Recipes for Life: Sudha Menon Shares Idea of Writing the Book Recipes for Life - Sakshi
Sakshi News home page

Recipes For Life: భిన్న రుచుల భారతం.. మిథాలి రాజ్‌ పీతల కూర.. కదిలించిన ఇర్ఫాన్‌ పఠాన్‌!

Published Tue, May 10 2022 10:50 AM

Sudha Menon: Idea Behind Writing Recipes For Life Celebrities Comments - Sakshi

Sudha Menon- Recipes For Life Book: ‘ఆస్తి దస్తావేజులు ఒక తరం నుంచి ఇంకో తరానికి అందుతాయి... రుచుల దస్తావేజులు ఎందుకు అందవు’ అంటుంది సుధా మీనన్‌. ‘మా నానమ్మ ఫలానా కూర చేసేది’... ‘మా అమ్మమ్మ చేసే వేపుడు రుచే వేరు’ ‘మా అమ్మతో పాటుగా ఆ టేస్టే పోయింది’... లాంటి మాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తాయి. ఎందుకు వీరంతా తమ విలువైన రెసిపీలను రాసి ఇంకో తరానికి అందించరు? అంటుందామె.

తన తల్లి చిన్నప్పుడు తిన్న వంటలతో మొదలెట్టి దేశంలోని ఎందరో సెలబ్రిటీలు తమ బాల్యంలో ఇంట్లో ఇష్టపడి తినే వంటలను తెలుసుకుని పుస్తకంగా రాసింది. విలువైన దస్తావేజుగా మలిచింది. ఆమె చేసిన పని మెచ్చుకోలు పొందుతోంది. దేశంలోని ముప్పై మంది సెలబ్రిటీలు తమ బాల్యంలోకి వెళ్లి, తమ తల్లుల చేతి వంటను తలుచుకుని, వారికి ఇష్టమైన పదార్థపు రెసిపీని పాఠకులతో పంచుకుంటే ఎలా ఉంటుంది?

రచయిత్రి సుధా మీనన్‌ రాసిన ‘రెసిపీస్‌ ఫర్‌ లైఫ్‌’ చదివితే తెలుస్తుంది. నాలుగేళ్ల పాటు ప్రయత్నించి సుధా మీనన్‌ రాసిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్‌ వెలువరిస్తే ప్రఖ్యాత వంటగాడు వికాస్‌ ఖన్నా ముందు మాట రాశాడు. ఈ పుస్తకంలో తమకు నచ్చిన ఇంటి వంటలను పంచుకున్న సెలబ్రిటీలలో మేరీ కోమ్, సుహాసిని, ఆమిర్‌ ఖాన్, విద్యా బాలన్, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు ఉన్నారు.

దేశంలోని అన్ని నైసర్గిక ప్రాంతాలు కవర్‌ అయ్యేలా వేరు వేరు చోట్లకు చెందిన సెలబ్రిటీలను సుధా మీనన్‌ ఎంచుకోవడం వల్ల భిన్న రుచుల భారతదేశాన్ని ఈ పుస్తకంలో దర్శించవచ్చు.

ఈ పుస్తకం ఐడియా ఎలా వచ్చింది?
గతంలో నాలుగు పుస్తకాలు రాసి స్త్రీలను రచనలో ప్రోత్సహించే సంస్థను నడుపుతున్న సుధా మీనన్‌ నాలుగేళ్ల క్రితం లండన్‌లో ఉండగా ఈ ఐడియా వచ్చింది. ‘అప్పుడు మా అమ్మ నాతోనే ఉంది. మా నాన్న పోయిన విషాదంలో ఆమె నోరు విప్పేది కాదు. ఒకరోజు అమ్మా.. చిన్నప్పుడు అమ్మమ్మ ఏం వండేది... ఇంట్లో ఏమేమి తినేవారు అని అడగ్గానే ఆమె కళ్లల్లో మెరుపు వచ్చింది.

వంటల కబుర్లు చెప్పడం మొదలెట్టింది. ఆ సమయంలోనే మా అత్తగారు పోయారు. ఆమె చాలా బాగా వంట చేసేది. ఆమె పోవడంతో ఆమె రెసిపీలన్నీ అంతర్థానం అయ్యాయి. ఇలా ఎంతోమంది అమ్మల, అమ్మమ్మల వంటలు రికార్డు అయ్యి తర్వాతి తరాలకు అందాలనుకుని... సామాన్యుల కంటే కూడా సెలబ్రిటీలను ఎంచుకుంటే పాఠకాసక్తి ఉంటుందని పని మొదలెట్టాను’ అంటుంది సుధా మీనన్‌. ఆమె కొన్ని రోజులు నేరుగా ఇంటర్వ్యూలు చేసి లాక్‌డౌన్‌ కాలంలో ఫోన్‌ ద్వారా మిగిలిన పని పూర్తి చేసింది.

కోపి బూట్‌... చుకన్‌దార్‌ గోష్‌
ఇంటర్వ్యూలో సుధా మీనన్‌ తల్లి ప్రస్తావన తేగానే అందరూ ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆమిర్‌ ఖాన్‌ తన తల్లి చేసే ‘చుకన్‌దార్‌ గోష్‌’ గురించి మాట్లాడితే మేరి కోమ్‌ తన చిన్నప్పుడు ఇంట్లో అమ్మ చేసిన ‘కోపి బూట్‌’ గురించి చెప్పింది. విద్యా బాలన్‌ వాళ్లమ్మ చేసే ‘అడయి’, ‘పోడి’ గురించి చెప్పింది. నటి సుహాసిని తన తల్లి చేసే సాంబార్‌ గురించి మాట్లాడితే మన మిథాలి రాజ్‌ పీతల కూర రుచిని చెప్పి తెలుగు ఘుమఘుమలను యాడ్‌ చేసింది.

కదిలించిన ఇర్ఫాన్‌ పఠాన్‌
ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూల్లో భాగంగా ఇర్ఫాన్‌ పఠాన్‌కు ఫోన్‌ చేసింది. చిన్నప్పుడు మీ అమ్మ చేసిన వంటల్లో మీకేది ఇష్టం అని అడిగింది. దానికి ఒక నిమిషం సమయం తీసుకున్నాడు ఇర్ఫాన్‌. ఆ తర్వాత అన్నాడు– ‘అన్ని వంటలు చేసుకునే డబ్బులు మాకు లేవండి. రోజూ మా అమ్మ కిచిడి, ఆలుగడ్డ కూర చేసేది.

అవే చీప్‌గా వచ్చేవి అంతో ఇంతో కడుపు నింపేవి. మాకు డబ్బులున్న రోజు ధనియాలు కొనేది అమ్మ. అప్పుడు ధనియాల పచ్చడి చేసేది. అదే మాకు పెద్ద లగ్జరీ’ అని చెప్పాడు. ఆ జవాబు సుధా మీనన్‌ను బాగా కదిలించింది.

అందరూ సొంతగా రికార్డు చేయాలి
భారతదేశంలో ప్రతి స్త్రీ, వంట అభిరుచి ఉన్న పురుషుడు తరాలుగా ఎన్నో వంటలను తీర్చిదిద్దారు. ఎలా చేస్తే పాకంలో రుచి వస్తుందో తెలుసుకున్నారు. ఆ జ్ఞానం వారితోనే పోకూడదు. సుధా మీనన్‌లా ప్రతి ఇల్లు ఒక చిన్న నోట్‌బుక్‌తో కొన్ని వంటలనైనా రికార్డు చేసుకుంటే ఆ రుచులు కొనసాగుతాయి. తమ రుచులను కాపాడుకున్నామన్న సంతృప్తిని ఇస్తాయి. ఆ పని చేద్దాం.

చదవండి👉🏾Vitamin B12: విటమిన్‌ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే..
  

Advertisement

తప్పక చదవండి

Advertisement