
పిల్లలూ... పనులు పలు రకములు. వాటిలో నీళ్లతో చేసే పనులు వేరు. కారు కడగడం.. మొక్కలకు నీళ్లు పోయడం.. మాప్ పెట్టడం... చేస్తే సరదాగా ఉంటుంది. అవి రావు అనడానికి లేదు. నేర్చుకోవాలంతే. పెద్దయ్యాక ఉపయోగపడతాయి. ఈ సమ్మర్‌లో నీళ్ల పనులు నేర్చుకోండి. అందరూ మెచ్చుకుంటారు.
బకెట్... మగ్... అండ్ వాటర్. ఛలో.... నాన్న కారు కడుగుదాం ఫస్ట్. కింద పార్కింగ్‌లో ఉంటుంది. బకెట్‌లో వాటర్ తీసుకొచ్చి, క్లాత్ ముంచి, కారును తుడుస్తూ ఉంటే దానిమీద దుమ్ముపోయి తళతళ మెరుస్తుంది. ఫోమ్, షాంపూ... ఇవన్నీ నాన్న అప్లై చేస్తే వాటర్ పైప్ తీసుకొని ఫోర్స్‌గా వాష్ చేయడం... జల్లు మన మీద పడుతుంటే పకపకా నవ్వడం... సమ్మర్‌లో ఏం చేశావ్ అని టీచర్ అడిగితే కార్ వాష్ చేశానని చెప్తే ‘వెరీగుడ్’ అంటారు తెలుసా?
మీ బట్టలు ఉతికారా?
మీకు మీ బట్టలు ఉతుక్కోవడం వచ్చా? బట్టలు ఉతుక్కోవడం రాకపోతే లైఫ్‌లో ఇబ్బంది పడతారు. మీకు 12 ఏళ్లు దాటాయంటే మీ బట్టలు మీరు ఉతుక్కునే వయసు వచ్చినట్టే. అమ్మను అడిగితే వాషింగ్ మెషీన్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తుంది. దాని సహాయంతో వాష్ చేసి, బట్టలు పిండి, ఆరవేయాలి. బట్టలు ఉతకడం ఎంత ముఖ్యమో ఆరవేయడం అంతే ముఖ్యం.
గాలికి ఎగిరిపోకుండా, తీగ మీద నుంచి కింద పడిపోకుండా ఆరవేయాలి. వాటికి క్లిప్పులు పెట్టడం రావాలి. ఆరాక తీసుకొచ్చి మడత పెట్టి కప్‌బోర్డ్‌లో పెట్టుకోవాలి. బట్టలు ఉతికి, ఆరేసి, మడిచి పెట్టుకోవడం వస్తే మీరు సెల్ఫ్ డిపెండెంట్ అయినట్టే. చదువుకోవడానికి హాస్టల్‌లో ఉండాల్సి వచ్చినా ఇబ్బంది పడరు. కాబట్టి బట్టలు వుతకడం ఈ సమ్మర్‌లో నేర్చుకోండి.
ఇల్లు తుడిచారా?
ఇంటి ఫ్లోర్‌ను మాప్ పెట్టడం నేర్చుకుంటే మీ అంత గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ ఉండరు. బకెట్‌లో నీళ్లు తెచ్చి, మాప్ స్టిక్ దానిలో ముంచి, నీళ్లు పిండి, నేల మీద రుద్దుతూ మాప్ చేయాలి. అమ్మ, పని మనిషి అలా మాప్ చేయడం మీరు చాలాసార్లు చూశారు. ఈ సమ్మర్‌లో అది మీ వంతు.
ఇంకా ముఖ్యమైన విషయం వాష్‌రూమ్‌లను కడగడం. ఇంట్లో వాష్‌రూమ్‌ను అందరూ వాడతారు. కాని వాటిని కడిగేది మాత్రం అమ్మే. ఈసారి మీరు నాన్నతో కలిసి వాష్‌రూమ్‌లను బాగా కడగండి. క్లీన్‌గా ఉన్న వాష్‌రూమ్‌లను చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. సమ్మర్‌లో వారం వారం వాష్‌రూమ్‌ను కడిగి అమ్మచేత శభాష్ అనిపించుకోండి.
అంట్లు కడగడం
అబ్బ... ఈ పని ఎవరికీ నచ్చదు. నచ్చదని భోజనం చేయడం మానేస్తామా? భోజనం చేస్తే భోజనం కోసం వంట వండితే అంట్లు పడతాయి. భోజనానికి ఎంత వాల్యూ ఇస్తామో అంట్లకు కూడా అంతే వాల్యూ ఇవ్వాలి.
అంట్లు కడగడం అబ్బాయిల పని కాదని కొందరు అంటారు. ఏం కాదు. అందరూ చేయాలి. డిష్ వాషర్‌తో అంట్లు తోమి ట్యాప్ కింద పెట్టి అవి క్లీన్ అవుతుంటే చూడటం బాగుంటుంది. అంట్లు కడగడంలో సాయం చేస్తే అమ్మకు చాలా సాయం చేసినట్టే.
చెట్లకు నీళ్లు పోయడం
ఇది కూడా సరదా పని. ఈ సమ్మర్‌లో రోజూ మొక్కలకు నీళ్లు పోయడం మీ డ్యూటీగా చేసుకోండి. పైప్‌తో పోస్తారో బకెట్‌తో పోస్తారో మీ ఇష్టం. అలాగే తడిబట్టతో కప్‌బోర్డులన్నీ తుడిస్తే చాలా బాగుంటుంది. మురికి మంచిది కాదు. మురికి వదల్చని బద్ధకం మంచిది కాదు. నీటిని వాడి బద్ధకాన్ని శుభ్రం చేసుకోండి. పదండి.
(చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!)