breaking news
selfdefence
-
సెల్ఫ్ డిఫెన్స్ రూట్..! వింగ్ చున్ ఫైట్..
నగరంలో మహిళలపై వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. శక్తినంతా కూడదీసుకుని ప్రతిఘటించే యత్నాలు, అరుపులు.. వంటివి కొంత మేరే ఫలితాన్నిస్తాయి. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారినప్పుడు కొన్ని స్వీయరక్షణ మెళకువలు తప్పనిసరి. దీనిలో భాగమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం. అయితే కొన్ని మార్షల్ ఆర్ట్స్ మహిళలు సాధన చేయడం కూడా కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నా మహిళల చేత.. మహిళల కోసం పుట్టిన ఒకే యుద్ధకళ వింగ్ చున్ కుంగ్ ఫూ.. దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన యుద్ధ కళ ‘వింగ్ చున్ కుంగ్ ఫూ’. ఈ యుద్ధ కళను ఎంగ్ మ్యూ అనే షావొలిన్ బుద్ధిస్ట్, నన్, మఠాధిపతి హోదాలో ఓ చైనీస్ మహిళ ప్రపంచంలో మొట్టమొదటి సారి సృష్టించారు. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో వాటి కదలికల్ని చైనీస్ కుంగ్ ఫూ రూపంలో మేళవించి దీన్ని రూపుదిద్దారు. ఆ తర్వాత ఆమె యిమ్ వింగ్ చున్ అనే అందమైన భక్తురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట. ఎంతో అందమైన ఈ అమ్మాయి తనను వేధిస్తున్న దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. ఈ యుద్ధ కళే వింగ్ చున్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాతి క్రమంలో యిమ్ వింగ్ చున్గా మారింది. దీన్ని మహిళే డిజైన్ చేసినప్పటికీ.. బ్రూస్లీ గురువు, గ్రాండ్ మాస్టర్ ఐపీ మ్యాన్ దీన్ని తొలిసారి జనాల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వింగ్ చున్ను సాధన చేస్తున్నారు.ప్రస్తుతం దీనిని అత్యంత జనసామరథ్యం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. ఎక్కువ సమయం తీసుకునే ఇతర మార్షల్ ఆర్ట్స్‌తో పోలిస్తే దీనిని చాలా తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే పూర్తి పట్టు సాధించేందుకు రెండేళ్లు సరిపోతుంది. సింపుల్, డైరెక్ట్, ఎఫిషియంట్ ఆర్ట్ అయిన వింగ్ చున్ శక్తి కన్నా స్ట్రక్చర్‌ని, వేగం కన్నా టైమింగ్‌ని అధికంగా ఉపయోగించుకుంటుంది. సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించనక్కర్లేదు. తద్వారా అసాధారణ ఫ్లెక్సిబిలిటీ గానీ క్రీడా నైపుణ్యంగానీ సాధకులకు అవసరం ఉండదు. స్వీయరక్షణ సామర్థ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్జీఓ స్వరక్షణ్ ట్రస్ట్ ఇండియా వింగ్ చున్ అకాడమీ (ఐడబ్ల్యూసీఏ)సూ్కల్స్ నిర్వహిస్తూ వింగ్ చున్ కుంగ్ ఫూను కార్పొరేట్స్‌కి, ఎన్జీఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణెలలో నిర్వహిస్తున్నామని, త్వరలో నగరంలో కూడా తమ శిక్షణా కేంద్రం ప్రారంభించనున్నామని, తమ విద్యార్థులే నగరంలో దీనిని నిర్వహించనున్నారని అకాడమీ నిర్వాహకులు శివ్ తెలిపారు. కొంగలా.. సర్పంలా..ఇది ఒక సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకునేది కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికితీస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రతతో దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో ఉంటాయి. దీనికి ఎటువంటి ప్రత్యేకమైన దుస్తులు గాని, వస్త్రధారణగాని అవసరం లేదు. దీనిని మగవాళ్లు/ మహిళలు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలివేటర్స్, వాష్ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్.. వంటి ఇరుకైన ప్రదేశాల్లో సైతం సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్ చున్ ప్రత్యేకత. తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా దీని ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. (చదవండి: 11 ఏళ్ల రైతు... పండిస్తోంది చూడు...) -
పోల్చుకోవద్దు.. కుంగిపోవద్దు!
‘‘ఇతరులతో పోల్చుకోవడం ప్రేరణను ఇవ్వకపోగా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది’’ అని ఒక స్కూల్ వర్క్‌షాప్‌లో చెప్పినప్పుడు ఒక పేరెంట్ లేచారు. ‘‘వాళ్లలా నేనెందుకు సక్సెస్ కాలేకపోతున్నాను నాన్నా? అని మా బాబు చాలాసార్లు అడుగుతాడు సర్! ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నాలో నేనే బాధపడతాను’’ అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోజుకు ముగ్గురు, నలుగురు విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం మా సెంటర్‌కు వస్తుంటారు. వాళ్లకు 90 శాతం మార్కులు వస్తున్నా, ఫెయిల్యూర్‌లా ఫీలవుతుంటారు. కారణం ఇతరులతో పోల్చుకోవడం. ఈ సమస్యతో పిల్లలు, విద్యార్థులే కాదు, లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి. కాస్తంత గమనిస్తే, ఇది అందరికీ తెలిసే విషయమే!అసలేంటీ కంపేరిజన్ సిండ్రోమ్? మనిషి తనను తాను అర్థం చేసుకునేందుకు ఇతరులతో పోల్చుకుంటాడు. అది సహజం. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, టాప్ ర్యాంక్స్, పక్కింటి పిల్లలతో పోలికలు– ఇవన్నీ ఇప్పుడు పిల్లల మనసుల్లో భయాన్ని, ఆందోళనను, న్యూనత భావాన్ని నింపుతున్నాయి. ఇలా ఇతరులతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోవడమే కంపేరిజన్ సిండ్రోమ్.సోషల్ కంపేరిజన్ సిద్ధాంతాన్ని 1954లో లియోన్ ఫెస్టింజెర్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు. మన అసలైన విలువను పక్కన పెట్టి, ఇతరుల ప్రమాణాలతో మన జీవితం నడపడమే దీని లక్షణం. ఈ పోలికలు వాళ్లకంటే తక్కువగా ఉన్నవారితో లేదా మెరుగ్గా ఉన్నవారితో జరగొచ్చు. పోలికలు నెగటివ్ దిశలో ఎక్కువగా జరిగితే ఆత్మన్యూనత, అసంతృప్తి, ఆత్మనింద పెరుగుతాయి.పది పరిష్కార మార్గాలుకంపేరిజన్ అనేది ఒక ట్రాప్. ఏ రెండు వేలిముద్రలూ ఒకలా ఉండనట్లే, ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకేలా ఉండరు, ఒకేలా చదవరు, చదవలేరు. కాబట్టి ఈ కంపేరిజన్ ట్రాప్ నుంచి బయటపడితేనే మీ అసలైన ప్రతిభ కనిపిస్తుంది. అందుకోసం ఈ పది మార్గాలు పాటించండి. 1. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. ‘‘నిన్న కంటే నేడు ఏం మెరుగయ్యాను?’ అని ప్రశ్నించుకుని మీ ప్రోగ్రెస్‌ను గమనించండి. 2, సోషల్ మీడియా ఒక ఫిల్టర్ చేసిన ప్రపంచం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరి విజయమూ ఫుల్ స్టోరీ కాదు. మీ ప్రయాణం నిజమైనదిగా, నిజాయితీగా ఉంటే చాలు.3. ప్రయత్నం మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు కష్టపడ్డారు, ఎలా ఫోకస్ చేశారన్నదే అసలైన విజయానికి సూచిక.4. మీ బలాల జాబితా తయారు చేసుకోండి. ‘నాలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?’ అని రాసుకోండి.5. మైండ్‌ఫుల్ బ్రేకులు తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోండి. పోలిక వల్ల వచ్చే నెగటివ్ భావాల నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ పది నిమిషాల సేపు మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి.6. పరీక్షలు ఓ పోటీ కాదు, నేర్చుకునే ప్రయాణం అని గుర్తుంచుకోండి. ఫలితాల కోసమే కాకుండా, అభివృద్ధి కోసం చదవండి.7. ఇతరులు చేసిన విమర్శలు మీ విలువకు ప్రమాణం కాదు. ఏదైనా కామెంట్, మెసేజ్ వల్ల తక్కువగా ఫీలవకండి. అది వాళ్ల అభిప్రాయం మాత్రమే అని గుర్తించండి. 8. మీ సొంత లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండండి. ఇతరులు ఎటు పోతున్నారన్న దానికన్నా, మీరు ఎందుకు చదువుతున్నారన్న దానిపై దృష్టి పెట్టండి.9. తప్పుల నుంచి నేర్చుకోండి. తప్పు చేయడమంటే ఫెయిలవ్వడం కాదు, నేర్చుకునే అవకాశ అనే దృష్టితో చూడండి. 10. మీరు వేరెవరిలానో మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. మీ బాటలో మీరున్నారని నమ్మండి. మీ బిడ్డ కంపేరిజన్ ట్రాప్‌లో ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి?‘నాకు రాదు’ అనే మాట తరచూ వినిపిస్తేసోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే · ‘వాళ్లు మంచి మార్కులు తెచ్చుకున్నారు’ అని తరచూ చెప్తుంటే మిగిలినవాళ్ల విజయాలను చూసి తనదే తప్పులా భావిస్తేవిద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులుఇతరుల విజయాలను చూస్తూ తానేం సాధించలేనన్న భావనలో బందీలవుతారు. తమ ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదనుకోవడంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడూ తప్పులపైనే దృష్టి పెడుతుండటం వల్ల తమను తామే నిందించుకుంటారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, సృజనశీలత దెబ్బతింటాయి. ఇతరుల విజయాలు, తమ లోపాలపైనే దృష్టి పెట్టడం వల్ల ఎవరితో మాట్లాడకుండా, కలవకుండా ఒంటరవుతారు. పదే పదే పోల్చుకోవడం వల్ల ఒత్తిడి, నిరాశ, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్‌కు దారితీయవచ్చు. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
పచ్చని సంసారానికి ఆకుపచ్చని ఆర్మీ
పచ్చని సంసారానికి గ్రీన్ ఆర్మీ కావాలి అంటున్నారు వారణాసిలోని కుషియారి గ్రామ వాసులు. ఈగ్రామంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వాళ్లే ఎక్కువ.నిరుపేదలు కావడంతో విద్యాగంధం ఉన్న వాళ్లు తక్కువ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. చాలా కుటుంబాల్లో పెద్దరికం వహించాల్సిన భర్తలు తాగుడు, మత్తుపదార్థాలకు బానిసలై భార్యలను కొట్టడం, తిట్టడం, ఇంట్లో ఖర్చులకు డబ్బులు అడిగితే తన్ని తరిమేయడం సర్వసాధారణమైంది. గత కొన్నేళ్లుగా భర్తల తీరుతో విసిగిపోయిన గ్రామ మహిళలకు రవి మిశ్రా అనే టీచర్ చుక్కానిలా దారిచూపుతున్నాడు. భర్త బాధితురాలైన ఆశాదేవిని కలిసిన మిశ్రా సమస్యలు ఆమె ఒక్కదానికే కాదు, ఆమె ఇరుగు పోరుగు వారి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని తెలుసుకున్నాడు. మీరంతా కలసికట్టుగా ఉంటే ఇవేమీ పెద్ద సమస్యలు కాదని చెప్పి, ఆశాదేవితోపాటు మరికొంతమంది మహిళలను కూడగట్టుకుని 2014లో ‘గ్రీన్‌ఆర్మీ’నిప్రారంభించారు. వ్యసనాలకు బానిసలైన భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి సరైన దారిలో నడిపించడమే ఈ ఆర్మీ ముఖ్య ఉద్దేశ్యం. ఆర్మీలోని సభ్యులు పచ్చని రంగు చీర కట్టుకుని, కర్రలు పట్టుకుని ఎవరైనా ఇంట్లో భర్తలు తాగి గొడవచేస్తుంటే వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొస్తారు. లిక్కర్, మత్తుపదార్థాలకు బానిసలైన వారికి రకరకాలుగా కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మనుషులుగా మార్చడానికి కృషిచేస్తోంది. భర్తలతోపాటు.. గ్రామాభివృద్ధికి ప్రస్తుతం ఈ ఆర్మీలో 1800 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్మీ చేస్తోన్న కార్యకలాపాలు చూసిన ఎంతోమంది ఇతర గ్రామాల్లో గులాబీ గ్యాంగ్ వంటి రకరకాల పేర్లతో ఆర్మీలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మహిళలు తమను తాము రక్షించుకొనేందుకు ఆత్మరక్షణ విద్యలలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. వారణాసి, మీర్జాపూర్ జిల్లాల్లోని చాలామంది మహిళలు ఈ ఆర్మీ ద్వారా భర్తలను మార్చుకుని సంతోషంగా జీవిస్తున్నారు. మూర్ఖపు భర్తలను మార్చడంతోపాటు, గృహహింస, వరకట్నం, మూఢాచారాలు నిర్మూలించేందుకు ఆర్మీలు కృషి చేస్తున్నాయి. ఈ ఆర్మీల వల్ల కుటుంబ పరిస్థితులు మెరుగుపడడమేగాక, గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ‘‘నా పేరు ఆశాదేవి. పద్నాలుగేళ్లకే పెళ్లి అయ్యింది. ఐదుగురు పిల్లలు. నా భర్త ఎప్పుడూ కొట్టేవాడు. గర్భవతినని కూడా చూడకుండా హింసించేవాడు. పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు కూడా పెరిగాయి. కానీ ఆయన మాత్రం తాగడం మానలేదు. నన్ను కొట్టడం ఆపలేదు. ఆయన కొట్టిన దెబ్బలకు రాత్రులకు నిద్రపట్టేది కాదు. మూలుగుతూ పడుకున్న నన్ను మళ్లీ మళ్లీ కొట్టేవాడు. చలికాలం ఇంటి బయటకు నెట్టేసేవాడు. బాధలు తట్టుకోలేక చచ్చిపోదామని నిప్పు అంటించుకున్నాను.కానీ వేరేవాళ్లు కాపాడడంతోప్రాణాలు రవి మిశ్రా హోప్ వెల్ఫేర్ ట్రస్ట్వాళ్లతో కలసి మా గ్రామానికి వచ్చారు. అప్పుడు నా పరిస్థితి, పిల్లలు స్కూలుకు కూడా వెళ్లడంలేదని తెలుసుకున్నారు. నేను నా బాధల గురించి వివరించాను. వారు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ఆయన తాగడం మానేశాడు. ఎనిమిదేళ్లుగా మంచి వ్యక్తిగా మారి, నన్ను పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. ఆ తరువాతే నాలాంటి మహిళలను ఆదుకునేందుకు మిశ్రా తో కలిసి గ్రీన్ ఆర్మీని ఏర్పాటు చేశాము.’’ ఆశా దేవి లాంటి వందలమంది మహిళలు గ్రీన్ ఆర్మీ ద్వారా సంసారాలను చక్కబెట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు. -
స్వీయ రక్షణే స్వైన్‌ఫ్లూ నివారణ మంత్రం
కర్నూలు(హాస్పిటల్): స్వీయ రక్షణ చర్యలే స్వైన్‌ఫ్లూ నివారణ మంత్రమని జనరల్ పిజీషియన్ డాక్టర్ భవానీప్రసాద్ చెప్పారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్ క్లబ్లో స్వైన్‌ఫ్లూ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు పోస్ట్‌మాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ భవానీప్రసాద్ మాట్లాడుతూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి అధికంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలు, హెచ్ఐవీ, టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారికి వస్తుందని, వీరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, వ్యాధి తగ్గే వరకు బయట తిరగకపోవడమే మేలన్నారు. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణచక్రవర్తి, ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్, సభ్యులు చంద్రశేఖర కల్కూర, ఐ.విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.