 
													వినాయక చవితి వేడుకలలకు రంగం సిద్ధమైంది. వివిధ ఆకారాల్లో గణనాయకులు ఇప్పటికే గణేష్ మంటపాలకు మేళ తాళాలతో తరలి వెళ్లాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్ననాయకుడిని కొలుచుకునేందుకు భక్తులు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా వినాయక చవితి అనగానే రకరకాల పూలు, పళ్లుతో పాలవెల్లి అలంకరణ, పూజకోసం 21 రకాల పత్రి సేకరణ, పుస్తకాలకు, ( పలకలకు) పసుపు పూసిబొట్లు పెట్టి అలంకరించుకోవడం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వినాయకుడి ప్రసాదాలు మరింత ప్రత్యేకం. కుడుములు, పాల తాలికలు, బెల్లం తాలికల తెలుగువారి ప్రేత్యేకమైన పిండి వంటలలను బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెడతారు. పాలతాలికల రుచి గొప్పదనం గురించి కవుల ప్రస్తావన, వర్ణన కూడా ఉంటుంది. అలాంటి పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
పాలతాలికల రెసిపీ 
తడి బియ్యం పిండి వాడితేనే పాలను బాగా పీల్చుకుని,రుచిగా తాలికలు మృదువుగా వస్తాయి.  వేరే మార్గం లేనివాళ్లు పొడి బియ్యం పిండిని కూడా వాడవచ్చు.  బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు  శుభ్రంగా  కడిగి వడబోసుకుని వడకట్టి , నీడన ఆరబెట్టుకోవాలి.   కొంచెం తడిపొడిగా ఉండగానే బియ్యాన్ని  పిండి పట్టించి, జల్లించుకోవాలి.  అరిసెల  కోసం తయారుచేసుకునే పిండిలాగా  మృదువుగా ఉంటే బావుంటుంది. పొడి పిండి అయితే కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకొని, పైన తడి గుడ్డ కప్పి ఉంచుకోవాలి. 
బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరగనివ్వండి, బెల్లం కరిగాక అప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిని తాలికలుగా చపాతీ పీటపైగానీ, చెక్కపై గానీ వత్తు కోవాలి.
పాలను మరింగించుకోవాలి. ఇపుడు ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం వేసి మరికొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇపుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకోవాలి. ఇలా కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇపుడు కొద్దిగా బియ్యం పిండిలో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ పాకంలో కలుపుకోవాలి. తాలికలు ఉడికినతరువాత బెల్లం పాకం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో యాలికల పొడి, నేతిలో వేయించిన ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే చాలు. దీన్ని వేడిగా తిన్నా, చల్లారిన తిన్నా భలే రుచిగా ఉంటాయి.
పాలు ఇష్టం లేనివారు, ఉత్తి బెల్లం పాకంలో తాలికలను వేసి, ఉడికించుకుని, , జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
