
∙నా వయసు ఇరవైఐదు సంవత్సరాలు. నాకు తరచు మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కారణం ఏమిటి? పరిష్కార మార్గాలు చెప్పండి.
– కీర్తి, అనంతపురం.
మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర వ్యవస్థలోకి బాక్టీరియా ప్రవేశించడం వల్ల కలిగే సమస్య. సాధారణంగా ఈ బాక్టీరియా బయట నుంచి యూరినరీ బ్లాడర్‌లోకి ప్రవేశిస్తే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు మరింత తీవ్రమవుతూ మూత్రనాళం మొత్తం పైకి, కిడ్నీల వరకు చేరుతుంది. దీనివలన మూత్రం పోతున్నప్పుడు మంటగా అనిపించడం, తరచుగా మూత్రం రావడం, నొప్పి ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ నీరు తాగటం, బయట తినే ఆహారం, శరీర శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వంటి వాటి వల్ల ఈ సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.
రోజుకు కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. మసాలా, కారం ఎక్కువుండే ఆహార పదార్థాలు, చల్లని పానీయాలు, టీ, కాఫీ లాంటివి తగ్గించాలి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతాయి. జననేంద్రియ భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. సెంటు ఉన్న సబ్బులు, పరిమళభరిత పదార్థాలు వాడకూడదు. భర్తతో ఇంటర్‌కోర్స్ జరిగిన వెంటనే శుభ్రత పాటించాలి. మలవిసర్జన తర్వాత ముందువైపు నుంచి వెనుకవైపు వైపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. వెనుక నుంచి ముందుకు శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా బ్లాడర్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాటన్ అండర్‌వేర్ ధరించాలి. ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. స్నానం చేసిన తరువాత కూడా ఆ భాగాన్ని బాగా పొడిగా ఉంచుకోవాలి. కొంతమంది క్రమం తప్పకుండా వచ్చే ఇన్ఫెక్షన్లకు సహజమైన చికిత్సలు బాగా ఉపయోగపడతాయి.
ఉదాహరణకు, తాజా పండ్ల రసాలు, బార్లీ నీరు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు రోజూ తీసుకోవచ్చు. ఇవి మూత్రనాళం శుభ్రంగా ఉండేలా చేస్తాయి. తరచు పొత్తి కడుపులో నొప్పిగా అనిపించటం, మూత్రంలో ముదురు రంగు, రక్తం కనిపించడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. జ్వరమొచ్చినా, నడుము నొప్పి ఉన్నా ఆలస్యం చేయకూడదు. మొదటి దశలోనే పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే సమస్య తిరిగి రాదు. అవసరమైతే మూత్రపరీక్షలో బాక్టీరియా ఏ రకమైనదో చూసి, దానికి సరిపడే మందులు మాత్రమే వాడాలి. ఇతర వైద్యం అవసరం లేకుండా, ఒత్తిడి తగ్గించి, శరీర శుభ్రతను పాటించడం ద్వారా చాలా వరకు నియంత్రించ వచ్చు.
రాగానే తలనొప్పి
నాకు గత రెండేళ్లుగా ప్రతి నెలా పీరియడ్ రాగానే తీవ్రమైన తలనొప్పి వస్తోంది. ఇది మైగ్రేన్∙ అంటున్నారు. ఇది ఎందుకు వస్తోంది? దానికి ఏమైనా పరిష్కారం ఉందా?
– శారద, తిరుపతి.
మీకు వస్తున్న తలనొప్పి సాధ్యమైనంత వరకు హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మైగ్రేన్ కావచ్చు. పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో తగ్గిపోతుంది. దాని ప్రభావంతో తలనొప్పి ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇది నాలుగు రోజుల ముందే మొదలై, పీరియడ్ మొదటి రెండు రోజుల వరకూ ఎక్కువగా ఉంటుంది. దీనిని మెన్స్‌ట్రువల్ మైగ్రేన్ అంటారు. ఇది ఓ పద్ధతిలో వచ్చే తలనొప్పి కాబట్టి, మీరు ఒక డైరీ రాసుకోవాలి – ఎప్పుడు వస్తోంది, ఎంతసేపు ఉంటుంది, ఏమి తిన్నాక లేదా ఏ పరిస్థితుల్లో వస్తోంది అన్నదాన్ని గమనించాలి. ఆ వివరాలతో డాక్టర్ సరైన మందులు సూచిస్తారు.
కొంతమంది మైగ్రేన్ రాకముందే కొన్ని రోజుల పాటు నాప్రోక్సెన్, ఐబుప్రొఫెన్ లాంటి నొప్పి నివారణ మాత్రలు వాడతారు. ఇవి శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భధారణ ఉన్నవారు అయితే, కొన్ని మందులు వాడకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భసంచయానికి అనుకూలంగా ఉండే ప్రొజెస్టెరాన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ సమయాల్లో మైగ్రేన్ ఎక్కువగా ఉంటే, ఆ రోజుల్లో తీసుకోవాల్సిన మందులు ప్రత్యేకంగా సూచిస్తారు. కొంతమందికి ఈస్ట్రోజన్ తక్కువ స్థాయిలో ఉండటం వల్లే ఇది వస్తుంది కాబట్టి, తగిన ఈస్ట్రోజన్ ప్యాచ్‌లు లేదా ఇతర మార్గాల్లో ఇచ్చే చికిత్సలు ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో ఏ మాత్రలు తీసుకోవాలో, ఏవి తీసుకోవద్దో వైద్యులే నిర్ణయిస్తారు.
మైగ్రే తో పాటు వాంతులు, వికారం వంటి సమస్యలు ఉంటే, అటువంటి లక్షణాల కోసం ప్రత్యేక మందులు ఇస్తారు. తిండి మానేయకూడదు, ఆకలితో ఉండకూడదు. ప్రతిరోజూ ఒకే సమయంలో తినడం, నీరు ఎక్కువగా తాగడం, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడం అవసరం. ఒక నెలలో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మైగ్రేన్ వస్తున్నట్లయితే, రోజూ తీసుకునే ప్రివెంటివ్ మందులు అవసరమవుతాయి. ఈ మందుల్ని మొదటి మూడు నెలల పాటు వాడిన తరువాత, దాని ప్రభావాన్ని డాక్టర్ అంచనా వేస్తారు. దాని ఆధారంగా మందులు వాడాలి.