
రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి పండుగ సంబరాలతో సందడిగా మారిపోయాయి . ఊరు, వాడ, పట్టణాల్లో..పండుగ వాతావరణంతో సర్వాంగ సుందరంగా మారిపోయాయి. తొమ్మిది రోజులు సాగే ఈ పండుగను ప్రజలంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. విఘ్న వినాయకుడిగా తొలి పూజలందుకునే గణపయ్యను పూజిస్తే ఎలాంటి విఘ్నాలైనా తొలిపోతాయనేది భక్తుల నమ్మకం. అందుకే తమ శక్తి కొలది..ఉన్నంతలో ఘనంగా ఈ పండుగను ప్రతిఒక్కరు జరుపుకుంటారు. అలాంటి పండుగను ఆంధ్రప్రదేశ్‌లోని రెండు గ్రామాలు అస్సలు జరుపుకోనే జరుపుకోవట. ఇప్పటి వరకు ఈ పండుగ జరిగిన దాఖలాలు కూడా లేవట. ఎందుకిలా అంటే..దీని వెనుక పెద్ద కథే ఉంది. మరి అదేంటో చకచక చదివేయండి మరి
తెలుగు రాష్ట్రాలో వినాయక చవితి సందడి నెలకొన్నప్పటికీ..ఆ రెండు గ్రామాల్లో ఆ ఆనవాళ్లు అస్సలు కనిపించవు. దశాబ్దాలుగా ఆ గ్రామాలు వినాయక చవితిని జరుపుకోవడం లేదట. ఆ గ్రామాలే అనంతపురం జిల్లా బసంపల్లి, విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని లచ్చిరాజుపేట గ్రామాలు.
అదే టైంలో జాతర..
అనంతపురం బసంపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగను జరుపకోకపోవడానికి కారణం గ్రామ దేవత మారెమ్మ జాతర అని చెబుతున్నారు స్థానిక ప్రజలు. మారెమ్మ జాతర తర్వాత వినాయక ఉత్సవం నిర్వహిస్తే గ్రామం పవిత్రత పోతుందని స్థానికుల నమ్మకం అట. అందువల్లే ఇక్కడ గణపతి నవరాత్రులు నిర్వహించుకోరు.
పోని చేసుకుందామన్నా..మారెమ్మ జాతర జరిగిన కొద్దిరోజులకే వినాయక చవితి పండుగ రాడంతో ఈ పండుగను జరుపుకోలేకపోతున్నారట. ఈ ఏడాది గ్రామ దేవత మారెమ్మ జాతర మంగవారం (ఆగస్టు 26) రోజు వచ్చింది..ఇవాళ జాతరు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా మరుసటి రోజే ఆగస్టు 27న (బుధవారం) వినాయక చవితి రావడం విశేషం.
అందుకే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను చేసుకోలేమని చెబుతున్నారు ప్రజలు. ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. వాళ్లంతా అమ్మవారి జాతర కారణంగానే వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదని అంటున్నారు.
అక్కడ పండుగ చేద్దామంటే ..అపశృతి..
విజయనగరం జిల్లా లచ్చిరాజం పేట గ్రామంలోని ప్రజలను ఎవరిని అడినా..గణపతి వేడుకలు వద్దు అన్నమాటే వినిపిస్తోంది. ఈ గ్రామం కూడా దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటోంది. పదిహేనేళ్ల క్రితం వినాయకచవితి పండుగ నిర్వహించే ప్రయత్నం చేస్తుండగా..ఓ వ్యక్తి కన్నుమూశారు. మరుసటి ఏడాది చేసుకుందామనుకుంటే..మరొకరు చనిపోయారు.
ఇలా వరుసగా మూడుసార్లు జరగడంతో వినాయక చవితి కలిసి రావడం లేదనే అభిప్రాయానికి వచ్చేశారు గ్రామస్తులు. అయితే 2019లో ఒకసారి యువకులు ఈ పండుగను ఎలాగైనా చేసుకోవాలని ప్రయత్నించగా..ఓ పెద్దావిడ కాలం చేసిందట. మళ్లీ కథ మొదటికే వచ్చిందని ఆ ప్రయత్నం విరమించుకున్నారట. ఇతర పండుగలకు ఇలాంటి ఆటంకాలేమి ఉండవని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలోనే చవితి వేడుకలు అనే ఆలోచనే తమ గ్రామంలో లేదంటున్నారు స్థానికులు.
(చదవండి: నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!)