తేటగుంట పెసరట్టు ఉప్మా తింటే లొట్టలేయాల్సిందే

Tetagunta Pesarattu Upma Special Story In East Godavari - Sakshi

అందాలరాముడు సినిమాలో నాగభూషణం ‘పెసరట్టు కావాలి’ అంటాడు. ‘పెసలు నానాలండీ’ అంటాడు సెక్రటరీ.  అందుకు సమాధానంగా ‘నాను’ అంటాడు  నాగభూషణం. ముళ్లపూడి రాసిన ఈ డైలాగులు అందరినీ బాగా నవ్వించాయి. పెసరట్టుని తెలుగువారు అంత ప్రీతిగా అక్కున చేర్చుకుంటారు.పెసరట్టు తెలుగువారి రుచికి చిరునామా...పెసరట్టును ఒంటరిగా కాకుండా జంటగా తినటం మరో ఆనందం. తేటగుంట పెసరట్టు ఉప్మా అంటే లొట్టలు వేయాల్సిందే. అదే ఈ వారం ఫుడ్‌ ప్రింట్స్‌

అల్పాహారంలో పెసరట్టు ఉప్మా కాంబినేషన్‌ లేనిదే చాలా మందికి రుచించదు. అంతటి ప్రీతికరమైన, పసందైన టిఫిన్‌ అది. తూర్పుగోదావరి జిల్లా తునికి సమీపాన తేటగుంట జంక్షన్‌లో కెనరా బ్యాంకుని ఆనుకుని ఉన్న విజయలక్ష్మీ హోటల్‌లో తయారయ్యే పెసరట్టు ఉప్మా రుచి చూసినవారు, ఇరుగుపొరుగులకు చెప్పకుండా ఉండలేరు. బోడ నాని, విజయలక్ష్మి దంపతులు తయారుచేసే ఈ పెసరట్టు ఉప్మాకు ప్రత్యేక ఆదరణ ఉంది. పెసలు నానబెట్టి రుబ్బడం దగ్గర నుంచి పెసరట్టు కాల్చి అందులోకి అనువైన పచ్చడితో వడ్డించే వరకు ఈ దంపతులు చూపించే శ్రద్ధే ఇంత రుచికి కారణం అంటారు.

తక్కువ ధరకే ఎక్కువ రుచి:
తునికి 13 కిలో మీటర్లు, అన్నవరానికి ఐదు కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన తేటగుంట జంక్షన్‌లో కెనరా బ్యాంకుకు దగ్గరగా, తేటగుంటకు చెందిన బోడ నాని ఈ హోటల్‌ను 2000లో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు పెసలు నానబెట్టి, ఏడు గంటల నుంచి కట్టెల పొయ్యి మీద పెసరట్లు తయారుచేస్తుంటారు.

పెసరట్టు మీద అల్లం తురుము, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగుతో పాటు నూనె లేదా నెయ్యి వేస్తారు. ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉప్మా వేసి ఘుమఘుమలాడే పెసరట్టు అందచేస్తారు. అందులోకి కారం పొడి, అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి, వేరుసెనగ పచ్చడి, కొబ్బరి చట్నీ, దబ్బకాయ చట్నీలలో ఏది కావాలంటే అది వేసి ప్రేమగా అందిస్తారు. 

అన్నీ స్వయంగా: గొల్లప్రోలు నుంచి నెలకొకసారి నేరుగా చేలల్లో నాణ్యమైన పెసలు కొనుగోలు చేస్తున్నారు. పెసరట్టు ఉప్మాను రూ.35లకే అందిస్తున్నారు. స్టార్‌ హోటళ్లలో కంటే ఇక్కడి పెసరట్టు ఉప్మా రుచికరంగా ఉందంటున్నారు ఈ టిఫిన్‌ రుచిచూసినవారు. అడిగినవారి ఎదురుగానే ఎన్ని పెసరట్లైనా కాల్చి అందిస్తున్నారు. పెసలు నానబెట్టడం నుంచి పెసరట్లు వేయడం, సర్వ్‌ చేయడం వరకు అన్నీ స్వయంగా చేస్తున్నారు. రోజుకి సుమారు ఐదు వేలు ఖర్చు చేస్తున్నారు. లాభం వస్తుందనే నమ్మకం ఉండదు.

ఒకరోజు వస్తుంది, ఒక రోజు రాదు, అయినా చేస్తున్నామని, దేవుడి దయ వల్ల ఇంతవరకు నష్టం రాలేదని, నాణ్యత విషయంలో రాజీ పడమని, అందుకే అందరూ వస్తుంటారని.. సంతోషంగా చెబుతారు నాని. ముఖ్యంగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నవాళ్లు, ఆలయ దర్శనం అయ్యాక ఇక్కడకు వచ్చి తింటున్నారు. ముందుగానే ఫోన్‌ చేసి, ఏ సమయానికి వస్తారో చెప్పడం వల్ల వారు ఇబ్బంది పడట్లేదు.. అంటారు నాని.

ఎలా అడిగితే అలా చేస్తాం...
మా తాత సన్యాసిరావుగారు సుమారు అరవై సంవత్సరాల క్రితం తేటగుంట గ్రామంలో టిఫిన్ల వ్యాపారం ప్రారంభించా రు. ఆయన మరణింన కొన్నాళ్లకి నేను హైవే మీద ఈ వ్యాపారం పారరంభించాను. ఇప్పటికి 20 సంవత్సరాలుగా నడుస్తోంది. నేను, మా ఆవిడ, మా అబ్బాయి సాయి.. మేం ముగ్గురమే పనిచేస్తాం. మా దగ్గర పెసరట్టు ఉప్మా బాగా ఫేమస్‌ అయ్యింది. టిఫిన్‌ తినడానికి వచ్చినవారు మూడునాలుగు తింటారు. అందుకే మా వ్యాపారంలో ఉప్మా పెసరట్టుకి ప్రాధాన్యత ఇచ్చాం. నేను ప్రారంభించిన ఐదు సంవత్సరాలకి మా హోటల్‌కి మంచి పేరు వచ్చింది.

ఒకళ్లు తిని పది మందికి చెప్పడం వల్ల మా వ్యాపారం పెరిగింది. ఇప్పుడు మా మీద మాకు  నమ్మకం కలిగింది. ప్రతివాళ్లు తృప్తిగా తిని, డబ్బుల గురించి ఆలోచించకుండా, పది రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్తుంటారు. అదే మాకు సంతోషం. పెసరట్టు కాల్చేటప్పుడు ఒకరు నెయ్యి, ఒకరు బటర్, ఒకరు ఆయిల్, ఒకరు జీడిపప్పు... ఇలా రకరకాలుగా అడుగుతుంటారు. ఉన్నంతలో చేస్తాను, లేదంటే వారు తెచ్చుకుని, అడిగి చేయించుకుంటారు. మా దగ్గర దబ్బకాయ పచ్చడి ప్రత్యేకం. ఇక్కడకు వచ్చినవారు సంతోషంగా ఆనందంగా వెళ్లాలన్నదే మా లక్ష్యం.
–నాని, విజయలక్ష్మి
– లక్కింశెట్టి శ్రీనివాసరావు, 
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం
ఇన్‌పుట్స్, ఫొటోలు:
మేళాసు సూర్యనారాయణ, తుని రూరల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top