పిల్లల కథ: జానకమ్మ తెలివి

Sakshi Funday Special Story In Telugu

రామాపురం అనే గ్రామంలో రామదాసు అనే పిసినారి ఉండేవాడు. అతనికి ఒక పాత పెంకుటిల్లు  ఉండేది. ఆ గ్రామంలో అతను మిక్కిలి ధనవంతుడైనా పిసినారితనంతో ఇల్లు కట్టలేదు. అతని భార్య జానకమ్మ ఉత్తమ ఇల్లాలు. ఆ గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా  దొంగ మాత్రం దొరకలేదు. రామదాసుకు అత్యవసరంగా దూరంగా ఉన్న పట్టణానికి పోవలసి వచ్చింది. అతడు తన  భార్యతో ‘మన ఇంటికి దొంగరాడు. మన ఇల్లే పాడుబడిన కొంప. దీన్ని చూసిన ఏ దొంగ కూడా మన ఇంట్లో దొంగతనం చేయడానికి ముందుకు రాడు.

అయినా నీ జాగ్రత్తలో నీవు  ఉండు’ అని చెప్పి పట్టణానికి వెళ్ళాడు. అతని ఊహకు భిన్నంగా మరునాడే ఆ దొంగ రామదాసు ఇంటిలోనికి ప్రవేశించాడు. జానకమ్మ చాలా ధైర్యం గలది..  ఉపాయశాలి కూడా. అందువల్ల ఆమె ఆ దొంగకు వణికి  భయపడినట్లు నటిస్తూ ‘బాబ్బాబూ! నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళు. అంతే కానీ నన్ను మాత్రం ఏమీ చేయకు. నీకు పుణ్యం ఉంటుంది’ అని బతిమిలాడింది. దొంగ ఏమీ మాట్లాడకుండా చీరలు, నగలు  సర్దుకోసాగాడు. అప్పుడు జానకమ్మ ‘దొంగన్నా! మా వారు చాలా పిసినారి.  నీవు ఈ ఊర్లో ఎవరినైనా అడిగి ఆయన గురించి  తెలుసుకో! ఆయన నాకు చేయించి  ఇచ్చినవి  ఈ రెండే రెండు బంగారు చిన్ని నగలు, ఈ కొద్ది చీరలు. అవి కూడా నీవు తీసుకొని వెళ్లితే ఆయన నాకు మళ్ళీ నగలు చేయించడు. చీరలను కొనివ్వడు. నీ సోదరిగా భావించి ఈ నగలు, చీరలను వదిలిపెట్టు’ అని అంది. 

అప్పుడు దొంగ ‘అలాగా! అవి వదలిపెడతాను సరే! కానీ మీ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉందో చెప్పు’ అని గద్దించాడు. ‘మేము చాలా పేదవారం నాయనా! మా పేదరికం గురించి మా ఇల్లే నీకు చెబుతుంది. నీవు అడిగావు కనుక చెబుతున్నాను. మావారి బీరువాలో కొంత నగదు  ఉంది. నీవు తీసుకొని వెళ్ళు’  అని అంది. ఆ మాటలకు దొంగ సంతోషించి ఆ నగదును తీసుకొని ఆ నగలు, చీరలు అక్కడే వదిలిపెట్టి  పరుగుతీశాడు. ఆ తర్వాత ఇరుగు పొరుగువారు వచ్చి రామదాసు ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకొని అతడు ఊళ్లో  లేనందుకు విచారం వ్యక్తం చేశారు. మరునాడు పట్టణం నుండి వచ్చిన రామదాసు భార్యతో  ‘మన ఇంట్లో దొంగలు పడ్డారని ఊరంతా చెప్పుకుంటున్నారు. నిజమేనా! నేను నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా!’  అన్నాడు.

జానకమ్మ ఏమీ  మాట్లాడలేదు. రామదాసు కంగారుగా ‘ఏం మాట్లాడవ్‌?  ఏమేమి  పోయాయో  చెప్పు’ అంటూ గొంతు పెంచాడు. ‘నా నగలు, చీరలు పోలేదండి. నా మాటలకు కరిగిపోయిన దొంగ  వాటిని ఇక్కడే  వదిలి పెట్టి వెళ్ళాడు’  అని అంది జానకమ్మ సంతోషంతో. రామదాసు వెంటనే  ‘నీ చీరలు, నగలు కూడా నా బీరువాలోనే ఉన్నాయి కదా! అందులోని నా నగదు  పోయిందా ఏమిటి? నా ఖర్మ!’ అంటూ కంగారు పడ్డాడు రామదాసు. అప్పుడు ఆమె ‘పోయిందండి’ అంది విచారంగా. ‘అయ్యో! పది లక్షల నగదు.. ఎంత పనైపోయింది! వాటిని కాపాడితే నీకు రెండు బంగారు గొలుసులు చేయిద్దామనుకున్నాను. కానీ  నీవు చాలా దురదృష్టవంతురాలివి. నీకు ఆ యోగం లేదు’ అంటూ బాధపడ్డాడు. అప్పుడు ఆమె‘ మీరేనా ఈ మాటలంటున్నది. అలాగైతే నాకు నగలు, చీరలు  మీరు బాకీ ఉన్నట్లే’ అని అంది.  ‘తమాషా చెయ్యకు. నగదు సంచీ పోయి నేను ఏడుస్తుంటే’ అన్నాడు రామదాసు. ‘అవునండీ.. మీ సంచి దొంగ ఎత్తుకొని పోయాడు’  అంది జానకమ్మ.

‘నా సంచీ ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నగదు ఎక్కడ ఉంటుంది? నీ చీరలు, నగల కోసం నాకు అబద్ధం చెబుతావా’ అంటూ కసురుకున్నాడు. ‘అబద్ధాలు చెప్పడం లేదండీ! మీ సంచీని ఆ దొంగనే ఎత్తుకుపోయాడు.  అందులో అన్నీ పదిరూపాయల నోట్లే ఉన్నాయి.అంతా కలిసి ఒక వెయ్యి రూపాయల కన్నా మించవు.  ముందుగానే జాగ్రత్తగా మీ  సంచీలో నుండి యాభై, వంద, ఐదు వందలు, రెండువేల నోట్లను తీసి నా సంచీలో పెట్టి  నా దిండు కింద  దాచిపెట్టానండీ. ఒకవేళ మనింటికి ఆ దొంగోడు వచ్చినా  కేవలం పది రూపాయల నోట్లు మాత్రమే ఎత్తుకొని పోతాడు అని. నా ఊహే  నిజమైంది. మీ లక్షల నగదు భద్రంగా ఉంది. వాడికి  మీ సంచీని చూపించాను. పిచ్చివాడు.. ఆ పది రూపాయల నోట్లే గొప్ప నగదు అనుకొని, నా చీరలు, నగలు వదిలేసి వెళ్లాడు’ అని చెప్పింది.  ఆపద సమయంలో భార్య ప్రదర్శించిన ధైర్యం, తెలివికి అబ్బురపడ్డాడు రామదాసు. అప్పటి నుండి తన పిసినారి తనాన్ని వీడి.. భార్య చెప్పినట్టు వింటూ పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top