమ్మాయిలు ఇష్టపడేలా తీర్చిదిద్దుకున్నాను. అలాగని ఎవరిని పడితే వాళ్లను చేసుకోవడానికి కాదు. 

చదువు అయిపోయాక, ఉద్యోగంలో ఎంత సంపాదిస్తామో తెలియదు. కానీ, కట్నం దండిగా తెచ్చే అందమైన అమ్మాయి భార్యగా రావాలని, మమ్మల్ని దూరం పెట్టిన మా వాళ్లందరూ కుళ్లుకునే స్థాయికి మేము ఎదగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా? ’’ అంటూ ఆగాడు. ఏమీ మాట్లాడలేదు ఆనంద్‌. అన్ని రోజులూ స్నేహితునిలో తాను గమనించలేకపోయిన మరో కోణం బయటపడేసరికి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ..‘‘అదీ జరిగిన విషయం..’’ అంటూ చెప్పడం ముగించి మీనాక్షి వైపు చూశాడు ఆనంద్‌. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. 

‘‘ప్రవల్లికకు వాడంటే చాలా ఇష్టం. ఎంతిష్టం అంటే.. నువ్వన్నట్లు వాడు ఓకే చెబితే భర్త, పిల్లల్ని వదిలేసి అమెరికా నుంచి వచ్చేసేంత ఇష్టం. కానీ, తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఏ కారణంతో తనను వద్దనుకున్నాడో తెలిస్తే తట్టుకోలేదు. అంతేకాదు, రామకృష్ణ ఆలోచనలు ఇలాంటివని తెలిస్తేనే భరించలేదు. అందుకే చెప్పలేదు. తనని కలవనివ్వలేదు. ‘తనను ఎందుకు ఇష్టపడలేదు?’ అనే ఆలోచన కన్నా ఇలాంటి కారణంతో తనను వద్దనుకున్నాడని జీవితాంతం గుర్తుచేసుకుంటూ బతకడం చాలా కష్టం’’ అంటూ ముగించాడు. మీనాక్షి ఏమీ మాట్లాడకపోయేసరికి లేచి బెడ్రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
∙∙ 
చెప్పినట్లుగానే రెండ్రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చింది ప్రవల్లిక. నేరుగా శ్రీనగర్‌ కాలనీలోని ఆనంద్‌ ఇంటికి చేరింది. బాగా సన్నబడి, కాస్త తెల్లగా కూడా మారిపోయి, తమ కంటే చిన్నదానిలా కనిపిస్తున్న ప్రవల్లికను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. కుశలప్రశ్నలు, కుటుంబాల సంగతులు, కాలేజీ కబుర్లు అన్నీ చెప్పుకున్నాక రామకృష్ణను కలిసే విషయం ప్రస్తావించింది. 

అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ఆనంద్‌ ‘మరుసటి రోజు కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో పెళ్లి రిసెప్షన్‌కు రామకృష్ణ వస్తున్నాడని, ఆరోజు వెళ్లి కలుద్దామ’ని చెప్పాడు. ‘సరే’ అంది ప్రవల్లిక. అయితే, అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు తాను తిరిగి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్‌ బుక్‌ చేసుకున్నానని, రామకృష్ణను కలిశాక గచ్చిబౌలిలోని తన ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లి అట్నుంచటే ఎయిర్‌పోర్టుకు వెళతానని చెప్పింది. 

తర్వాతి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి రిసెప్షన్‌ జరిగే చోటుకు కారులో చేరుకున్నారు. అప్పటికే అక్కడ ప్రవల్లిక స్నేహితురాలు కారుతో సిద్ధంగా ఉంది. ప్రవల్లిక కారులోంచి దిగుతుండగా... ‘‘అదిగో అక్కడ తన ఫ్యామిలీతో ఉన్నాడు చూడు’’ అంటూ వేలును ఒక వైపు చూపించాడు ఆనంద్‌. అటువైపు చూసింది ప్రవల్లిక.‘‘ఎవరూ... అతనేనా? ’’ ‘‘అవును... అతనే ’’‘‘ఆ పక్కనున్నది?’’        

‘‘వాళ్లు తన భార్య, పిల్లలు. అన్నట్లు మీనాక్షి చెప్పే ఉంటుంది... రామకృష్ణ చేసుకున్నది తన కంపెనీ ఓనర్‌ కూతుర్నే... సరే, అవన్నీ వాళ్లను కలిశాక తీరిగ్గా మీరే అన్ని విషయాలూ మాట్లాడుకుందురు గానీ... రండి’’ అంటూ ముందుకు కదిలాడు. ప్రవల్లిక ఏమీ మాట్లాడలేదు. కారు దిగి, అక్కడే నిలబడి చూస్తోంది. ఉన్నట్లుండి నవ్వడం మొదలుపెట్టింది. తెరలు తెరలుగా... ఆపకుండా... ఆపుకోలేనంతగా... కళ్లలోంచి నీళ్లొచ్చేంతగా నవ్వుతోంది. ఆమె నవ్వుతున్నా చూపు మాత్రం రామకృష్ణ ఫ్యామిలీ వైపే ఉంది. 

దూరంగా బట్టతలతో, బాన పొట్టతో రామకృష్ణ... పక్కనే నిండుగా నగలు వేసుకొని, నల్లగా... భారీ ఆకారంతో భార్య... వాళ్లిద్దరి పక్కనే అమ్మ పోలికలతో నల్లని రంగులో మెరుస్తున్న ముగ్గురు కూతుళ్లు...కాసేపటి తర్వాత కాస్త తమాయించుకొని ‘‘వెళ్లొస్తా అన్నయ్యా... బై మీనాక్షి’’ అంటూ వెనకే ఆగి ఉన్న తన ఫ్రెండ్‌ కారులో కూర్చుంది. ఆనంద్‌కు ఏమీ అర్థంకావడంలేదు. ‘కలుస్తాను... కలుస్తాను అని రెండేళ్లుగా అడుగుతూ ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోవడం ఏంటి?’

అదే విషయం అడిగాడు. ‘‘కలవాలని ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా?!... నువ్వేంటి మాట్లాడకుండా నిల్చున్నావ్‌?! నువ్వైనా చెప్పు’’ అంటూ మీనాక్షి వైపు చూశాడు. భార్య మొహంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఆమె మౌనం చూశాక... రామకృష్ణ గురించి తాను చెప్పిందంతా శ్రీమతి ముందే చేరవేసిందని అర్థమవసాగింది.

కలవకుండా వెళ్లిపోవడం వరకు ఓకే... కానీ, ఆ నవ్వు ఎందుకో అతనికే కాదు మీనాక్షికీ అర్థం కావడం లేదు. రామకృష్ణ రూపం, నిజస్వరూపం ప్రత్యక్షంగా చూశాక... తనను వద్దనుకోవడానికి చెప్పిన కారణాలు ఇప్పుడు అతని చుట్టూనే ఉండడం గమనించాక... ఏళ్లుగా తాను పడుతున్న బాధ ఎంత అసంబద్ధమో తెలిశాక... ప్రవల్లిక అంతరాల్లోంచి నవ్వు అలా తన్నుకొని స్వేచ్ఛగా బయటికొస్తోందని వాళ్లకు తెలియదు.  వెళుతున్న కారువైపే చూస్తున్నారు. ప్రవల్లిక పగలబడి నవ్వడం కారు అద్దంలోంచి వాళ్లకు కనిపిస్తోంది. అది... అడవి కాచిన వెన్నెల లాంటి నవ్వు... అది గాంధార నవ్వు. అది తనకు మాత్రమే సొంతమైన, తన కోసమే కురుస్తున్న చక్కటి, చిక్కటి, చల్లని నవ్వు.  

గౌకనపల్లె మహేశ్వరరెడ్డి 

(చదవండి:  ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు

Advertisement
 
Advertisement
Advertisement