
ధర్మ జిజ్ఞాస
విష్ణువు రాముడిగా... కృష్ణుడిగా... ఇంకా అనేక రూపాలలో భూమిపై అవతరించాడని అంటారు కదా... మరి ఆ రూపాలలో ఆయన భూమిపై ఉన్నప్పుడు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా? ‘రామునిగా.. కృష్ణునిగా.. నారసింహుడిగా విష్ణువు భూమిపై అవతరించినప్పుడు ఆయా అవతారాలు పరిసమాప్తి అయ్యేంత వరకు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?’ అనే విషయం తెలుసుకొనే ముందు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం...
ఒకేలా ఉండే పది ప్రమిదలలో ఒకేవిధమైన వత్తులు వేసి, నూనె పోసి ముందు ఒక ప్రమిదను వెలిగించి, ఆ ప్రమిదతో మిగిలిన ప్రమిదలు వెలిగించి ఆ ప్రమిదల వరుసలలో పెట్టి; వేరే ఎవరినైనా ఈ ప్రమిదల వరుసలోని ఏ ప్రమిదతో నేను దీపం వెలిగించానో చెప్పగలవా అంటే ఆ వ్యక్తే కాదు ఎవరూ చెప్పలేరు; కారణంం మిగిలిన ప్రమిదలను వెలిగించిన తొలి ప్రమిద వెలుగు తగ్గదు. మిగిలిన ప్రమిదల్లాగే ప్రకాశిస్తుంది...
అలాగే భగవంతుడు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడివిడిగా ఎత్తినా తన అస్తిత్వాన్ని కోల్పోకుండా తన అసలు రూపంతో దర్శనమిస్తూనే ఉంటాడు... విష్ణువు నుంచి ఉద్భవించిన ఈ అవతారాలు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడిలో ఐక్యమొందుతాయి... ఒకసారి ఐక్యమొందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి.ఈ విధంగా అమ్మవారు అంటే లక్ష్మిదేవి కూడా భూలోకంపై అవతరించారు; అవతరిస్తారు. అలాగే శివ పార్వతులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకంపై అవతరిస్తూ ఉంటారు.
– డి.వి.ఆర్.