వీకెండ్ అన్నది ఎప్పుడూ సంతోషదాయకమూ, ఆనందకరమే కాకపోవచ్చు. శని, ఆదివారాలు ఎలాగూ సెలవురోజులేగాకాస్తంత ఎంజాయ్ చేద్దాం అనే భావన ఒక్కోసారి ఆరోగ్యానికి చేటు తెచ్చిపెట్టవచ్చు. అందుకే వాటిని వీకెండ్ సమస్యలుగా చెబుతుంటారు. అయితే అవి తప్పకుండా వీకెండ్ రోజుల్లోనే వస్తాయని కాదు... ఎప్పుడైనా రావచ్చుగానీ... వీకెండ్ రోజుల్లో దొరికే సెలవల కారణంగా శని, ఆదివారాల్లో సదరు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశమున్నందున వాటిని వీకెండ్ ఆరోగ్య సమస్యలుగా చెబుతుంటారు. అంతేకాదు... వాటిల్లో కొన్నింటికి వారాంతపు రోజైన ‘శాటర్ డే’ పేరు కూడా ఉండటం విశేషం. అలా వారాంతపు వ్యవహారాలతో వచ్చే ఆరోగ్య సమస్యలేమిటి, వాటికి పరిష్కారాలేమిటన్న విషయాలేమిటో చూద్దాం...
సాధారణంగా వారంలోని మిగతా రోజుల్లో ఆఫీసు పనులూ లేదా బిజినెస్ పనుల మీద అందరూ బిజీగా ఉంటారు. ఇక ఆదివారం రోజు సెలవు కావడంతో శనివారం నుంచే రిలాక్స్ కావడాన్ని చాలామంది మొదలుపెడుతుంటారు. దాంతో మర్నాడు సెలవే కదా అన్న ఉద్దేశంతో కాస్త ఆటవిడుపు ఫీలవుతుంటారు. దాంతో వీకెండ్ పేరిట ఉన్న కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను తెలుసుకుందాం.
పెద్దల్లో (అడల్ట్స్‌లో) వచ్చే సమస్యలివి...
శాటర్‌డే నైట్ పాల్సీ : రాత్రి కుర్చీలో కూర్చుని అతిగా మద్యం తాగుతూ ఉండి అలాగే నిద్రపోయే అవకాశాలెక్కువ. అలాంటప్పుడు తల బరువంతా భుజం మీద ఆనడం... నిద్రకారణంగా ఆ బరువు చాలాసేపు అలాగే ఉండటంతో చేతి ప్రధాన నరమైన.. ‘రేడియల్ నర్వ్’పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాంతో అది చచ్చుబడినట్లుగా అవుతుంది. ఇది కూడా ఒక రకం నరాలకు సంబంధించిన సమస్య (న్యూరోపతి)గా చెప్పవచ్చు. అయితే పేరును బట్టి ఇది కేవలం శనివారం రాత్రి మద్యం తీసుకున్నందు వల్ల వచ్చే పరిణామం మాత్రమే కాదు. నిజానికి ఏ రోజైనా రావచ్చు. కానీ వీకెండ్‌లో ‘మద్యం పార్టీలు’ ఎక్కువగా నిర్వహించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ సమస్యకు ‘శాటర్‌డే నైట్ పాల్సీ’ లేదా ‘శాటర్ డే నైట్స్ పెరాలసిస్’ అని పేరు.
అల్నార్ పాల్సీ : వారాంతం వరకు కంప్యూటర్ మీద చాలా ఎక్కువ సేపు పనిచేయడం వల్ల వారాంతానికి వేళ్లను కదపడానికి కూడా వీల్లేనంత బలహీనంగా మారిపోతాయి. ఇలా వారాంతం వరకు పనిచేయడం వల్ల ముఖ్యంగా చేతి వేళ్లలో బలహీనంగా ఉండేవైన చిటికెనవేలు, ఉంగరపు వేళ్లు కదల్లేనంతగా అలసిపోవచ్చు. అవి తిమ్మిరిగా ఉండి, మొద్దుబారి, పనిచేయలేని స్థితికి చేరితే ఆ కండిషన్‌ను అల్నార్ పాల్సీ అంటారు.
ఫుట్ డ్రాప్ : అలా అదేపనిగా కూర్చుని ఉండటంతో కాలిని కదిలించలేని కండిషన్‌తో పాటు కాలి వేళ్ల చివర తిమ్మిరి, మొద్దుబారినట్లుగా ఉండే కండిషన్‌ను ఫుట్‌డ్రాప్ అంటారు.
సాధారణంగా డాక్టర్లు వీటిని శనివారం సమస్యలుగా పేర్కొంటుంటారు.
ఇక పెద్దల్లో మద్యం అలవాటుతో...
ఇప్పుడు వారాంతం వస్తే చాలు దాదాపుగా అన్ని రకాల కుటుంబాలూ బయటే తినడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇక ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు తమ తమ బిజీ ఉద్యోగాల్లోంచి ఆటవిడుపుకోసం బయట తినడానికి మొగ్గు చూపుతుంటారు. దీంతోపాటు మునపటితో పోలిస్తే ఇటీవల వీకెండ్ మద్యం పార్టీలు మరీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ వారాంతపు ఆరోగ్యపు అనర్థాలతో చాలావరకు ఆల్కహాల్‌తోనే వస్తుండటం విశేషం.
ఆల్కహాల్‌తో అంతా అనర్థమే:
మితిమీరిన ఆల్కహాల్ చేటు చేస్తుందని తెలిసినప్పటికీ శనివారాలు మద్యం తీసుకునేవారి సంఖ్య తక్కువేమీ కాదు. పైగా ఇందుకు ఓ సాకు / జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. ‘‘మనం మద్యం తీసుకునేది వీకెండ్ రోజే కదా... సోమవారం రోజు ఆఫీసు ఉంటుందనే కారణంతో ఆదివారమూ రిలాక్స్ కాలేము కదా’’ అంటూ శనివారాలు చాలామంది మద్యం పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు. మర్నాడు ఎలాగూ ఆదివారమే కదా అంటూ చాలామంది పెద్దగా పరిమితి కూడా పాటించరు.
ఆల్కహాల్ కారణంగా దాంతో ముడిపడిన అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. ఆల్కహాల్ రక్తంలో కలుస్తుండగానే అది రక్తపోటును, నాడీ వేగాన్ని (పల్స్ రేటును) పెరిగేలా చేస్తుంది. ఈ రెండు అంశాలూ... గుండెకు ముప్పు తెచ్చిపెట్టేవే. ఒక కరంగా చూస్తే గుండెపోటు తాలూకు రిస్క్ ఫ్యాక్టర్లుగా చెప్పవచ్చు. ఆల్కహాల్ తీసుకోగానే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దాంతో రక్తం వేగంగా పరుగులెత్తుతుంది. దీనికి తోడు హృదయ స్పందనల వేగం కూడా బాగా పెరుగుతుంది. హృదయ స్పందనలు పెరగడంతో మళ్లీ అది రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.
ఇక రక్తపోటు, హృదయస్పందనలు బాగా పెరిగినప్పుడు తక్షణం కలిగే ప్రమాదం గుండెపోటు. ఇది ఒక్కోసారి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి అంటే... మరణానికి దారితీసే ప్రమాదమూ లేకపోలేదని గ్రహించాలి. ప్రతి మద్యం పార్టీతోనూ గుండెపోటు ముప్పు తప్పక వస్తుందని చెప్పలేనప్పటికీ... ప్రతిసారీ ఆల్కహాల్ తాగినప్పుడల్లా కాలేయంపై మాత్రం తీవ్రమైన ప్రతికూల ప్రభావం మాత్రం తప్పక పడుతుంది. అంతేకాదు... రక్తనాళాల్లో రక్తం ప్రవాహవేగం పెరిగినందువల్ల అది మూత్రపిండాలనూ దెబ్బతీయవచ్చు. ఇలా మద్యాన్ని సేవించడమన్నది ప్రతిసారీ మూత్రపిండాలపై అంతో ఇంతో ప్రతికూల ప్రభావాన్ని తప్పక చూపుతుందని చెప్పవచ్చు.
రక్తనాళాల్లో వేగం పెరగడం వల్ల ఒక్కోసారి అది రక్తనాళాలు చిట్లడం వంటి ప్రమాదాలకూ దారితీయవచ్చు. అతి సున్నితమైన కంటి రక్తనాళాల్లోనూ రక్తప్రవాహ వేగం పెరిగితే... అరుదుగానైనా అది అంధత్వం వంటి పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉండవచ్చు.
అన్ని అవయవాలకూ ముప్పు తెచ్చిపెట్టే వీకెండ్ పార్టీలు
మద్యం మనపై చూపే దీర్ఘకాలిక సమస్యలు చాలా ఎక్కువే. శరీరంలోని అన్ని అవయవాలపై మద్యం తన దుష్ప్రభావం చూపుతుంది. దాని వల్ల నష్టపోని వ్యవస్థలు, కీలక భాగాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. కేవలం వారానికి ఒకసారి తాగే వీకెండ్ పార్టీ వల్లనే ఈ ముప్పు వస్తుందా అంటే కేవలం ఎప్పుడో ఒకసారి తాగినప్పటికీ మద్యం వల్ల వచ్చే ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. మద్యం దాదాపు మన శరీరంలో ఉండే అన్ని అవయవాలపై చూపే దుష్ప్రభావాలు ఇవీ...
’ జీర్ణకోశ వ్యవస్థ : మద్యం వల్ల అసిడిటీ సమస్య, గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్జార్‌ప్షన్ సిండ్రోమ్), ఎన్నో రకాల క్యాన్సర్లు, హెమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్ గ్రంథి సమస్యలు... జీర్ణవ్యవస్థకు సంబంధించి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు కనిపిస్తాయి.
’ పోషకాలు అందకపోవడం : మద్యం తాగినప్పుడు ఒక్కోసారి ఆకలి మందగించడం లేదా మద్యంతో పాటు తినే చిరుతిండ్ల వల్ల ఆహారం సరిగా తీసుకోకపోవడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. దాంతో దేహానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందకపోవడంతో అది పోషకాహార లోపంతో వచ్చే కొన్ని రకాల సమస్యలకు ఆస్కారం ఇవ్వవచ్చు.
’ గుండె : ఆల్కహాల్ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందనలూ గుండె లయల్లో మార్పులు (అరిథ్మియా) వంటి సమస్యలు రావచ్చు. రక్తనాళాలు తమ మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా మారే అథెరోస్లీ్కరోసిస్ సమస్యలతో పాటు... చివరకు గుండెపోటుతో ్రపాణాలకు ముప్పు వాటిల్లడం వంటి తీవ్రమైన సమస్యలకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.
’ మెదడు / నాడీ వ్యవస్థలో లోపాలు : జ్ఞాపకశక్తి లోపించడం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, చేతివేళ్ల చివర్లు లేదా కాలి వేళ్ల చివర్లు స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంలో జ్ఞాపకాలన్నీ మాసిపోయే అలై్జమర్స్ సమస్యతో పాటు కొందరిలో చేతులూ చేతివేళ్లు వణుకుతూ ఉండే పార్కిన్‌సన్ డిసీస్ వంటి ముప్పులకూ ఆల్కహాల్ ఒక కారణం.
’ సెక్స్ సమస్యలు : సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు.
’ మహిళలకు మరింత ప్రమాదం : మహిళలు మరీ ముఖ్యంగా గర్భిణులు ఆల్కహాల్ తాగడం వల్ల కేవలం వారికి మాత్రమే కాకుండా... ఒకవేళ వారు గర్భవతులైతే పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడం సహా పుట్టబోయే చిన్నారుల్లో అనేక వైకల్యాలు కనిపించడానికి అవకాశాలెక్కువ.
మద్యం తాగిన ఆ మర్నాడూ కొనసాగే ప్రతికూల ప్రభావాలు...
ఆల్కహాల్ తాగినరోజే కాకుండా ఆ మర్నాడు కూడా అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలనే చూపుతుంది. మద్యం తాగిన తర్వాతి రోజున అది చూపే ప్రభావాలను ‘హ్యాంగోవర్’గా చెబుతుండటం చాలామందికి తెలిసిందే. అంటే... ఆల్కహాల్ తాగిన వారు మర్నాడు చాలా నీరసంగా ఉంటం, ఆ నిస్సత్తువతో ఏ పనులూ చేసుకోలేకపోవడం, దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం, పనిపై దృష్టి కేంద్రీకరణ శక్తి తగ్గడం (ఫోకస్‌డ్‌గా పనిచేయలేకపోవడం), కొందరిలో తీవ్రమైన తలనొప్పి, మరికొందరిలో మైగ్రేన్ ప్రేరేపితం కావడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. దాంతో... అంటే ఆ ప్రతికూల ప్రభావాలతో చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గడం, సరిగా / నిర్దుష్టంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి అనర్థాలు ఏర్పడతాయి.
అధిగమించడం ఎలా? ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయడం తప్పనిసరి. అయితే కొంతమంది మద్యాన్ని రెండు పెగ్గులకు పరిమితం చేసుకుంటే మంచిదేననీ, డాక్టర్లే ఆ మేరకు పర్వాలేదనీ చెబుతుంటారని కొందరు వాదిస్తుంటారు. కానీ ఎప్పుడో ఓసారే అయినా ఒక్క పెగ్ ఆల్కహాల్ అయినప్పటికీ దానితో ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదనేది డాక్టర్ల మాట. ఇక మద్యం ఎంత పరిమితమైన మొత్తంలో తీసుకున్నప్పటికీ.... ఆల్కహాల్ తీసుకుని ఎలాంటి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదు.
∙బింజ్ డ్రింక్ వద్దు : కొందరు వారంలో ఎప్పుడూ తాగరు. కానీ వారాంతం రోజున చాలా ఎక్కువగా తాగేస్తారు. అలా కూర్చుండిపోయి తాగడమే పనిగా పెట్టుకుని చాలాసేపటివరకు అలా తాగుతూనే ఉంటారు. ఇలా తాగడాన్నే ‘బింజ్ డ్రింకింగ్’ అంటారు. రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతగా నష్టం చేకూరుతుందో... వారంలో కేవలం ఒక్కరోజున తాగే ‘బింజ్ డ్రింకింగ్’తోనూ అంతకంటే ఎక్కువగానే అనర్థాలు చేకూరతాయని అర్థం చేసుకుని, బింజ్ డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి.
ఆహారం విషయంలో : వారాంతపు పార్టీలతో మద్యం మాత్రమే కాదు... మితిమీరి తీసుకునే ఆహారంతోనూ ఆరోగ్యానికి అనర్థం తప్పదు. వారాంతపు పార్టీలలో అనారోగ్యాలు తెచ్చిపెట్టే ఫాస్ట్‌ఫుడ్స్, అధికంగా రిఫైన్ చేసిన పిండిపదార్థాలతో తయారు చేసే శ్నాక్స్, సూపర్ రిఫైన్డ్ రైస్‌తో వండిన మసాలాలతో కూడిన స్పెషల్ వంటకాలతో రక్తంలో చక్కెర మోతాదులు బాగా పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్ బాధితుల్లోని రక్తంలో చక్కెరను అమాంతం పెంచేస్తుంది. ఒక్కసారిగా చక్కెర మోతాదులు పెరగడం వల్ల అది కీటోఎసిడోసిస్ అనే కండిషన్‌కు దారితీసి, ఒక్కోసారి బాధితుల్ని కోమాలోకి తీసుకుపోయే ప్రమాదమూ లేకపోలేదు.
అధిగమించడం ఎలా? వీకెండ్ పార్టీల్లో సూపర్ రిఫైన్డ్ ఆహారం లేదా శ్నాక్స్ తీసుకునే సమయంలో అంతే మొత్తంలోగానీ లేదా వీలైతే అంతకుమించిగానీ సలాడ్స్ తీసుకోవడం మంచిది. సలాడ్స్‌లో భాగంగా దోస, క్యారట్, బీట్‌రూట్ ముక్కలు తీసుకుంటుంటే అది కార్బోహైడ్రేట్లు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. దేహంలోకి తగినన్ని పీచుపదార్థాలు వెళ్తాయి.
ఇక్కడ మద్యం తీసుకునే వారికీ, ఆహారం ఎక్కువగా తీసుకునేవారికి... మధ్య పండ్ల రసాల విషయంలో ఒక తేడా పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే... మద్యం తీసుకునే వారు రెండు పెగ్గుల తర్వాత తప్పనిసరిగా నిమ్మజాతి పండ్లరసాలు తీసుకోవడం మంచిదైతే... ఆహార ప్రియులు మాత్రం పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే... పండ్లరసాలు రక్తంలోని చక్కెర మోతాదులను మరింతగా, అందునా అమాంతంగా పెంచేస్తాయి.
కొందరు కాళ్లూ, చేతుల్లో కీళ్లనొప్పులు... గౌట్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారు తమ ఆహారంలో ్రపోటీన్ మోతాదులు అంటే మాంసాహారం, పప్పులు బాగా తగ్గించుకోవాలి.
అధిగమించడం ఎలా: ఈ వీకెండ్ ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఈ కింద పేర్కొన్న సూచనలు చాలావరకు మేలు చేస్తాయి. అవి...
∙పార్టీల్లో గడపడం కంటే పార్క్ వంటి చోట్లలో సోషల్ గ్యాదరింగ్స్‌కు వెళ్లడం చాలా మేలు చేస్తుంది. పార్టీలకు వెళ్లేవారితో పోలిస్తే... పార్క్‌లో కుటుంబ సభ్యులతో గడిపేవారు, గార్డెనింగ్ చేసేవారు... ఎక్కువ సంతోషంగానూ, ఆరోగ్యంగానూ ఉంటారని చాలా అధ్యయనాల్లో తేలింది.
∙వీకెండ్ యోగా : వారమంతటా ఎడతెరిపిలేకుండా చేస్తున్న పని వల్ల కలిగిన ఒత్తిడిని తొలగించడానికి వీకెండ్స్‌లో పార్టీల కంటే వీకెండ్ యోగా వంటి కార్యక్రమాలు మేలు చేస్తాయని అధ్యయానాల్లో తేలింది.
∙బరువు చెక్ చేసుకుంటూ ఉండటం : వీకెండ్ తర్వాత సోమవారంనాడు రోజును ్రపారంభిస్తున్నప్పుడు మొదట చేయాల్సిన పని... తమ బరువు చెక్ చేసుకోవడం. దీనివల్ల మనం చేస్తున్న పనుల ప్రతికూల ప్రభావాలను తెలుసుకుంటూ... ఆమేరకు జాగ్రత్త తీసుకోవాలన్న స్పృహ అందరిలోనూ పెరుగుతుంది.
పిల్లలకూ ఇబ్బందే...
కేవలం పెద్దల ఆరోగ్యమే కాదు... వారాంతపు రోజుల్లో చిన్నారుల ఆరోగ్యమూ దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇందుకు కారణాలు మాత్రం పెద్దలూ, పిల్లల విషయంలో వేర్వేరుగా ఉంటాయి. వారం ΄÷డవునా అన్ని రోజులూ స్కూల్‌కు వెళ్లడంతో మర్నాడు సెలవు కావడంతో ఆటవిడుపుగా భావించి మితిమిరి ఆడుకుంటూ ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి కాళ్లనొప్పులు రావచ్చు. ఇది కేవలం తాత్కాలికమైన ఇబ్బంది మాత్రమే. అయితే దీనికంటే మించిన ఇబ్బంది ఆహారంతో వస్తుంటుంది.
కొందరు పెద్దలు వారాంతపు రోజుల్లో పిల్లలను తమతో పాటు పార్టీకి తీసుకెళ్లడం చేస్తుంటారు. ప్రతివారం అక్కడ మితిమీరి ఆహారం తీసుకోవడంతో పిల్లల్లో స్థూలకాయం వచ్చే ముప్పు ఉంటుంది. ఇక మర్నాడు ఎలాగూ సెలవురోజు కావడం వల్ల వారాంతపు రోజున ఎక్కువసేపు టీవీ చూడటం, రాత్రంతా నిద్రపోకుండా ఓటీటీలో సినిమాలు చూడటం, వీడియోగేమ్స్ ఆడటం వంటివి చేస్తుంటారు. వీటివల్ల ఆరుబయట ఆటలాడటమూ తగ్గుతుంది. పైగా ఇలా టీవీలూ, సినిమాలూ చూసే సమయంలో ఏదైనా తింటూ ఉండటం వల్ల (బింజ్ ఈటింగ్ వల్ల) స్థూలకాయం రిస్క్ మరింత పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యం విషయంలో దుష్పరిణామాలకు దారితీస్తుంది. అందుకే సెలవు రోజుల్లో పిల్లలకు ఆరోగ్యకరమైన వ్యాపకాలు నేర్పడం పెద్దలు చేయాల్సిన పని.
నిర్వహణ: యాసీన్


