
అందమైన అక్షరాలకు.. పొందికైన రూపాన్నిచ్చే కళ కాలిగ్రఫీ.. సిరాకు సృజనాత్మకతను జోడించి అక్షరాలకు ప్రాణం పోసే అరుదైన కళ ఇది.. ఇది కేవలం చేతిరాత మాత్రమే కాదు.. తెలుగువాడి నాడిగా పరిగణించేది.. భావాన్ని, భావోద్వేగాన్ని కలగలిపి అక్షరరూపాన్నిచ్చే అందమైన.. అద్భుతమైన కళ. ఇదే కళను ఒంటబట్టించుకున్నాడు నగరానికి చెందిన నవకాంత్ కరిడే. ఒకటి కాదు.. రెండు కాదు.. తాను ఎంచుకున్న కళలో విశ్వ వేదికలపై సత్తా చాటుతూ.. తెలుగు భాష ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేస్తున్నాడు.
కాలిగ్రఫీ కళ ఒకటుందని కూడా తెలియని వయసు. కానీ అతనికి ఆ కళ స్వతహాగా అబ్బింది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో అతని రాత శైలి మిగతా వారి కంటే భిన్నంగా ఉండేది. అక్షరాకృతుల్లో ఏదో భావోద్వేగం కొట్టొచ్చినట్లు కనిపించేది. దీనిని చూసి తరగతి గదిలో సహచర విద్యార్థులు సైతం తమ పుస్తకాలపై నవకాంత్‌తో పేర్లు రాయించుకునేందుకు పోటీ పడేవారు. ఈ క్రమంలోనే ముంబయికి చెందిన ప్రముఖ కాలీగ్రాఫర్ అచ్యుత్ పలావ్ రాసిన ‘అక్షరాకృతి’ అనే పుస్తకం అతనికి తారసపడింది.
అచ్చం అందులో తన రాత శైలినే పోలిన విషయాలు ఉండడం ఆశ్చర్యపరిచింది. అప్పుడతనికి అర్థమైంది.. తాను రాసేది కాలిగ్రఫీ అని. ఇంకేం.. దీని గురించి లోతుగా తెలుసుకోవాలని ఆ పుస్తకం రాసిన అచ్యుత పలావ్‌ను వెతుక్కుంటూ ముంబయి రైలు ఎక్కాడు. ఎట్టకేలకు ఆయనను కలుసుకోవడమే కాదు.. ఆ కళలో శిక్షణ పొంది మరింత మెరుగులు దిద్దుకున్నాడు. అక్కడి నుంచి ఆ కళనే ఊపిరిగా చేసుకున్నాడు. తెలుగు భాషలో మొట్టమొదటి కాలిగ్రఫీ కళాకారుడిగా నిలిచాడు.
కంప్యూటర్ యుగంలోనూ..
సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కినా.. మనిషి మస్తిష్కపు ఆలోచనల ముందు దిగదుడుపేనని ఆయన కళా నైపుణ్యం చూస్తే అవగతమవుతుంది. కంప్యూటర్ యుగంలో ఎన్ని తెలుగు లిపిలో ఎన్ని శైలి రకాలు ఉన్నా.. ఆయన శైలి వేరు. అందుకే సినిమా వాళ్లు ఏరికోరి నవకాంత్‌తో అక్షరాలను డిజైన్ చేయించుకుంటారు. అలా అనేక సినిమాలకు టైటిల్స్ డిజైన్స్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయి, కేరళ, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన కళను ప్రదర్శించి తెలుగు అక్షరాల వైభవాన్ని చాటారు. అనేక వర్క్‌షాపులను నిర్వహించారు.
కాలిగ్రఫీ కళకు కాదేదీ అనర్హం..
పలువురు ఔత్సాహికుల కోసం.. అక్షరాలతో కూడిన గిఫ్ట్స్ రూపొందించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తన స్వహస్తాలతో కాలిగ్రఫీ చేసిన పాకెట్ నోట్ బుక్స్, బ్యాడ్జ్, కీ చైన్స్, కప్పు, సాసర్.. పలు రకాల వస్తువులపై తెలుగు కీర్తిని ఇనుమడింపజేస్తూ.. తెలుగుకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు.
మాతృభాషాభివృద్ధికి కృషి..
ఈ కళ ద్వారా దేశ, విదేశాల్లో మాతృ భాషకు తగిన గుర్తింపు తీసుకురావడం, ఈ కళను నలుగురికీ పరిచయం చేయడమే నా లక్ష్యం. ఇప్పటికే పలువురు ఈ కళను నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. అయితే పూర్తి ధ్యాస లేకపోవడంతో రాణించలేకపోతున్నారు. ఈ కళను నలుగురికీ పంచి మాతృభాషాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా.
– నవకాంత్, కాలిగ్రఫీ కళాకారుడు
(చదవండి: అద్భుతం అధ్యాపక 'చిత్రం'..!)