ఉగాది రోజునే పంచాంగ శ్రవణం ఎందుకంటే..? | Ugadi 2026: significance of reading panchanga sravanam on ugadi | Sakshi
Sakshi News home page

ఉగాది రోజునే పంచాంగ శ్రవణం ఎందుకంటే..?

Mar 19 2026 7:00 AM | Updated on Jun 18 2026 12:53 PM

Ugadi 2026: significance of reading panchanga sravanam on ugadi

తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ప్రముఖంగా ఆచరించేది పంచాంగ శ్రవణం. ఈ రోజునే ఎందుకంటే..తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మరి అంత విశిష్టత గల పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదోక దిక్సూచిలా ఉండేది. 

శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ ఏడాది వచ్చే ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.

సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.

సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.

పంచాంగకర్తలు తమ పంచాంగాల్లో ఈ క్రింద శ్లోకంతో పంచాంగ రచన కుపక్రమిస్తారు.

తిధిః వారంచ నక్షత్రం యోగః కరణమేవ చ
పంచాంగమితి విఖ్యాతం కాల్కోయం కర్మసాధక

తిధి వారము, నక్షత్రము, యోగము, కరణము అనునవి ఐదు అంగములు కలది కనుక ‘పంచాంగం’ అన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టేవరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారంమీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగం ఏఏ ఫలాలనిస్తుందో జ్యోతిష శాస్తజ్ఞ్రులు ఇలా చెప్పారు.

తిధేశ్చ శ్రీయమాప్నోది వారాదాయుష్మవర్ధనీమ్
నక్షత్రాద్హరతే పాపమ్ యోగాద్రోహ నివారణమ్
కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలమ్
కాల విత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్

సంపదల కోరేవారు తిథియందు, దీర్ఘాయువు కోరేవారు వారం యందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యము అభిలషించేవారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముయందు శ్రద్ధ వహించాలని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏమి చెప్పుచున్నదంటే

.‘‘ శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదో షారుహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వర్థన ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రాదం
నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం’’.

ఇది శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్స్వప్నాలను దోషాలను తొలగించేది; గంగాస్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగం ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షించింది.

పంచాంగశ్రవణం చేసిన వారికి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, గురుడు-సంపదను, కుజుడు- శుభాన్ని, బుధుడు-బుద్ధిని, కుజుడు- సుఖాన్ని, శని- ఐశ్వర్యాన్ని, రాహువు- బాహు బలాన్ని, కేతువు-కులాధిక్యాన్ని కలిగిస్తారు.

ప్రతి ఒక్కరు సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిషశాస్త్ర రీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకుని, ఆసంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది.

(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement