Ugadi 2022: నవనాయక ఫలితాలు (2022– 2023)

Ugadi 2022 Telugu Panchangam Subhakruth Nama Navanayaka Phalithalu - Sakshi

రాజు – శని
శని రాజు అయిన సంవత్సరంలో విచిత్ర వర్షాలు కురిసి పంటలు సామాన్యంగా ఫలిస్తాయి. రాజక్రోధం అధికమై యుద్ధాలు, చోరభయం కలుగుతాయి. రెండవ పంటలు, పర్వత పంటలు బాగా పండుతాయి. ధరలు సరిగా ఉండవు. స్వల్పవర్షాలు కురుస్తాయి. జనులు కపట స్వభాంతో సంచరిస్తారు. అధర్మమార్గంలో నడుచుకుంటారు. తక్కువస్థాయి ప్రజలు సుఖపడతారు. ఇది సహజ శని లక్షణం. అయితే శని స్వక్షేత్ర సంచారి కావడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.

రాజవాహన ఫలములు
అశ్వం రాజవాహనం– భూకంపాది ఉపద్రవాలు. రాజయుద్ధం, వర్షాభావం, పంటలు తగ్గడం, ఆహార ధాన్యాల కొరత, ధాన్యాదుల ధరలు పెరుగుదల, దుర్భిక్షం, జనహాని, ధనహాని కలుగుతాయి.

మంత్రి–గురు
గురువు మంత్రిగా ఉన్న సంవత్సరం అధిక ధాన్యపంటలు, సంపదలు, అధిక వర్షాలు, వృక్షాలు, çపంటలు బాగా ఫలిస్తాయి. భూమి గోకులంలా ఉంటుంది. సువృష్టితో భూమి సస్యసంపూర్ణమవుతుంది. భూమి సంపూర్ణ జలాలతో ఉంటుంది. రాజులు సమరోత్సాహం చూపుతారు. గ్రంథాతర వచనం: గోవులు అధిక క్షీరములు ఇచ్చును. ధాన్యము బాగా ఫలించును. క్షేమ, ఆరోగ్య, సుభిక్షములు కలుగును.

సేనాధిపతి–బుధ     
మేఘాలకు వాయుబాధ ఎక్కువై కష్టంతో వర్షిస్తాయి. సస్యాలు కూడా దానికి తగినట్లుగానే ఫలిస్తాయి. ప్రజలు కామాచార పరాయణులై ఉంటారు.

సస్యాధిపతి – రవి     
సూర్యుడు పూర్వ సస్యాధిపతి కావడం వల్ల ఈతిబాధలతో పూర్వ సస్యములు పీడింపబడును. ఉలవలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రధాన్యములు, మిర్చి, వక్కలు సమృద్ధిగా ఉత్పత్తి అయి ధరలు తగ్గి ఉంటాయి. తక్కిన ధాన్యములకు ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలలో ఒడిదుడుకులు ఉంటాయి. అని ఇతర గ్రంథ వచనం.

ధాన్యాధిపతి –శుక్రుడు 
అతివృష్టి సుభిక్షము మంచి పంటలు ప్రజలకు ఆరోగ్యము లభించును.

అర్ఘాధిపతి–బుధుడు
మంచి వర్షాలు కురుస్తాయి. ధరలు బాగుంటాయి. మంచి పంటలు పండుతాయి. పాషండులు, ఇంద్రజాలికులు, యువకులు దుçష్టులుగా పెరుగుతారు.

మేఘాధిపతి –బుధుడు 
మేఘగర్జనలు పిడుగుపాటులు గాలితో కూడిన వర్షములు వచ్చును. మధ్య దేశమునందు మంచి వర్షము వచ్చును. సర్వత్ర మధ్యస్థాయి వృష్టి సస్యములుండును అని గ్రంథాంతరము.

రసాధిపతి – కుజుడు 
కుజుడు రసాధిపతిగా ఉన్నప్పుడు జీలకర్ర, ఉప్పు, నెయ్యి, తైలము, బెల్లము మొదలగునవి ధరలు పెరగవు.

నీరసాధిపతి – రవి : రత్నములు మణులు చందనము వెండి, బంగారము, రాగి మొదలగు ధాతు లోహములకు ధరలు తగ్గును. రాష్ట్ర, రాజ, ప్రజాక్షోభములు జననాశము జరుగునని గ్రంథాంతర వచనము.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top