శిథిలావస్థలో సావిత్రిబాయి పూలే పాఠశాల.. కొత్త కళను తీసుకువచ్చేందుకు

Savitribai Phule: India Firrst Girls School At Bhide Wada, Will Be Redeveloped - Sakshi

జనవరి 3: సావిత్రిబాయి పూలే జయంతి 

Savitribai Phule Birth Anniversary: సావిత్రిబాయి పూలే అంటే పేరు కాదు. ఆత్మగౌరవ పోరాటం. అక్షర ఆయుధం. స్త్రీ విద్య అనేది ఊహకు కూడా రాని కాలంలో, భర్త జ్యోతి బాపూలేతో కలిసి మనదేశంలో తొలి బాలికల పాఠశాల స్థాపించారు. 1848లో పుణె (మహరాష్ట్ర)లో ఏర్పాటైన ఈ పాఠశాల నిమ్నవర్గాల బాలికలకు చదువు నేర్పింది. ‘ఆడపిల్లలకు చదువు వద్దు’ అనే అహంకార ధోరణికి ఉప్పుపాతర వేసింది. ఆ బడి నిర్వాహణ నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. భౌతికదాడులు కూడా జరిగాయి. అయినప్పటికీ ఆడపిల్లలు ముందడుగు వేయడానికి తాము ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. ఎన్నడూ రాజీ పడలేదు. స్త్రీ చైతన్యం కోసం ‘మహిళా మండల్‌’ పేరుతో మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు సావిత్రిబాయి.

ఇక తాజా విషయానికి వస్తే...
చారిత్రక కట్టడంగా భావించే పుణెలోని తొలి బాలికల పాఠశాల శిథిలావస్థలో ఉంది. ఈ పాఠశాలను పునర్‌నిర్మించి కొత్త కళను తీసుకువచ్చే బాధ్యతను తీసుకుంది పుణె మున్సిపాలిటి కార్పోరేషన్‌ (పీఎంసి) ఈ కొత్త సంవత్సరంలోనే నిర్మాణపనులు జరగనున్నాయి. విశేషం ఏమిటంటే, ఆ కాలంలో ఉనికిలో ఉన్న అర్కిటెక్చర్‌తోనే స్కూల్‌ నిర్మించనున్నారు. దీన్ని జాతీయ స్మారక చిహ్నంగా మారుస్తారు. ఏడు అంతస్తులతో నిర్మాణమయ్యే ఈ భవనంలో అయిదు ఫ్లోర్‌లను స్కూల్‌ కోసం కేటాయిస్తారు. బాలికల కోసం అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తారు.
చదవండి: పట్టులాంటి జుట్టుకోసం.. ఇవి కలిపి జుట్టుకి పట్టించండి..

మరోవైపు ఈ భవనాన్ని ‘అడ్వాన్స్‌డ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌’గా తీర్చిదిద్దుతారు. స్కూల్‌ ఏర్పాటు, నిర్వాహణలో ఆనాడు సావిత్రిబాయి, జ్యోతిబాపూలేకు సహకరించిన వారి ఛాయచిత్రాలు  చూడవచ్చు. వారికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. 19, 20 శతాబ్దాలకు సంబంధించిన సామాజిక సంస్కరణల తాలూకు వివరాలు ఇక్కడ అందుబాటులో పెడతారు.

స్థూలంగా చెప్పాలంటే...
పునర్‌నిర్మాణం కానున్న ఈ చారిత్రక కట్టడం, ఒక నగరానికి పరిమితమనుకునే కట్టడం కాదు. కోటానుకోట్లమందిని ముందుకు నడిపించే జీవచైతన్యం. ఆత్మగౌరవ పతాకం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top