
గుడ్డు అనగానే ఆవిరిపై ఉడికించుకోవడం దగ్గర నుంచి ఆమ్లెట్– బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం వరకే మనకు తెలిసిన రుచులు! మరి ఎప్పుడైనా కొత్తగా సరికొత్తగా ప్రయత్నించి చూశారా? ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా గుడ్డుతో చేసుకునే వెరైటీలను చూద్దాం. చేసేద్దాం.. ఆరోగ్యానికి ఇవి వెరీ గుడ్డూ! ఇంకెందుకు ఆలస్యం? ఇలా ట్రై చేయండి.
ఎగ్ మోమోస్
కావలసినవి: మైదాపిండి – 2 కప్పులు; గుడ్లు – 5; ఉల్లిపాయ ముక్కలు – ఒక టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి); అల్లం–వెల్లుల్లి పేస్ట్-ఒక టీ స్పూన్; కొత్తిమీర తరుగు-2 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము– పావు కప్పు చొప్పున; సోయా సాస్›– ఒక టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; నూనె, నీళ్లు, ఉప్పు – సరిపడా
తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీపిండిలా కలుపుకోవాలి. చివరగా ఒక టీస్పూన్ నూనె వేసి పిండిని మరోసారి బాగా కలిపి, తడి వస్త్రంతో కప్పి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుని, నూనె వేడయ్యాక, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు గరిటెతో తిప్పాలి.
పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము వేసి 2–3 నిమిషాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేసుకుని బాగా కలిపి, రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో సోయా సాస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి, చల్లారనివ్వాలి. ఈలోపు మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకుని.. ఒక్కో గరిటె ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని, మోమోస్‌లా చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఆవిరిలో ఉడికించుకుంటే సరిపోతుంది.
ఎగ్ చాట్
కావలసినవి: గుడ్లు- 2 (ఉడికించినవి); ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు – అర కప్పు చొప్పున; జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు – పావు టీస్పూన్ చొప్పున; కారం, చాట్ మసాలా – అర టీస్పూన్ చొప్పున; కొత్తిమీర తరుగు, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్ చొప్పున; ఉప్పు, నూనె – సరిపడా; కొత్తిమీర–పచ్చిమిర్చిలతో చేసిన కారం పచ్చడి లేదా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; కారప్పూస – 2 టేబుల్ స్పూన్లపైనే.
తయారీ: ముందుగా గుడ్లను ఉడికించి, పైపెంకు తీసి, నిలువుగా కట్ చేసుకోవాలి. గుడ్డు పసుపు సొనను తీసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు పాన్ మీద కొద్దిగా నూనె వేసుకుని, వేడి కాగానే జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు వేసుకుని గుడ్డు ముక్కలను ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు సొనను అదే నూనెలోవేసి పొడి పొడిడిగా చేసుకుని పెట్టుకోవాలి. అనంతరం ఆ గుడ్డు ముక్కల్లో కొత్తిమీర– పచ్చిమిర్చి పచ్చడి లేదా సాస్ కొద్దికొద్దిగా వేసుకుని, పైన, కొద్దికొద్దిగా పసుపు సొన మిశ్ర మం, ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, కొత్తిమీర తురుగు, కారప్పూస ఒకదాని తర్వాత ఒకటి నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
ఎగ్ బన్స్
కావలసినవి: గుండ్రటి టమాటో ముక్కలు, గుండ్రటి బన్నులు, గుడ్లు -6, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు - కొద్దిగా; క్యారెట్ తురుము -పావు కప్పు; మిరియాల పొడి, ఎండు మిర్చి కచ్చాబిచ్చా మిశ్రమం-కొద్దికొద్దిగా; చీజ్ తురుము, బటర్ – సరిపడా
తయారీ: ముందుగా బన్నులను పైన గుండ్రంగా చిన్న భాగం కట్ చేసుకుని, లోపలున్న బ్రెడ్‌ను తొలిచి, కప్పు మాదిరి మార్చుకోవాలి. ఇప్పుడు ప్రతి బన్‌లో ఒక్కో టమోటో ముక్క వేసుకుని, మిరియాల పొడి జల్లుకుని, కొద్దికొద్దిగా క్యారెట్ తురుమును అందులో పరచుకోవాలి. ఇప్పుడు ప్రతి బన్‌లో ఒక్కో గుడ్డు కొట్టుకుని వేసుకోవాలి. తెల్లసొన లోపలికి ఇంకిపోయి, పసుపు సొన పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇక దాని చుట్టూ చీజ్ తురుము పరుచుకుని, పైన కచ్చాబిచ్చా చేసిన ఎండుమిర్చి పౌడర్‌ను వేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో సరిపడా బటర్ కరిగించి, స్టవ్ చిన్న మంట మీద పెట్టుకుని, పాన్‌లో బన్నులను వరసగా పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. బన్స్‌లో గుడ్డు ఉడికి, చీజ్ కరిగి గట్టిగా మారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు.