Sankranti: పండగ ఆభరణాలు.. షుగర్‌ బాల్‌ జ్యువెలరీ గురించి తెలుసా?!

Sankranti 2023 Special Fashion Trends Sugarball Jewellery - Sakshi

Sugarball Jewellery: జనవరి రాగానే చాలా మంది ఎదురుచూసే పండగ సంక్రాంతి. ఢిల్లీ వాసులు సక్రాత్‌ అని, గుజరాతీయులు ఉత్తరాయణం అని, తమిళనాడులో పొంగల్‌ అని, తెలుగు రాష్ట్రాలలో మకర సంక్రాంతి అనీ అంటారు. పేరు భిన్నంగా ఉండవచ్చు. కానీ వేడుకలో ఉత్సాహం ప్రతి చోటా అధికంగానే ఉంటుంది. అందుకు తగినట్టుగానే మగువలు అలంకరణలోనూ వైవిధ్యం చూపుతుంటారు.

సంక్రాంతి అంటేనే ప్రకృతి పండగ.. పతంగుల సంబరం.. ఈ వేడుకకు మరింత వన్నె తెచ్చేవి సంప్రదాయ దుస్తులు మాత్రమే కాదు.. వాటిని మరింత మెరుపులీనేలా చేసే ఆభరణాలు కూడా! 

షుగర్‌ బాల్‌ జ్యువెలరీ
సంక్రాంతికి సుగర్‌ బాల్స్‌తో చేసిన ఆభరణాలను ధరించడం కొన్ని చోట్ల ఆచారంగా ఉంది. పెళ్లయిన ఏడాదికి నవ వధువుకు చేసే ఈ అలంకరణ మరాఠాలోనూ ఇతర సంప్రదాయాల్లో కనిపిస్తుంది. గసగసాలు లేదా నువ్వులను పంచదార పాకంలో కలుపుతారు.

వీటిని సన్నని మంటమీద మిశ్రమం బాగా చిక్కబడేవరకు కలుపుతూ ఉంటారు. ఈ మిశ్రమంతో పూసల్లాంటి చిన్న చిన్న బాల్స్‌ని తయారుచేస్తారు. ఈ చక్కెర బాల్స్‌ని అందమైన వివిధ రకాల ఆభరణాలుగా రూపుకడతారు. ఇవి వధువు భవిష్యత్తు జీవితాన్ని ఆనందకరంగా మార్చుతాయని వారి నమ్మకం. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా వీటి అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది.

పువ్వుల క్రాంతి
ఆభరణం అంటే బంగారమే కానక్కర్లేదు. భారతదేశ వివాహ వేడుకల్లో మెహిందీ సమయాల్లో ధరించే ప్రత్యేకమైన పుష్ప హారాలు సంక్రాంతినీ సందడిచేస్తున్నాయి. అమ్మాయిల అందాన్ని పువ్వులతో రెట్టింపు చేస్తున్నాయి.

వీటిలో పొడవు హారాలు, చోకర్స్, జూకాలు, గాజులు పువ్వుల అల్లికతో అందంగా అమర్చుకోవచ్చు. ధరించే దుస్తులతోనూ వీటిని మ్యాచ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ పువ్వుల ఆభరణాలు అందుబాటులోకి వచ్చాయి. 

గోటా పట్టీ 
ధరించే దుస్తుల రంగులతో ఫ్యాబ్రిక్, గోటాపట్టీ జ్యువెలరీ కూడా పోటీపడుతుంటాయి. దీంతో ఇవి పండగ కళను మరింత పెంచుతాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top