
నగరంలో మహిళలపై వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్‌నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. శక్తినంతా కూడదీసుకుని ప్రతిఘటించే యత్నాలు, అరుపులు.. వంటివి కొంత మేరే ఫలితాన్నిస్తాయి. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారినప్పుడు కొన్ని స్వీయరక్షణ మెళకువలు తప్పనిసరి. దీనిలో భాగమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం. అయితే కొన్ని మార్షల్ ఆర్ట్స్ మహిళలు సాధన చేయడం కూడా కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నా మహిళల చేత.. మహిళల కోసం పుట్టిన ఒకే యుద్ధకళ వింగ్ చున్ కుంగ్ ఫూ..
దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన యుద్ధ కళ ‘వింగ్ చున్ కుంగ్ ఫూ’. ఈ యుద్ధ కళను ఎంగ్ మ్యూ అనే షావొలిన్ బుద్ధిస్ట్, నన్, మఠాధిపతి హోదాలో ఓ చైనీస్ మహిళ ప్రపంచంలో మొట్టమొదటి సారి సృష్టించారు. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో వాటి కదలికల్ని చైనీస్ కుంగ్ ఫూ రూపంలో మేళవించి దీన్ని రూపుదిద్దారు. ఆ తర్వాత ఆమె యిమ్ వింగ్ చున్ అనే అందమైన భక్తురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట.
ఎంతో అందమైన ఈ అమ్మాయి తనను వేధిస్తున్న దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. ఈ యుద్ధ కళే వింగ్ చున్‌గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాతి క్రమంలో యిమ్ వింగ్ చున్‌గా మారింది. దీన్ని మహిళే డిజైన్ చేసినప్పటికీ.. బ్రూస్‌లీ గురువు, గ్రాండ్ మాస్టర్ ఐపీ మ్యాన్ దీన్ని తొలిసారి జనాల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వింగ్ చున్‌ను సాధన చేస్తున్నారు.
ప్రస్తుతం దీనిని అత్యంత జనసామరథ్యం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు.
ఎక్కువ సమయం తీసుకునే ఇతర మార్షల్ ఆర్ట్స్‌తో పోలిస్తే దీనిని చాలా తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే పూర్తి పట్టు సాధించేందుకు రెండేళ్లు సరిపోతుంది.
సింపుల్, డైరెక్ట్, ఎఫిషియంట్ ఆర్ట్ అయిన వింగ్ చున్ శక్తి కన్నా స్ట్రక్చర్‌ని, వేగం కన్నా టైమింగ్‌ని అధికంగా ఉపయోగించుకుంటుంది.
సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించనక్కర్లేదు. తద్వారా అసాధారణ ఫ్లెక్సిబిలిటీ గానీ క్రీడా నైపుణ్యంగానీ సాధకులకు అవసరం ఉండదు.
స్వీయరక్షణ సామర్థ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్‌జీఓ స్వరక్షణ్ ట్రస్ట్ ఇండియా వింగ్ చున్ అకాడమీ (ఐడబ్ల్యూసీఏ)సూ్కల్స్ నిర్వహిస్తూ వింగ్ చున్ కుంగ్ ఫూను కార్పొరేట్స్‌కి, ఎన్‌జీఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణెలలో నిర్వహిస్తున్నామని, త్వరలో నగరంలో కూడా తమ శిక్షణా కేంద్రం ప్రారంభించనున్నామని, తమ విద్యార్థులే నగరంలో దీనిని నిర్వహించనున్నారని అకాడమీ నిర్వాహకులు శివ్ తెలిపారు.
కొంగలా.. సర్పంలా..
ఇది ఒక సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకునేది కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికితీస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రతతో దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో ఉంటాయి. దీనికి ఎటువంటి ప్రత్యేకమైన దుస్తులు గాని, వస్త్రధారణగాని అవసరం లేదు.
దీనిని మగవాళ్లు/ మహిళలు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలివేటర్స్, వాష్ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్.. వంటి ఇరుకైన ప్రదేశాల్లో సైతం సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్ చున్ ప్రత్యేకత. తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా దీని ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
(చదవండి: 11 ఏళ్ల రైతు... పండిస్తోంది చూడు...)