కాశ్మీర్ వేసవి అనుభవం కేవలం ఒక ప్రయాణం కాదు.. ప్రకృతి, సంస్కృతి ప్రశాంతత కలిసిన ఒక సజీవ కావ్వధార. ‘భూమిపై స్వర్గం’గా పేరొందిన ఈ ప్రాంతం, వేసవి కాలంలో తన సంపూర్ణ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని పర్వత లోయలు, నీలిరంగు సరస్సులు, పూలతో నిండిన తోటలు... ఇవన్నీ కలిపి కాశ్మీర్‌ను ఒక కలల ప్రపంచంలా మార్చేస్తాయి..
పూలతో నిండి బోట్‌లు
శ్రీనగర్‌కి ఆభరణంలా వెలుగొందే దాల్ సరస్సు, కాశ్మీర్ పర్యాటకానికి కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసును వెంటనే ఆకర్షిస్తుంది. శికారా పడవలో సరస్సు మీద నెమ్మదిగా ప్రయాణించడం ఒక మధురమైన అనుభవం. నీటి మీద తేలియాడే తోటలు, పూలతో నిండిన హౌస్‌బోట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రత్యేకంగా తెల్లవారుజామున జరిగే తేలియాడే కూరగాయల మార్కెట్ అనుభవం మరచిపోలేనిది. స్థానిక రైతులు తమ పడవలలో తాజా కూరగాయలను విక్రయించే ఈ దృశ్యం, కాశ్మీర్ జీవనశైలిని దగ్గరగా పరిచయం చేస్తుంది.
మొఘల్ తోటలు
వేసవి ప్రారంభంలో శ్రీనగర్ చుట్టూ ఉన్న తోటలు పుష్పాలతో కళకళలాడుతుంటాయి. టులిప్ ఉత్సవం ఏప్రిల్‌లో ముగిసినా, షాలిమార్ బాగ్ మరియు నిషాత్ బాగ్ వంటి మొఘల్ తోటలు ఇంకా అందంగా వికసిస్తూనే ఉంటాయి. ఈ తోటల్లో విహరించడం ఒక రొమాంటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి మూలలోనూ ప్రకృతి అందాల పరిమళం మనసును హత్తుకుంటుంది.
పచ్చని స్వర్గధామం..
‘పూల మైదానం’గా పేరొందిన గుల్మార్గ్ వేసవిలో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మంచు కరిగిపోయిన తర్వాత పచ్చని గడ్డి మైదానాలు విస్తరించి, కనిపిస్తాయి. గుల్మార్గ్ గోండోలా రైడ్ ఆసియాలోనే అత్యంత ఎతైన కేబుల్ కార్‌లలో ఒకటి. ఈ ప్రయాణంలో హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా, వసతి సదుపాయాలు ఉన్నాయి.
ఐఆర్‌సిటితోపాటు ఇతర ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు కూడా ప్యాకేజీని అందిస్తున్నాయి.
నాలుగు, ఐదు, ఎనిమిది రోజులకు గాను రూ.20 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
కాశ్మీర్ వేసవి అనుభవం ఒక కలలా ఉంటుంది. ప్రతి ప్రదేశం ఒక కథ చెబుతుంది. ప్రకృతి అందాలు, సాంస్కృతిక సంపద, ప్రశాంత జీవనం కలిసిన ఒక అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
నూతన సంవత్సరాది బోహాగ్ బిహు
దేశంలో చల్లని ప్రదేశంగా పేరొందిన అస్సాంలో ఆనందంగా జరుపుకునే సంవత్సరాది పండగ బోహాగ్ బిహె. దీనిని ‘రొంగలీ బిహు’ అని కూడా పిలుస్తారు. ఉత్సాహభరితమైన పండుగగా పేరొందింది ఇది అస్సామీ నూతన సంవత్సరాన్ని, వసంతకాలం ఆగమనాన్నీ సూచిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో సంవత్సరాది ఉగాది. అస్సామీల సంవత్సరాది బోహాగ్ బిహు. ఈ పండుగ సాధారణంగా ఏప్రిల్ నెల మధ్యలో (అస్సామీ నెల ’బోహాగ్’ మొదటి రోజు) వస్తుంది. దీనిని వాళ్లు వారం రోజుల పాటు జరుపుకుంటారు.
పంటల కోసం దేవుని ఆశీర్వాదం..
ఈ పండగ వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. రైతులు ఏడాది అంతా పంటలు బాగా పండాలని, ఈ రోజున వారు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. ‘రొంగలి’ అంటే ఆనందం, రంగుల పండుగ అని కూడా అర్థం.
పండగ మొదటి రోజును గోరు బిహు అంటారు. ఆ రోజున ఆవులను, ఎద్దులను పసుపు, ఇతర ఔషధ మూలికలతో కడిగి, పూల దండలు వేసి, పూజలు జరుపుతారు. బెండకాయలు, పొట్లకాయలు తినిపిస్తారు.
పండగ రెండవ రోజున మనుహ్ బిహు అంటారు. ఆ రోజున ప్రజలు కొత్త బట్టలు ధరించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. స్నేహితులు, బంధువుల దగ్గరకు వెళ్లి, పిఠా అనే సంప్రదాయ వంటకాన్ని, రుచికరమైన పదార్థాలను పంచుకుంటారు.
ఆనందంగా నృత్యాలు..
యువతీ–యువకులు సంప్రదాయ దుస్తులను అలంకరించుకుంటారు. డ్రమ్స్ వాయిస్తూ, కొమ్ముతో చేసిన వాయిద్యాలతో శబ్ధం చేస్తూ నృత్యం ఆనందంగా చేస్తారు. ఈ ఏడురోజుల పండగను చూడటానికి టూరిస్టులు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వెళుతుంటారు.
(చదవండి: సమ్మర్‌లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!)


