పిల్లలను మంచిగా పెంచడం ఎలా? | Sakshi
Sakshi News home page

పిల్లలను మంచిగా పెంచడం ఎలా? సైకాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే..

Published Mon, Oct 30 2023 8:12 AM

Six Tips From Harvard Psychologists To Raise Good Kids - Sakshi

‘మా పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది సర్‌. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్‌ పట్టుకునే ఉంటారు. వాళ్లతో ఎలా డీల్‌ చేయాలో అర్థం కావడంలేదు.’ ‘మా పాపతో వేగలేకపోతున్నాం సర్‌. మొబైల్‌లో రైమ్స్‌ పెట్టకపోతే అన్నం కూడా తినదు’. ’‘మావాడు టాబ్‌తోనే ఉంటాడు. మనుషులతో అస్సలు మాట్లాడటం లేదు.’ కౌన్సెలింగ్‌ కోసం వచ్చిన చాలామంది తల్లిదండ్రులు ఇలా.. టెక్నాలజీ వల్ల తమ పిల్లలు ఎలా పక్కదారి పడుతున్నారో చెప్పుకుని బాధపడుతుంటారు. మనం డిజిటల్‌ ప్రపంచంలో ఉన్నామనేది కొట్టిపారేయలేని నిజం. వాటి నుంచి పిల్లల దృష్టిని మళ్లించడానికి పేరెంట్స్‌ పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఏమైనా చిట్కాలు దొరుకుతాయేమోనని యూట్యూబ్‌ ఓపెన్‌ చేస్తే.. అలవికాని చిట్కాలు కనిపిస్తాయి. కొందరు వాటిని నమ్మి, ఆచరించి, ఫలితాలు కనిపించక బాధపడుతుంటారు. 

ఈ సమస్యను తప్పించేందుకే ‘మంచి’ పిల్లలను పెంచడం ఎలా? అని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు ఏళ్లుగా అధ్యయనం సాగిస్తున్నారు. ఎంత డిజిటల్‌ యుగంలో ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా పిల్లలను పెంచే ప్రాథమిక అంశాలేమీ మారలేదు. పిల్లలు తమ లక్ష్యాలను సాధించాలని, ఆనందంగా జీవించాలనే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలాంటి పిల్లలను పెంచాలంటే కఠిన శిక్షలు అవసరంలేదనీ, ఖరీదైన కార్పొరేట్‌ స్కూళ్ల అవసరం అంతకన్నా లేదని, జస్ట్‌ ఆరు సూత్రాలను ఆచరిస్తే చాలని చెప్తున్నారు హార్వర్డ్‌ సైకాలజిస్టులు. ఆ ఆరు సూత్రాలేమిటో ఇప్పుడు, ఇక్కడ తెలుసుకుందాం. 

1) మీ పిల్లలతో సమయం గడపండి
ఇది అన్నింటికీ పునాది వంటిది. మీ పిల్లలతో క్రమం తప్పకుండా సమయాన్ని వెచ్చించండి. వారి గురించి, ప్రపంచం గురించి, వారు దానిని ఎలా చూస్తారు అనే విషయాల గురించి ఓపెన్‌–ఎండ్‌ ప్రశ్నలు అడగండి. వారి ప్రతిస్పందనలను చురుకుగా వినండి. దీనిద్వారా మరొక వ్యక్తి పట్ల ఎలా శ్రద్ధ కనబరచాలో వారికి చూపిస్తున్నారు. ఇంకా తనో ప్రత్యేక వ్యక్తి అని, తనదో ప్రత్యేక వ్యక్తిత్వమని గుర్తుచేస్తుంటారు. 

2) ముఖ్యమైన విషయాలను గట్టిగా చెప్పండి 
గట్టిగా మాట్లాడితే పిల్లలు నొచ్చుకుంటారని చాలామంది పేరెంట్స్‌ ముఖ్యమైన విషయాలను కూడా నెమ్మదిగా, సున్నితంగా చెప్తుంటారు. దీంతో పిల్లలు వాటిని ఏమాత్రం పట్టించుకోరు. కాబట్టి ముఖ్యమైన విషయాలను గట్టిగా చెప్పాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, టీమ్‌ వర్క్‌లో ఎలా పార్టిసిపేట్‌ చేస్తున్నారో టీచర్లు, కోచ్‌లను అడిగి తెలుసుకోమంటున్నారు. 

3) ఎలా పరిష్కరించుకోవాలో నేర్పించండి 
ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎవరెవరు ప్రభావితమవుతారో, వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలో మీ పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి. ఉదాహరణకు మీ పిల్లలు ఏదైనా గేమ్‌ లేదా టీమ్‌ యాక్టివిటీ నుంచి తప్పుకోవాలను కుంటే.. వారిపై అరిచి భయపెట్టకుండా, దానివల్ల ఏర్పడే పరిణామాలు వివరించండి. అసలు సమస్య మూలం ఎక్కడుందో గుర్తించి, టీమ్‌ పట్ల కమిట్మెంట్‌తో ఉండమని ప్రోత్సహించండి. 

4) సహాయం చేయడం, కృతజ్ఞతతో ఉండటం నేర్పించండి 
కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే వ్యక్తులు ఉదారంగా, కరుణతో, సహాయకారులుగా, క్షమించే వారుగా ఉంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అలాంటి వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తోబుట్టువులకు సహాయం చేయమని పిల్లలను అడగండి. సహాయం చేసినప్పుడు థాంక్స్‌ చెప్పండి. తద్వారా వాళ్లు కూడా కృతజ్ఞతలు తెలపడం నేర్చుకుంటారు. అలాగే అసాధారణమైన దయను ప్రదర్శించినప్పుడు వారిని మెచ్చుకోండి. 

5) విధ్వంసక భావోద్వేగాలను చెక్‌ చేయండి
పిల్లల్లో కూడా కోపం, అవమానం, అసూయలాంటి నెగెటివ్‌ ఎమోషన్స్‌ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను గుర్తించడం, వాటికి పేరు పెట్టడం, ప్రాసెస్‌ చేయడంలో సహాయం చేయడం, సురక్షితమైన కాన్‌ఫ్లిక్ట్‌ రిజల్యూషన్‌ వైపు మార్గనిర్దేశం చేయడం చాలా అవసరమని తల్లిదండ్రులు గుర్తించాలి. అలాగే పిల్లల భద్రత దృష్ట్యా వారికి స్పష్టమైన, సహేతుకమైన సరిహద్దులను నిర్దేశించడమే కాకుండా, అవి వారికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. 

6) బిగ్‌ పిక్చర్‌ చూపించండి
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా పిల్లల సర్కిల్‌ చాలా చిన్నది. ఆ సర్కిల్లోని వ్యక్తుల పట్లే వారు ప్రేమ, శ్రద్ధ, సానుభూతి చూపిస్తారు. అయితే ఆ సర్కిల్‌ వెలుపల ఉన్న వ్యక్తుల గురించి కూడా వారు శ్రద్ధ వహించేలా చేయడం అవసరం. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని, వారి సమస్యను వారి కోణంలో అర్థం చేసుకోవాలని ప్రోత్సహించడం ద్వారా, టీవీలో వచ్చే అలాంటి సంఘటనలను వివరించడం ద్వారా పిల్లల్లో సహానుభూతిని పెంచాలి. ఈ ఆరు సూత్రాలు పాటిస్తే ఒక శ్రద్ధగల, గౌరవప్రదమైన, నైతికత గల పిల్లలను పెంచడం సాధ్యమేనని, దీనికంటే ముఖ్యమైన పని మరేదీ లేదని హార్వర్డ్‌ సైకాలజిస్టులు చెప్తున్నారు.  
--సైకాలజిస్ట్‌ విశేష్‌

(చదవండి: రైస్‌ వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement