‘‘ఆహా... జిల్లా అయిపోవడంకాదు గాని, ఏందసి పట్టింది ఈ ఏరియాకి! ఒకప్పుడు దెయ్యాలు తిరిగే సోటిది. నా సిన్నపుడు సేపలు పడ్డానికి కూడా ఇటైపు రావడానికే బయమేస్సీది..’’ నిర్మానుష్యంగా కంకరరోడ్లతో అక్కడక్కడా వేసిన కరెంటు స్తంభాల్ని, కట్టిన భవంతుల్ని చూస్తూ అన్నాడు మరియదాసు.‘‘ఎద్దెప్పుడు ఒకేపక్క తొంగోదు. ఊరెప్పుడూ ఒకేలాగ ఉండిపోదు సిన్నాన్న. ఆటో వచ్చీసింది. పద... పద... సామాన్లు దించిద్దుము.’’ దూరంగా నిల్చున్న ఇద్దరిలో ఒకడైన కృపారావు నడుస్తూ అన్నాడు. రంగులు వేయని భారీ మట్టివిగ్రహంలా బూడిద రంగులో వారివెనుకే అంతెత్తున కనిపిస్తోంది కొత్త ఇల్లు.ఆటోలో నుంచి బకెట్లు, బ్లేడ్లు, పుట్టిబస్తాలు, కేరేజీలు కిందకి దించి; లోపల వాటిని జాగ్రత్తగా భద్రపరచారు.
విశాలమైన రూములు, కిచెన్, వెయిటింగ్ హాల్, ఔటర్ బాత్రూమ్, లావెట్రీలతో చుట్టూ కాంపౌండ్ వాల్‌తో ఇల్లు ముచ్చటగా వుంది. నడివేసవి. ఉదయం పదిగంటల సమయం. బహిరంగప్రదేశం అయినప్పటికీ వాతావరణంలో ఉక్కపోత. ముందు రూమ్‌లో ముగ్గురూ వరసలో నిలబడి అర్ధనిమీలిత నేత్రాలతో, భక్తిప్రపత్తులతో చేతులు జోడించి నోరు విప్పారు.‘‘ఆదియునూ అంతమునూ అయిన యేసయ్యా... లోకంలో సర్వశక్తిమంతుడైన ప్రభువా... మేము ఈరోజు నుంచి తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమగునటుల...’’ దైవప్రార్ధన ముగిసింది. ఒంటిమీద షర్టుల్ని, ఫాంటుల్ని విప్పి ఒక దగ్గర ఒబ్బిడిగా ఉంచి, షార్ట్‌లు, బనియన్లు వేసుకున్నారు.పెద్దబ్లేడ్లతో గోడల్ని గీకే పనిని కృపారావు, ఎర్రయ్య మొదలుపెట్టారు. బకెట్లో మెషిన్ ఆన్ చేసి పుట్టి పౌడర్‌ను నీటితో కలియబెట్టే పనిలో పడ్డాడు దాసు.‘‘సిన్నాన్న... మనలో మన మాట. ఇల్లు సూస్తే పెద్దది.
పని చేస్తే ఎక్కువే. ఓనరు ఇచ్చిన లచ్చాఏభైవేల వర్కులో మన కూల్లు పోగా మనకేటైనా మిగుల్తాదా?’’ తొలి ప్రశ్న వేసేడు పాతికేళ్ల కృపారావు.‘‘నీకా డవుటేల? అందిన కూల్లే మనకు గట్టి.’’ బ్లేడ్లకు సర్దిన పుట్టిముద్దను గోడకు రాస్తూ అన్నాడు దాసు.‘‘మరి ఇంతోటి పనిని కాంట్రక్టుకి సెయ్యడమేల?’’‘‘సెయ్యక ఏటి సేస్తామురా? మనుషులెట్టి, లచ్చలకు లచ్చలు మదుపులెట్టి కాంట్రాక్టు పనులు సేస్తూ బొక్లీసుగా తిరగడానికి మనకాడ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులున్నాయేటి? కూలాడితేనే గదా కుండాడతాది...’’‘‘అవునులే సిన్నన్నా.’’‘‘అందికే అన్నీ మూసుకొని మన పని మనం కామ్‌గా సేసుకోవాల. ఇలాంటి పనులు సెయ్యమని నిగడదీసి తొంగుంటే నష్టం మనకే, ఆలకి కాదు. కూడు జల్లితే కాకులు కరువా! ఇరవైరోజుల్లోన ఈ వర్క్ అయిపోవాలట. అద్దమైందా...’’ దాసు మాటకి బుద్ధిగా తలూపేడు కృపారావు‘‘షాపు ఓనర్ల పనే బాగుందన్నా.
ఒక పక్క ఏపారాలు, మరోపక్క లాభాలు...’’ నవ్వాడు ఎర్రయ్య.‘‘షాపు ఓనరుకి మనతోన అగ్రిమెంట్ లక్షాఏభై. ఇంటి ఓనరుతో ఎంతకి వప్పన్నమో మనకి తెలీదు. అయినా అతనెంత తింటే మనకెందుకు? మన పని మనం సూస్కోవాలి గానీ...’’మొదటి రూమ్ పుట్టిపని పూర్తయ్యింది. రెండో రూమ్ కోసం సిద్ధమవుతున్నాడు దాసు.ఇంతలో టీలు వచ్చాయి. ముగ్గురూ టీలు తాగి విశ్రాంతిగా కూర్చున్నారు. నోట్లో ఒంపుకున్న ఖైనీలు పళ్లకింద నలుగుతున్నాయి.మధ్యాహ్నం రెండింటికి అన్నాలు తిని పని ముగించేసరికి చీకటి పడింది. ఇరవైయ్యో రోజున ఇంటి ఓనరు వచ్చాడు. మార్పు చేర్పులేవో చెప్పాడు. దానికో రోజు పట్టింది. తర్వాత రోజు సాయంత్రం.., గంగరాజు షాపు దగ్గరికి ముగ్గురూ చేరేరు. అంతవరకూ ఇచ్చిన మెటీరియల్ మొదలుకొని ఆటోచార్జీలు, నిచ్చెనల అద్దె వరకూ అయిన ఖర్చులన్నీ లెక్కలేసి చివరకు లక్షాఏభై మూడువేలుకు బిల్లు తేల్చాడు షాపు ఓనరు.
అదనంగా తనకు మూడు వేలు ఖర్చయ్యిందని కనుక చివరిరోజు కూలీ రాదని దాసుతో చావుకబురు చివరికి చల్లగా చెప్పాడు. అవాక్కయ్యాడు దాసు. కృపారావుకి ఒళ్ళు మండింది.‘‘ఇదన్నేయం... కూలీ ఇవ్వననడం మీకు దరమ్ము కాదు.’’ బతిమాలుతున్న ధోరణిలో ఆక్రోశించాడు దాసు. పక్కనున్న గొడౌన్‌లోకి వెళ్లేందుకుగాను కిందకు దిగిన గంగరాజు సన్నగా నవ్వి అన్నాడు..‘‘చివరిరోజు కూలీ నీక్కావాలి. మంచిదే. కాదనను. కానీ అనుకున్న దానికంటే మూడు వేలు ఎక్కువయ్యింది. మరి దాని మాటేటి? ఇరవై రోజుల్లో పనవ్వాలని కండిషను. అయ్యిందేటి? ముందే కంప్లీట్ చేసేస్తే కాదంటానా? మిగిల్తే తీసుకోవడానికి రడీగా ఉన్నప్పుడు తగిలినప్పుడు కూడా భరించాలోయ్.
రోజంతా పన్చేసి వట్టిసేతుల్తో ఇంటికి తిరిగి ఎలాగెల్లమంటారు సర్..’’ అన్నాడు కృపారావు.‘‘సరే. మీ కూలీ మీకిచ్చేస్తాను. కానీ నాకో పని చెయ్యాలి.’’‘‘ఏటి సార్ అది?’’‘‘పుట్టిబస్తాలు, రంగుడబ్బాల లోడు రేపొస్తది. మనషాపు ముందే వేను ఆపుతాడు. మీ ముగ్గురూ ఉదయం ఏడింటికల్లా వచ్చి పెరిగీయండి. చాలు... ఎంత... రెండు గంటల పని. మీ డబ్బులు మీకిచ్చేస్తాను. ఇంకో పనికి కూడా మీరు వెళ్లిపోవచ్చు.’’ తను చెప్పాల్సింది చెప్పి గోడౌన్‌లోకి దూరిపోయాడు ఓనరు.ముఖాలు వేలాడేసుకొని ముగ్గురూ ఇళ్లకు తిరిగొచ్చేశారు. నీళ్లలో ఉడుకుతోన్న గవ్వసున్నం మాదిరిగా దారిపొడవునా కృపారావు కుతకుతలాడుతూనే ఉన్నాడు. జేవురించిన ముఖంతో ముద్దగా ఉండిపోయాడు దాసు.రాత్రి పదకొండయ్యింది. కృపారావుకి చాలాసేపు నిద్ర పట్టలేదు.
చివాల్న లేచి బయటకి వచ్చాడు. ఆరుబయట వేసుకున్న మంచాలపై పగలంతా పడ్డ కష్టాన్ని మరిచి మత్తుగా నిద్రపోతోంది ఇందిరా కాలనీ. ఎక్కడో వీధికుక్కొకటి అరుస్తూ ఉంది. ఎదురింట్లోకి వెళ్లి నిద్రపోతున్న దాసుని తట్టి లేపాడు.కృపారావుని అలా చూసేసరికి దాసుకి నిద్రమత్తంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.‘‘ఎక్కడా సూడనేదు ఇంత అన్నేయం... అన్ని కర్సులు మన మీద పడీసి అనవసర కండీషన్లు పెట్టీసి, సివరికి ఒకపూట కూలీ ఎగ్గొట్టీసి మల్లీ రేపు పనికొస్తే డబ్బులు ఇస్తానంటాడా... ఏటి ఆడికంత సోస. మనకేటి సేతకాదన... సెయ్యలేమన... అసలు తప్పు ఆడిది కాదు, నీది. ఎంటనే కాలరు పట్టుకొని నలుగుర్లో కడిగీసి ఉంటే దెబ్బకి అటో ఇటో తేలిపోను.
ఇప్పుడు సూడు... సచ్చినట్టుగా ఎల్లాలి.’’పిచ్చెక్కినవాడిలా అరిచాడు కృపారావు. గ్లాసుతో అతనికి నీళ్లిచ్చి, తాగమని చెప్పి తాపీగా బీడీ వెలిగించి గట్టిగా దమ్ము లాగాడు దాసు.‘‘ఒరేయి ఎర్రినాయాల... నువ్వీ మజ్జిన వచ్చినావు. నీకివి కొత్త. నువ్వే కాదు, నేను కూడా నీకంటే గట్టిగా అరవగల్ను. దానివలన లాభమేటి? అక్కడితో కట్... ఇంకో పనికి మనల్ని పిలరు. పిలనియ్యరు. బ్లాక్ లిస్ట్ అంటారే, అలాగ... ఓనర్లంతా ఇక్కడ సిండికేటురా నాయన.’’ అన్నాడు దాసు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’‘‘పలాన ఇన్ని రోజులని ఇంకనుకోలేదురా. అనుకున్న ఎంటనే చెప్తాన్లే..’’ పకాలున నవ్వాడు దాసు.‘‘ఇదిగో... అలాటి కుయ్యోత్తులాడితేనే నాకు సిరాకు..’’‘‘లేకపోతే యేట్రా? పెశ్నించడం సులువే... జవాబు సెప్పడమే కష్టం. అందులోని నువ్వడిగిన పెశ్నకు జవాబు తెలిస్తే మనమెందుకిలాగ ఉంటాము. మన బతుకులెందుకిలాగుంటాయి.?’’ నిదానంగా అన్నాడు దాసు.‘‘మా గొప్పగా సెలవిచ్చెవులే... నిన్నడగడం నాదే బుద్ది తక్కువ.’’ చిరాగ్గా వెళ్ళిపోయాడు కృపారావు.
మంచంపై పడుకున్నాడేగానీ దాసుకి కూడా ఎంతకూ నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’తన యవ్వనారంభ దశలో తండ్రికి వేసిన అదే ప్రశ్న. ఈసారి కృపారావు నుంచి మరోసారి... నిద్ర రానివ్వని ప్రశ్న.. జవాబు దొరకని ప్రశ్న... మనసులో సుళ్ళు తిరుగుతూ... సుమారు పాతికేళ్ల నాటి పరిస్థితి. పేరుకే ఆ ఊరు మున్సిపాలిటీ. పల్లె కంటే కొంచెం ఎక్కువగానూ పట్నం కంటే చాలా తక్కువగానూ ఉంటుందా ఊరు. ఊరి చివరన ప్రధాన రహదారికి ఒక పక్కన చాకలి వీధి, గొడగలవీధి, మొండివీధి, దిగువ రాజ్యం... ఇలా అనేక వీధుల సముదాయంలో ఇందిరాకాలనీ ఇంకొంచెం ముందుంటుంది. ముందుగా ఎండియ్య టీకొట్టు,దానిపక్కనే కొత్తపట్నం షావుకారి కిరాణా దుకాణం, ఇంకొంచెం దూరంలో పొంగడాలు, బూరెలు, దుంపలు అమ్మే నీలవేణి బడ్డీ, అంతా కలిపి వంద గడపతో కనిపిస్తుంది.
కంపు గొడుతూ పందులు తాగే కుడితి తొట్టెలు అన్ని చోట్లా... ప్రభుత్వ రుణాలతో అగ్గిపెట్టెల్లా లేచిన స్లాబ్ ఇళ్ళు కొన్ని చోట్ల కనిపిస్తాయి.‘‘నాలుగైపోతంది... మాట గాసేస్తానేటో... దాసుగాడేడి?’’చివికిన రెల్లుగడ్డితో పొగచూరిన పైకప్పును చూస్తూ మట్టి అరుగుపై ఉన్న బొంతపై అటూ ఇటూ దొర్లుతున్న ఆదెయ్య, నర్సమ్మను అలా అడగడం నాలుగోసారి.‘‘అడివి నుంచి ఇప్పుడే వొచ్చినాను గదా. నాకేటి తెల్సు?’’రెండురూపాయలిచ్చి ఎండియ్య టీకొట్టు నుంచి దోసకాయచెంబు నిండా టీ తీసుకువచ్చిన నరసమ్మ అంది. రెండు గ్లాసుల నిండా సర్ది భర్తకొకటి ఇచ్చి తనొకటి తీసుకొని తాగడం మొదలుపెట్టిందామె.పొద్దున్ననగా గంజన్నం, పిండొడెంతో కారేజీ సర్దుకొని, దగ్గర్లో ఉన్న అడవికి వెళ్తుందామె. మారేడు, ఉసిరిక పత్రీ, బంగాళాకుల్ని తెంపి, పెద్ద గోనె సంచిలోకి మూటకట్టి ఇంటికి తీసుకువస్తుంది.
పత్రిని చిన్న కట్టలుగా కట్టి రోజూ గుడికి వెళ్లే శ్రీమంతుల ఇళ్లకూ, బంగాళాకుల్ని పెద్ద కట్టలుగా కట్టి హోటళ్లకూ, కిరాణా షాపులకు సరఫరా చేస్తూ నెలకింతని సంపాదిస్తుందామె. అందుకని ఆమెకు ఆకుల నర్సమ్మ అని మరోపేరు. ‘‘అదిగో... మాటల్లోనే వస్తన్నాడు బాబు.’’ తువ్వాలు మూటను చేత్తో పట్టుకుని వస్తోన్న దాసుని చూసి అంది నరసమ్మ. గడపలోకి రాగానే మూటను విప్పి దాసు గచ్చు మీద విదిల్చాడు.‘‘ఎక్కడ పట్టేర్రా ఇవి.?’’ కిందామీదా పడుతూ కొట్టుకుంటోన్న మిట్టల్ని చూస్తూ అంది నరసమ్మ.‘‘పెట్రోలుబంకు ఎనకాతల మళ్లల్లో గుమ్ములు నేవా... అక్కడ. నానూ, పిట్టడు, సొట్టరాజుగాడు ముగ్గురము కలిసి పట్టేము.’’ అన్నాడు దాసు.సంబరంగా తపేలాలో వాటిని సర్ది లోపలకు వెళ్ళిపోయిందామె.‘‘దాసు... టైము నాలుగైంది. పిల్లల్ని తీసుకురాడానికి ఎల్లవేటి?’’ అన్నాడు ఆదెయ్య.‘‘ఆ... ఇదిగిదిగో... ఎల్తన్నాను.’’ఇంటి పక్కనున్న రిక్షాను రోడ్ మీదకు ఎక్కించి రయ్‌మని తొక్కుకుంటూ వెళ్లిపోయాడు దాసు.మూడిళ్లల్లోని పిల్లల్ని రోజూ స్కూలుకు రిక్షామీద తిప్పే ఆదెయ్యకు గత వారం నుంచి బాగోలేదు.
అందుకని డాక్టర్ సలహా మేరకు కొడుక్కి ఆ పనిని ఒప్పజెప్పాడు ఆదెయ్య. కొడుకు తెచ్చిన చేపలకి తోడు నెయ్యిల సీతమ్మ దగ్గర పదిరూపాయిలకు పిత్తపరిగెల వాటాను తీసుకుంది నరసమ్మ. పరిగెల్ని పులుసుగానూ, మిట్టల్ని ఇగురుగానూ వండింది. భార్యచేత తిట్లు తినడం ఇష్టంలేని ఆదెయ్య మందెయ్యకుండానే తొలిసారి నీసుకూరతో ఆ రాత్రికి భోజనం కానిచ్చాడు.దాసుకి ఆటలంటే ఇష్టం. ఇంటరు పోవడానికి అతని ఆటలే సగం కారణం. పగలంతా పక్కనున్న రామయ్యబందలో రోజూ మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడతాడు. శుక్రవారం రాత్రయితే చాలు ఉత్సాహంగా రోడ్లపై తిరుగుతాడు. షాపులు కట్టే వేళల్లో దిష్టికని వాటిముందు కొట్టే కొబ్బరి చిప్పల్ని వరసగా ఏరతాడు.
కొత్తపట్నం షావుకారి దగ్గర కొన్న పది రూపాయల పంచదార పొట్లాన్నీ, తన వాటాగా వచ్చిన కొబ్బరిచిప్పల్నీ తల్లికిస్తాడు. వాటితో కొబ్బరి చక్కీల్ని పొయ్యడమో, ఒక్కోసారి అంబలితో కారంగా నంజుకునే కొబ్బరిపచ్చడి చెయ్యడమో చేసేదామె. రోజులో రెండు తడవలు పిల్లల్ని స్కూల్లో దింపాక బయట బేరాలకని నెయ్యిల వీధి సెంటర్లో రిక్షాను ఉంచుతాడు ఆదెయ్య. పాసెంజర్లకు మొదట బేరమెంతో చెప్పి ఆనక వాళ్ళెంత ఇస్తే అంత అందుకుని ‘సాలదు బాబూ’ అని గొణుక్కుంటూ వెళ్లిపోవడం అతనికలవాటు. అందుచేత అతని వ్యవహారం చూసి అసలుబేరం కంటే తక్కువ ఇచ్చేవాళ్లే ఎక్కువ. ఆదివారంనాడు శుభ్రంగా తయారై బైబిల్ చేత పట్టుకొని కుటుంబంతో సహా చర్చికి వెళ్లి దైవవాక్యం వినడం అతనికిష్టం.అదేరోజు సాయంత్రం కలిగినవారి కుటుంబాల్ని సినిమా థియేటర్లకు దిగబెట్టి వాళ్ళెంత ఇస్తే అంత తీసుకొని తిరిగొచ్చేయడం అతని బలహీనత.
ఇక్కడే దాసుకీ, ఆదెయ్యకి నప్పేది కాదు. శ్రమకి తగిన డబ్బుని అడగడంలో తప్పేముందని తండ్రిని ప్రశ్నించేవాడు. గొడవ పడేవాడు.‘‘అలాగడిగిన మనిషికి ఇలువుండదురా. ఆలంతా పెద్దోలు. అవకాశాలున్నోలు. మనం ఆమాత్రం మురాబు వుంచుకుంటే ఎవరైన సాయపడరేటి..?’’ అనేవాడు తండ్రి.‘‘అది నీ బ్రెమ... ఎవరైనా ఎందుకు చేస్తారు?’’‘‘అలగనీకరా... ఏమో... ఎవరితో ఏ అవసరముంతాదో!’’‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము? ’’జవాబు చెప్పలేక మౌనంగా ఉండే ఆదెయ్యను మరిక రెట్టించేవాడు కాదు దాసు. కాని ఆ ప్రశ్నమాత్రం అతనిలో బలంగా పాతుకుపోయింది. కొన్నాళ్లకి తల్లిదండ్రులు గతించడంతో గానుగెద్దులా కష్టపడటమే తప్ప అతనికి మరొకటి తెలియకుండా పోయింది.కాలక్రమేణా టౌన్ రూపురేఖలతోపాటు, వీధి రూపురేఖలు కూడా మారిపోయాయి. రిక్షాలు మాయమై ఆటోలు, తోపుడు బళ్ళు ప్రవేశించాయి.
రిక్షా కార్మికులు, సిమెంట్, ఐరన్ షాపుల్లో కళాసీలుగానూ, తాపీ మేస్త్రీలుగానూ, కాయగూరలు అమ్మే చిల్లర వర్తకులుగాను మారేరు. పది పాసైన కుర్రాళ్లంతా ఆర్మీలోకి వెళ్ళిపోతే, పోయిన వాళ్లంతా నగరాల్లో సెక్యూరిటీ గార్డులయ్యారు. కొద్దిమంది మాత్రమే ఉద్యోగస్తులయ్యేరు. ఎటూ వెళ్లలేని దాసులాంటి వారు పెయింటర్లయ్యారు. కానీ అతనితో పాటు అతనిలో ఏళ్ల తరబడి అంటుకట్టుకొని పోయిన ఒకప్పటి అతనిప్రశ్న మాత్రం సలపరించే గాయమై బాధిస్తూనే ఉంది. కొన్ని తరాల నుంచి తమ కుటుంబం సమాజం పట్ల ప్రదర్శించిన విధేయత, మంచితనం వలన ఒరిగిందేంటి? తండ్రి ఆశించిన మేలేదైనా జరిగిందా? లేదే! అలాంటప్పుడు ఎందుకీ అనవసరపు తాపత్రయం.
స్వతంత్రంగా బతకలేమా... సగౌరవంగా బతికి చూపించలేమా... సగం రాత్రి వరకు దాసులో సాగిన ఆలోచనలెన్నో! మూత్రం పోయడానికని బయటకు వచ్చి, ఆ పని కానిచ్చి యథాలాపంగా బయట నిల్చున్నాడు దాసు. నిర్మానుష్యంగా... నిశ్శబ్దంగా ఉన్న రోడ్డుపై ఒక చేత్తో వెలుగు దారి చూపిస్తూ, మరొక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని నిల్చుని ఉన్న నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం వీధి లైటు వెలుతురులో దూరంగా, మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. వెలుగు రేఖలేవో ప్రసరించినట్టయ్యింది.‘లోడు దించడానికి ఉదయాన్నే గభీల్న ఎల్లాల... ఏటయితే అదవ్వనీ... తర్వాత సూద్దుము.’ మంచంపై పడుకుంటూ మనసులో అనుకున్నాడు దాసు. తెల్లవారి మూడు దాటాక అతనికి మాగన్నుగా నిద్ర పట్టింది.∙∙ తర్వాత రోజు ఉదయం పదిగంటలకు షాపు తెరవడానికి వచ్చిన గంగరాజు అక్కడి దృశ్యం చూసి కోపోద్రిక్తుడయ్యాడు.
పట్టరాని ఆవేశంతో సెల్ తీసి దాసుకి ఫోన్ చేశాడు. నిమిషాల్లో ఎర్రయ్య, కృపారావులతో పాటు మరికొంతమందిని వెంటబెట్టుకొని వచ్చాడు దాసు..‘‘దాసూ... నేను చెయ్యమన్నదేంటి... నువ్వు చేసిందేంటి? ‘‘షాపుముందు వరసగా పేర్చి ఉన్న పుట్టి బ్యాగుల్ని, రంగు డబ్బాల్ని చూస్తూ అన్నాడు గంగరాజు.‘‘మీరు సెప్పిందే గదేటి... ఇంకేటి సేశాను?.’’ అన్నాడు దాసు.‘‘ఏం చెప్పాను..?’’‘‘లోడుని పెరిగీమన్నారు... పెరిగీసాం గదా..’’‘‘పెరిగీడమంటే గౌడౌన్ లోపలకి పెట్టాలని తెలీదా?’’ విరుచుకుపడ్డాడు గంగరాజు.‘‘ఆ మాట నిన్న మీరనలేదు గదా.’’‘‘అలాగని రోడ్ మీద దించేస్తారా ..’’‘‘టైమెక్కడిది సారూ? మీరే గదా రెండు గంటల్లో దించేసి ఇంకో పనికి ఎళ్లిపొమ్మన్నారు?’’‘‘ఏటివోయ్ దాసు... కొత్తగా మాట్లాడుతున్నావు.
ఏటి సంగతి...’’‘‘మేమేటి కొత్తగా అనడంలేదు. మీరన్నదే... మా కూల్లు మాకిచ్చేస్తే మేమింకో పనికి ఎళ్ళిపోతాం.’’‘‘గోడౌన్ తాళాల కోసం ఇంటికి రాకపోతే లోడు రాలేదేటోననుకున్నాను. ఇలాంటి మడతపేచీ ఉందనుకోలేదు. సరే, తగువెందుకులే గానీ ముందు లోపలకి సామాన్లు పెరిగీయండి. డబ్బులిచ్చేస్తాను.’’ కొంచెం మెత్తబడి అన్నాడు గంగరాజు.‘‘కుదరదు.’’‘‘ఏం... ఎందుకని? ‘‘‘‘నిన్నటిది ఇయ్యాల్టిది... కలిపి రెండు రోజులు కూలవుద్ది... పెరిగీమంటారా?’’‘‘కూలీ ఒక్కరోజుదే కదా... రెండు రోజులేటి?’’‘‘అదంతే... ఇష్టం నేకపోతే సెప్పండి. లోడు ఇక్కడే ఇక్కడే వుంటాది... మా దారిన మేము పోతాము. ఎవులుతో పెరిగిస్తావో చూస్తాము. అంతేకాదు ముందు డబ్బిస్తేనే పని. నేదంటే నేదు...’’ఆ మాటకి గంగరాజు కోపం నషాళానికి అంటింది.
అయినా తమాయించుకున్నాడు. చేసేదేంలేక నాలుగువేల ఎనిమిది వందల రూపాయలు జేబులోనుంచి చిరాగ్గా తీసి దాసుకి అందించాడు. లోడు గోడౌన్‌లోకి చేరింది. ఊపిరి పీల్చుకున్నాడు గంగరాజు. జేబులోనుంచి పన్నెండు వందలు తీసి అతని చేతిలో పెట్టాడు దాసు. ప్రశ్నార్థకంగా చూశాడతను.‘‘నిన్నటిది పూర్తి కూలీ. ఈ రోజుది సగం కూలీ. పోను మిగతాది ఈ డబ్బు... మీరే దాసుకోండి. కోట్లు గడించీయండి. మాకేటి ఎంగిలి కూడు అక్కర్లేదు మీలాగ...’’అన్నాడు దాసు. చేతిలో నలిగిన నోట్లనీ... నిశ్చలంగా ఉన్న దాసు ముఖాన్నీ చూస్తూ ఏదో మాట్లాడబోయాడు గంగరాజు. కానీ దాసు అవేవీ వినిపించుకోలేదు. నింగికెగసిన పక్షుల గుంపులో తానొక పక్షిలా స్వేఛ్ఛగా తనవారితో కలిసి వడివడిగా రోడ్డు దాటి వెళ్ళిపోయాడు.
- పాలకొల్లు రామలింగస్వామి


