
11 ఏళ్ల పాప ఏం చేస్తుంది? స్కూల్‌కెళ్లి, ఇంటికొచ్చి, హోం వర్క్ చేసుకుని, తోటి పిల్లలతో ఆడుకుంటుంది. లేదంటే టీవీ ముందు కూర్చుని రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తుంది. అయితే కేరళ రాష్ట్రం కన్నూర్‌కు చెందిన వైఘశ్రీ మాత్రం మొక్కలతో దోస్తీ కడుతోంది. రకరకాల కూరగాయలు పండిస్తూ అందరి చేతా శెభాష్ అనిపించుకుంటోంది.
అసలీ ఇష్టం ఎలా మొదలైంది? వైఘశ్రీ తండ్రి ఓ హోటల్ యజమాని. 2019లో ఆయనకు ఓ ప్రమాదం జరిగింది. ఆ నొప్పి నుంచి నుంచి కోలుకునే క్రమంలో మొక్కలను పెంచడం మేలు చేస్తుందని కొందరు ఆయనకు సలహా ఇచ్చారు. దీంతో ఆయన తన ఇంటి పెరట్లో మొక్కలు పెంచడం ప్రారంభించారు.
ఆ సమయంలో వైఘశ్రీకి ఐదేళ్లు. తండ్రి చేసే శ్రద్ధగా గమనిస్తూ ఉండేది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేవరకు తండ్రికి తోటపనిలో సాయం చేస్తూ గడిపేది. ఆ తర్వాత తండ్రి సాయం లేకుండా తనే అన్నీ స్వయంగా చేయడం ప్రారంభించింది. తన ఆసక్తిని గమనించి తండ్రి ఆమెను మరింత ప్రోత్సహించాడు.
మొక్కలు నాటడం, నీళ్లు నోయడంతోనే వైఘశ్రీ ఆగి΄ోలేదు. మొక్కల సంరక్షణ, విత్తనశుద్ధి, మేలు రకాలు పండించడం, సేంద్రియ ఎరువులు వంటి అంశాలు తెలుసుకునేందుకు అనేక యూట్యూబ్ వీడియోలను చూస్తుంది. ఆ నేలలో ఎలాంటి విత్తనాలు పనిచేస్తాయి, తెగుళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుంటుంది. తమకున్న 8 సెంట్ల స్థలంలో ప్రస్తుతం వైఘశ్రీ అన్ని రకాల కూరగాయలనూ పండిస్తోంది.
వాటిని ఎక్కడా అమ్మదు. ఇంట్లోకి వాడగా మిగిలినవి తోటివారికి, అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేస్తుంది. తన పాఠశాలలో నడిచే మధ్యాహ్న భోజనానికి సైతం కూరగాయలను అందిస్తుంది. వైఘశ్రీ కృషికి గుర్తింపు పంచాయతీ అధికారులు రెండుసార్లు ‘కుట్టి కర్షక’ (చిన్నారి రైతు) పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు.
(చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!)