
- ఒంటారియో ఓక్ విల్లేలో నిర్వహించిన టీమ్ యువ
- భిన్నత్వంలో ఏకత్వమే గణనాధుడి సందేశం: కెనడా విదేశాంగ మంత్రి
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండగలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాలను కెనడాలో స్థిరపడిన భారతీయులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒంటారియో రాష్ట్రం ఓక్ విల్లే పట్టణంలో తెలుగువారి కుటుంబాలన్నీ ఒక్క చోట చేరి గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. టీమ్ యువ పేరుతో ఏర్పాటైన సంఘం ఆధ్వర్యంలో యువకులంతా ఒక జట్టుగా గణనాధుడి వేడుకలను కనులపండగగా నిర్వహించారు.

పుట్టిన గడ్డకు సుదూరంలో ఉన్నా ఇక్కడ సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తున్నామని, రానున్న తరాలైన తమ పిల్లలకు భారతీయ పండగల విశిష్టత తెలిసేలా నిర్వహిస్తున్నామని టీమ్ యువ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓక్ విల్లే పార్లమెంట్ మెంబర్ సిమా అకన్, మేయర్ రాబ్ బుర్టన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. భారతీయుల పండగలు కలర్ ఫుల్ గా ఉంటాయని మెచ్చుకున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఉత్సవాల కోసం ప్రత్యేక సందేశం పంపారు. భిన్నత్వంలో ఏకత్వమనే సందేశాన్ని గణేష్ నవరాత్రులు నిరూపిస్తాయని ఆమె తెలిపారు.

ఆనందోత్సహాల మధ్య జరిగిన ఈ వేడుకలకు రఘు యాదవ్, మధు రెడ్డి, హరీశ్వర్, వెంకట్, శివకుమార్, అభిలాష్, అరుణ్ రెడ్డి, మనీష్, దినేష్, సృజన్ తదితరుల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేసింది.
