
రొయ్యల పాప్‌కార్న్
కావలసినవి: రొయ్యలు– 25 పైనే (మరీ చిన్నవి కాకుండా, నచ్చిన సైజ్ ఎంచుకోవచ్చు. తల, తోక తీసి, శుభ్రం చేసుకోవాలి)
అల్లం–వెల్లుల్లి పేస్ట్– 2 టేబుల్ స్పూన్లు
కారం– ఒక టీ స్పూన్
గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్+ఒక టీ స్పూన్
నిమ్మరసం– ఒక చెక్క
మైదా, జీలకర్ర పొడి– ఒక టేబుల్ స్పూన్ చొప్పున
బ్రెడ్ పౌడర్– పావు కప్పుపైనే
గుడ్డు– 2 (2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు కలుపుకుని పక్కనపెట్టుకోవాలి)
ఉప్పు– తగినంత
నూనె– డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా రొయ్యలు ఒక గిన్నెలో తీసుకుని, అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నిమ్మరసం వేసి, ఆ మిశ్రమం రొయ్యలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక చిన్న బౌల్‌లో బ్రెడ్ పౌడర్, జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కో రొయ్యను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.
ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాంగో కేక్
కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పులు
బేకింగ్ పౌడర్– ఒక టీ స్పూన్
బేకింగ్ సోడా– అర టీ స్పూన్
ఉప్పు– చిటికెడు
గడ్డ పెరుగు– ఒక కప్పు
పంచదార– ముప్పావు కప్పు
పాలు, నూనె– అర కప్పు చొప్పున
వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్
మామిడి పండ్లు– 2 (బాగా పండి, తియ్యగా ఉండాలి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నీళ్లు– కొద్దిగా
నిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్
మీగడ– అర కప్పు
వైట్ చాక్లెట్– 200 గ్రాములు (మార్కెట్‌లో దొరుకుతుంది)
మ్యాంగో ఐస్‌క్రీమ్– పావు కప్పు పైనే
తయారీ: ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని బాగా కలిపి, జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. అనంతరం అందులో నూనె, వెనీలా ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు గోధుమ మిశ్రమాన్ని, పెరుగు మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి, నెయ్యి పూసిన వెడల్పాటి పాత్రలో వేసుకుని, రెండు అంగుళాల మందంలో, సమానంగా ఉండేలా చూసుకోవాలి.
దాన్ని ఓవెన్‌లో పెట్టుకుని, బేక్ చేసుకుని, చల్లారాక, çముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను మిక్సీలో వేసుకుని, వాటిలో నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. ఆ జ్యూస్‌ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీగడను కరిగించి, దానిలో కరిగించిన వైట్ చాక్లెట్‌ను కలపాలి. దానిలో మామిడిపండు గుజ్జు వేసుకుని, క్రీమ్‌లా అయ్యే వరకూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ముక్క తీసుకుని, దానిపై పెరుగు మిశ్రమాన్ని అర అంగుళం మందంలో పూసుకుని, దానిపైన కొద్దిగా ఐస్‌క్రీమ్ పావు అంగుళం మందంలో పరుచుకోవాలి. మరో కేక్ ముక్కను దానిపై పెట్టుకోవాలి. ఇదే మాదిరి అన్ని ముక్కలు పెట్టుకుని.. వాటిపై మరోసారి పెరుగు మిశ్రమం, ఐస్‌క్రీమ్‌తో నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
అసోమీయా తిల్ పిఠా
కావలసినవి: బియ్యం– ఒక కప్పు
బెల్లం తురుము, నల్ల నువ్వులు– అర కప్పు చొప్పున
నీళ్లు, నూనె, ఉప్పు– సరిపడా
తయారీ: ముందుగా బియ్యాన్ని 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి, ఒక గంట పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు నల్ల నువ్వులను దోరగా వేయించి, కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ నువ్వుల మిశ్రమాన్ని బెల్లం తురుములో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యప్పిండిలో సరిపడా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా దోసెల పిండిలా కలుపుకోవాలి. ఆపై పాన్ మీద కొద్దికొద్దిగా నూనె వేడి చేసుకుని, చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. అట్టు కొద్దిగా ఉడుకుతుండగా, మధ్యలో నువ్వులు–బెల్లం మిశ్రమాన్ని ఉంచి నచ్చిన విధంగా రోల్ చేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.