
చూడగలిగే శక్తి...
సనాతన ధర్మంలో సూర్యోపాసన ప్రముఖంగా చెప్పబడింది. సూర్యుడు మనలోని ప్రతి ఇంద్రియానికీ ప్రాణశక్తిని అందించి నడిపిస్తాడు. ‘సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ.’ సూర్యుడు సకల చరాచర జగత్తుకూ చక్షువు రూపంగా చెప్పబడ్డాడు. ఆదిత్య హృదయం సూర్యుడిని ‘నమస్సవిత్రే జగదేక చక్షుషే’ అంటుంది. జగత్తుకంతటికీ చక్షువైన సవిత్రునికి నమస్సులు. చక్షువు అంటే కన్ను లేదా చూచేది. కన్నులు ఉంటేనే చూడగలం. చక్షువు వస్తు పరిజ్ఞానం యొక్క విశేషాన్ని తెలియచేస్తుంది. దేనిని చూడాలన్నా కనులు ఉండాలి. వాటికి చూడగలిగే శక్తి ఉండాలి. సూర్యమండలంలో ఉన్న పరమాత్మ తేజస్సే మన కంటిలో నిలిచి వస్తువును చూడగలిగిన శక్తిని ప్రసాదిస్తున్నది. దీనినే ‘నయనము’ అని కూడా అంటారు. నయనమంటే తీసుకొని పోయేది అని అర్థం. ఎక్కడికి తీసుకు వెళుతుంది? త్రోవలో ఎదురయ్యే కంటకాల నుండి తప్పించి... మంచి మార్గంవైపు తీసుకొని పోతుంది. కంటి చూపునకు సంబంధించిన విద్య కాబట్టి దీనిని ‘చక్షుష్మతీ విద్య’ అన్నారు.
‘చక్షుష్మతీ విద్యయా తమస్సుమతి’: చక్షుష్మతీ విద్యను తెలుసుకుంటే... తమస్సును అధిగమించగలం. చక్షుష్మతీ దేవిని వర్ణిస్తూ – ఒక చేతిలో బంతిని, మరొక చేతిలో పూవును పట్టుకొని వెండి సింహాసనంపైకూర్చుంటుంది, అని చెపుతారు. వెండి సింహాసనం మన కంటి చుట్టూ ఉండే తెల్లని వలయం, నల్లగుడ్డు మధ్యలో ఉండే తెల్లని బిందుస్థానానికి ప్రతీక. అక్కడే సూక్ష్మరూపంలో చక్షుష్మతీ దేవి ఉంటుంది. పూవు వికసనకు ప్రతీక... ముడుచుకు పోతే దేనినీ చూడలేం. వికసన ఉంటేనే చూడగలుగుతాం. అలాగే బంతి అనేది భ్రమణానికి ప్రతీక. కనుగుడ్లు తిరిగితేనే దేనినైనా చూడగలం. ఆదిత్యునిలోని చక్షుష్మతి అనే శక్తి కనులలో ఉన్నప్పుడే మనమేదైనా చూడగలుగుతాం. చూడగలిగే శక్తి లేనప్పుడు ఆపదల వలయంలో చిక్కుకుంటాం. అందుకే చక్షుష్మతీ అనుగ్రహానికై ప్రార్థించాలి.
– పాలకుర్తి రామమూర్తి