మా పిల్లల నుంచి నేర్చుకున్నాను..

Success Story Of Limeroad.com Ceo Suchi Mukherjee - Sakshi

సూచీ ముఖర్జీ... లైమ్‌రోడ్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ దిగ్గజం.. గృహిణిగా, సిఈవోగా... రెండు రకాల జీవితాలను బ్యాలెన్స్‌ చేసుకోవటంలో విజయం సాధించారు. సూచీ ఇద్దరు పిల్లలకు తల్లి, ఎంతో మందికి స్నేహితురాలు,
ఇప్పుడు ఔత్సాహిక పారిశ్రామికవేత్త...

‘కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నామంటే మన మీద మనం ఒత్తిడి తెచ్చిపెట్టుకున్నట్లే’ అంటారు సూచీ ముఖర్జీ. ఇంటిని, వ్యాపారాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవటం చాలా కష్టమే అయినప్పటికీ, కుటుంబంతోనే ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలతో ఉదయాన్నే కొద్దిసేపు గడిపి, వాళ్లని స్కూల్‌ దగ్గర దింపి, ఆ తరవాత తన వ్యాపార పనుల్లోకి ప్రవేశిస్తారు సూచీ ముఖర్జీ. ‘‘మంచి జీవిత భాగస్వామి, నన్ను అర్థం చేసుకునే అత్తమామలు దొరకటం నిజంగా నా అదృష్టం. అందుకు నేను వారికి ఋణపడి ఉంటాను’’ అంటారు లైమ్‌రోడ్‌.కామ్‌ వ్యవస్థాపకురాలు, సిఈవో అయిన సూచీ ముఖర్జీ. హర్యానాకు చెందిన సూచీ ముఖర్జీ  2012లో ఈ సంస్థను స్థాపించారు. 40 సంవత్సరాల లోపు వయసున్న, అత్యున్నత స్థాయి కొత్త వ్యాపారవేత్త ల జాబితాలో ఆమె మొదటిస్థానం పొందారు.

‘‘మా అబ్బాయి పుట్టినప్పుడు నేను ఖాళీ సమయంలో ఒక మ్యాగజీన్‌ చదువుతుంటే, నాకు కావలసిన జ్యూయలరీ కనిపించింది. వెంటనే నేను ఒకే ఒక్క క్లిక్‌తో బుక్‌ చేసి తెప్పించుకున్నాను. అప్పుడే నాకు కూడా ఇటువంటి సైట్‌ ఒకటి స్థాపించాలనే ఆలోచన వచ్చింది. లక్కీగా వెంటనే దానిని అమలు చేయ గలిగాను’’ అని చెప్పారామె.

ఫిట్‌నెస్‌ బావుండాలి..
‘‘వ్యాపారంలో రాణించాలంటే ఫిట్‌నెస్‌ చాలా అవసరం. అందుకోసం కొంత సమయం తప్పనిసరిగా కేటాయించాలి... వ్యాపారంలో విజయం సాధిస్తే సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఓటమి సాధించినప్పుడు అధైర్యపడకూడదు. విజయం సాధించేవరకు పోరాడాలి. అందుకు పట్టుదల ఉండాలి. ధైర్యంగా దీక్షతో పనిచేయాలి. ఎంత సంక్షోభంలో ఉన్నప్పటికీ సృజనను విడిచిపెట్టకూడదు’’ అంటారు సూచీ ముఖర్జీ.

మహిళల కోసం...
లైమ్‌రోడ్‌.కామ్‌ మహిళల కోసం ప్రారంభించబడిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌. ‘‘మా లైమ్‌రోడ్‌ స్క్రాప్‌బుక్‌ను ప్రతి నెల సుమారు పది లక్షల మంది చూస్తున్నారు. ఈ సంవత్సరం మా వ్యాపారం 600 శాతం పెరిగింది. వ్యాపారంలో నిరంతరం సృజన ఉండాలి. వ్యాపారం ప్రారంభించే ముందు నేను చేయగలనా లేదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చేయగలనని నా మనసు సమాధానం చెప్పింది. నేను ఒక స్థాయికి ఎదగడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ విలక్షణమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాను’’ అంటున్న సూచీ ముఖర్జీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు.                    
ఈ కామర్స్‌ లైఫ్‌స్టయిల్‌ అండ్‌ యాక్సెసరీస్‌ వెబ్‌సైట్‌ను ఫ్యాషన్‌ మాగజీన్‌ విధానంలో రూపొందించారు. 50 మందితో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 400 మంది ఉన్నారు. సూచీ ముఖర్జీకి ఇద్దరు పిల్లలు అమ్మాయి మైరా, అబ్బాయి అదితి. ఢిల్లీ, సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి ఫైనాన్స్‌ అండ్‌ ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. స్కైప్, ఈబే, గమ్‌ట్రీ వంటి వివిధ సంస్థలలో సుమారు 16 సంవత్సరాలు పనిచేశారు. తాను కలగన్న సంస్థను స్థాపించటం కోసం 2011లో భారతదేశానికి వచ్చి, 2012లో లైమ్‌రోడ్‌.కామ్‌ను స్థాపించారు. 16వ శతాబ్దం నాటి గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డు వల్ల పెద్ద ఎత్తున వ్యాపారం జరిగినట్లే, తాను స్థాపించబోయే సంస్థ కూడా అంత వ్యాపారం చేయాలనుకున్నారు. గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డుని ప్రేరణగా తీసుకుని లైమ్‌రోడ్‌. అని పేరుపెట్టారు.

– సూచీ ముఖర్జీ, సిఈవో, ఫౌండర్, లైమ్‌రోడ్‌.కామ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top