
‘‘ఇతరులతో పోల్చుకోవడం ప్రేరణను ఇవ్వకపోగా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది’’ అని ఒక స్కూల్ వర్క్‌షాప్‌లో చెప్పినప్పుడు ఒక పేరెంట్ లేచారు. ‘‘వాళ్లలా నేనెందుకు సక్సెస్ కాలేకపోతున్నాను నాన్నా? అని మా బాబు చాలాసార్లు అడుగుతాడు సర్! ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నాలో నేనే బాధపడతాను’’ అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోజుకు ముగ్గురు, నలుగురు విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం మా సెంటర్‌కు వస్తుంటారు. వాళ్లకు 90 శాతం మార్కులు వస్తున్నా, ఫెయిల్యూర్‌లా ఫీలవుతుంటారు. కారణం ఇతరులతో పోల్చుకోవడం. ఈ సమస్యతో పిల్లలు, విద్యార్థులే కాదు, లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి. కాస్తంత గమనిస్తే, ఇది అందరికీ తెలిసే విషయమే!
అసలేంటీ కంపేరిజన్ సిండ్రోమ్?
మనిషి తనను తాను అర్థం చేసుకునేందుకు ఇతరులతో పోల్చుకుంటాడు. అది సహజం. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, టాప్ ర్యాంక్స్, పక్కింటి పిల్లలతో పోలికలు– ఇవన్నీ ఇప్పుడు పిల్లల మనసుల్లో భయాన్ని, ఆందోళనను, న్యూనత భావాన్ని నింపుతున్నాయి. ఇలా ఇతరులతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోవడమే కంపేరిజన్ సిండ్రోమ్.
సోషల్ కంపేరిజన్ సిద్ధాంతాన్ని 1954లో లియోన్ ఫెస్టింజెర్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు. మన అసలైన విలువను పక్కన పెట్టి, ఇతరుల ప్రమాణాలతో మన జీవితం నడపడమే దీని లక్షణం. ఈ పోలికలు వాళ్లకంటే తక్కువగా ఉన్నవారితో లేదా మెరుగ్గా ఉన్నవారితో జరగొచ్చు. పోలికలు నెగటివ్ దిశలో ఎక్కువగా జరిగితే ఆత్మన్యూనత, అసంతృప్తి, ఆత్మనింద పెరుగుతాయి.
పది పరిష్కార మార్గాలు
కంపేరిజన్ అనేది ఒక ట్రాప్. ఏ రెండు వేలిముద్రలూ ఒకలా ఉండనట్లే, ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకేలా ఉండరు, ఒకేలా చదవరు, చదవలేరు. కాబట్టి ఈ కంపేరిజన్ ట్రాప్ నుంచి బయటపడితేనే మీ అసలైన ప్రతిభ కనిపిస్తుంది. అందుకోసం ఈ పది మార్గాలు పాటించండి.
1. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. ‘‘నిన్న కంటే నేడు ఏం మెరుగయ్యాను?’ అని ప్రశ్నించుకుని మీ ప్రోగ్రెస్‌ను గమనించండి.
2, సోషల్ మీడియా ఒక ఫిల్టర్ చేసిన ప్రపంచం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరి విజయమూ ఫుల్ స్టోరీ కాదు. మీ ప్రయాణం నిజమైనదిగా, నిజాయితీగా ఉంటే చాలు.
3. ప్రయత్నం మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు కష్టపడ్డారు, ఎలా ఫోకస్ చేశారన్నదే అసలైన విజయానికి సూచిక.
4. మీ బలాల జాబితా తయారు చేసుకోండి. ‘నాలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?’ అని రాసుకోండి.
5. మైండ్‌ఫుల్ బ్రేకులు తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోండి. పోలిక వల్ల వచ్చే నెగటివ్ భావాల నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ పది నిమిషాల సేపు మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి.
6. పరీక్షలు ఓ పోటీ కాదు, నేర్చుకునే ప్రయాణం అని గుర్తుంచుకోండి. ఫలితాల కోసమే కాకుండా, అభివృద్ధి కోసం చదవండి.
7. ఇతరులు చేసిన విమర్శలు మీ విలువకు ప్రమాణం కాదు. ఏదైనా కామెంట్, మెసేజ్ వల్ల తక్కువగా ఫీలవకండి. అది వాళ్ల అభిప్రాయం మాత్రమే అని గుర్తించండి.
8. మీ సొంత లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండండి. ఇతరులు ఎటు పోతున్నారన్న దానికన్నా, మీరు ఎందుకు చదువుతున్నారన్న దానిపై దృష్టి పెట్టండి.
9. తప్పుల నుంచి నేర్చుకోండి. తప్పు చేయడమంటే ఫెయిలవ్వడం కాదు, నేర్చుకునే అవకాశ అనే దృష్టితో చూడండి.
10. మీరు వేరెవరిలానో మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. మీ బాటలో మీరున్నారని నమ్మండి.
మీ బిడ్డ కంపేరిజన్ ట్రాప్‌లో ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి?
‘నాకు రాదు’ అనే మాట తరచూ వినిపిస్తే
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే · ‘వాళ్లు మంచి మార్కులు తెచ్చుకున్నారు’ అని తరచూ చెప్తుంటే
మిగిలినవాళ్ల విజయాలను చూసి తనదే తప్పులా భావిస్తే
విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు
ఇతరుల విజయాలను చూస్తూ తానేం సాధించలేనన్న భావనలో బందీలవుతారు.
తమ ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదనుకోవడంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడూ తప్పులపైనే దృష్టి పెడుతుండటం వల్ల తమను తామే నిందించుకుంటారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, సృజనశీలత దెబ్బతింటాయి.
ఇతరుల విజయాలు, తమ లోపాలపైనే దృష్టి పెట్టడం వల్ల ఎవరితో మాట్లాడకుండా, కలవకుండా ఒంటరవుతారు.
పదే పదే పోల్చుకోవడం వల్ల ఒత్తిడి, నిరాశ, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్‌కు దారితీయవచ్చు.
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com
(చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్‌లో..)