
పిల్లల అందమైన బాల్యాన్ని అక్షరాలుగా చెప్పగలిగిన తల్లులు కొందరు డైరీల్లో దాచి ఉంటారు. మరికొందరు ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసి ఉంటారు. అది కూడా గతకాలపు ఆలోచనే. ఇదేదీ కాదు, పెద్దయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు బాల్యంలో ప్రతిరోజునీ వెనక్కి చూసుకోవాలంటే ఏం చేయాలి?
ఆలోచన ఓ మెట్టు పైన!
ప్రతిరోజూ ఒక ఫొటో తీసిపెట్టుకుంటే సరిపోతుందా? ఏరోజుకారోజు పిల్లలు ఏం చేశారో డైరీలో రాసి ఉంచితే బావుంటుందా? ప్రతి బిడ్డకు– తల్లికీ ఇవన్నీ మధురానుభూతులే. కానీ పని వత్తిడిలో పడి ఏదీ చేయకనే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. పిల్లలు పెద్దయిపోతారు. ఇక ఇలా అప్పుడొకటి అప్పుడొకటి గుర్తు వచ్చినప్పుడు, ఆ సమయంలో తాను చెప్పింది వినడానికి పిల్లలకు సమయం ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది.
మేఘన్ మార్కెల్ మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఆలోచించింది. ‘పిల్లల పెంపకంలో తాను మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. పిల్లలు కూడా తమ బాల్యాన్ని ఆస్వాదించాలి. తమ బాల్యాన్ని ఆస్వాదించడం అంటే వర్తమానంలో కాదు భవిష్యత్తులో ఆస్వాదించాలి. పెద్దయిన తర్వాత తమ బాల్యాన్ని చూసుకుని మురిసిపోవాలి’... అనుకుంది.
మార్కెల్ మెయిల్ చేసింది!
తన పిల్లలు ఐదేళ్ల ఆర్చీ, మూడేళ్ల లిలిబెత్ ల కోసం చెరొక ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసింది. వాళ్లకు రోజూ ఈ మెయిల్ చేస్తుంది మెర్కెల్. ఇంత చిన్న పిల్లలు ఈమెయిల్ చూస్తారా? చూసినా ఏమి తెలుసుకుంటారు? అనే సందేహం వచ్చే మాట నిజమే. మెర్కెల్ ఏం చెబుతోందంటే... ‘‘నా పిల్లలు పెద్దయిన తర్వాత, వాళ్లకు పదహారు, పద్దెనిమిదేళ్లు వచ్చిన తర్వాత వాళ్ల ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తాను. అందులో వాళ్ల బాల్యం ఉంటుంది. తల్లిగా వారికి నేనిచ్చే అద్భుతమైన బహుమతి’’ అంటోందామె.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ రోజు వాళ్లు ఏం చేశారో, వచ్చీరాని మాటలతో ఎంత హాస్యాన్ని సృష్టించారో రాస్తోంది మెర్కెల్. అలాగే రోజుకొక ఫొటో కూడా. పిల్లలను రోజూ ఫొటో తీస్తోంది. ఆ రోజు వాళ్లు చేసిన అల్లరిలో ఆమెకు ముచ్చటగా అనిపించిన ఒక ఫొటోను కూడా మెయిల్ చేస్తోంది. ఇలా తన పిల్లలకు వారి బాల్యాన్ని బహుమతిగా ఇస్తోంది మెగన్ మెర్కెల్.
పేరెంటింగ్ పాఠం
మేఘన్ మార్కెల్ తన పిల్లలకు చేస్తున్న ఈ మెయిల్స్ వారికి భవిష్యత్తులో గొప్ప అనుభూతినిస్తాయి. వారికి గుర్తింపును తెస్తాయని ప్రశంసించారు యూఎస్‌లోని కాన్షియస్ కో పేరెంటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ డోర్సీ పోర్టర్. ఇది భావోద్వేగాలకు మాత్రమే పరిమితమైన విషయం కాదు, చాలా వ్యవస్థీకృతమైన పేరెంటింగ్ రూల్ అన్నారాయన.
మేఘన్ బాటలో మరీ అంత నిడివి ప్లాన్ లేకపోయినప్పటికీ ఆమె సూచిస్తున్న ‘పిల్లల ఏడాది పొడవునా తీసిన ఫొటోల నుంచి మంచి ఫొటోలను ఎంపిక చేసి ప్రతి పుట్టిన రోజుకొక ఆల్బమ్ చేసి ఇవ్వవచ్చు’ అనే ఐడియా కూడా అందంగా ఉంది. ఇంతకీ మేఘన్ మార్కెల్ ఎవరో గుర్తు పట్టారా? ఒకప్పటి నటి, యూఎస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్, మీడియా పర్సన్. ఆమె తనకు తాను సాధించుకున్న గుర్తింపులే ఇవన్నీ.
ప్రపంచానికి ఆమె వెంటనే గుర్తురావాలంటే ప్రిన్స్ హ్యారీని వివాహం చేసుకుని బ్రిటిష్ రాజకుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన మహిళ అని చెప్పాలి. అలాగే ఆమె తన వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టలేక భర్త రాజకుటుంబం నుంచి బయటకు వచ్చి యూఎస్‌లో జీవిస్తున్న సాధికార మహిళ.