SHE Teams: మేముంటాం అండగా!ధైర్యంగా ముందుకు రండి.. | SHE teams on women safety in Hyderabad | Sakshi
Sakshi News home page

SHE Teams: మేముంటాం అండగా!ధైర్యంగా ముందుకు రండి..

May 29 2025 12:29 PM | Updated on May 29 2025 12:53 PM

SHE teams on women safety in Hyderabad

మహిళా సమాఖ్యలకు ‘షీ’ టీమ్స్‌ భరోసా 

చట్టాలపై అవగాహన  

బంజారాహిల్స్‌: మహిళలు, చిన్నారుల కోసం బీఎన్‌ఎస్‌లో ఓ బలమైన చట్టాలను ఏర్పాటు చేశారని వాటి పట్ల మహిళలకు అవగాహన ఉండాలని షీ టీమ్స్, భరోసా ఏసీపీ ప్రసన్న లక్ష్మి అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌ రోడ్డు నం. 12లోని సీఎంటీసీ భవన్‌లో జూబ్లీహిల్స్‌ సర్కిల్‌–18 పరిధిలోని మహిళా సమాఖ్యలకు షీటీమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వి. శ్రీనివాసరావు, భరోసా సెంటర్‌ అడ్మిన్‌ మేరీతో కలిసి మహిళలు, చిన్నారుల చట్టాలతో పాటు పాష్‌ యాక్ట్, పోక్సో యాక్ట్, వరకట్న వేధింపు చట్టం, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. ఎన్నోసార్లు ఏదైనా ఘటన జరిగినప్పుడు అది ఎవరికి చెప్పాలి.., ఎలా చెప్పాలి, అసలు అది తప్పా కాదా అనే  మహిళలకు అవగాహన ఉండటం లేదని వారు అన్నారు. 

నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, డీసీపీ ఉమెన్‌ సేఫ్టీ లావణ్య సూచనల మేరకు అన్ని నియోజకవర్గాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  క్షేత్రస్థాయిలో మహిళా సమాఖ్యలు, అనుబంధంగా పని చేసే రిసోర్స్‌ పర్సన్లకు ఈ చట్టాల పట్ల అవగాహన ఉండటంతో బాధితులకు న్యాయం చేసేందుకు సరైన మార్గంలో వెళ్తారని వారు సూచించారు. నగరవ్యాప్తంగా 13 మహిళా పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని, షీ టీమ్స్‌ ఉన్నాయని ప్రత్యేకంగా భరోసా సెంటర్‌ కూడా ఉందని వారు తెలిపారు.  

భరోసాతో కౌన్సెలింగ్‌ ...  
ఏదేని క్రైం వల్ల బాధితులయ్యే మహిళలకు భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని అన్నారు. వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు వారికి ఒక్కోసారి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా భరోసా అండగా ఉంటుందని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు బయటికి వెళ్లినప్పుడు వారిని గమనిస్తూ ఉండాలని సూచించారు. పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే పోష్‌ యాక్ట్‌ ప్రకారం వారు శిక్షార్హులు అవుతారని ఈ చట్టం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని అలాగని వాటిని దుర్వినియోగం చేయవద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో తిరిగే మహిళా సమాఖ్యల ప్రతినిధులు బాల్య వివాహాలు ఎక్కడ, ఎవరు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారికి సరైన విద్యతో పాటు కౌన్సెలింగ్‌ అందించేందుకు కృషి చేయాలని సూచించారు.  
 

చిన్నారులను వేధిస్తే...     1090 
షీటీమ్‌     9490616555, 040–27852355

 

మహిళలందరికీ అవగాహన కలిస్తాం 
చాలా మంది మహిళలకు చట్టాలపై అవగాహన లేదు. చట్టాలపై అవగాహన అనేది ఎంతో అవసరం. ఏ సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి.. ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో అనే విషయాలను మహిళలకు వివరిస్తున్నాం. త్వరలోనే నగర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.  
– ప్రసన్న లక్ష్మి, షీటీమ్స్, భరోసా ఏసీపీ

 

క్షేత్ర స్థాయిలో వివరిస్తాం  : పోలీసు అధికారులు చెప్పిన ఎన్నో చట్టాలను మహిళా సమాఖ్యల ప్రతినిధులు తెలుసుకున్నారు. వీటిపై మేం కూడా క్షేత్ర స్థాయిలో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పిస్తాం. మా సర్కిల్‌ పరిధిలో మహిళా సమాఖ్యలతో అనుసంధానమైన 8 వేల మందికిపైగా మహిళలు ఉన్నారు. వారందరికీ చట్టాలపై అవగాహన కల్పిస్తాం.  – ఆషా విరానిక, డీపీవో, సర్కిల్‌ –18
 

 

బస్తీల్లోనూ అవగాహనకల్పిస్తాం.: చట్టాలపై అధికారులు పెట్టిన ఈ సమావేశంతో ఎన్నో విసయాలు తెలుసుకోగలిగాం. బస్తీల్లో చాలా మంది మహిళలు జరిగిన విషయాలను మా వద్దకు వచ్చి చెప్తుంటారు. ఈ చట్టాలను వినియోగించి వారికి న్యాయం జరిగేందుకు సహకరిస్తాం.  - పద్మ, మహిళా సమాఖ్య ప్రతినిధి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement