సాగుబడి: ఎత్తు మడులపై సేంద్రియ వంగ.. మండే ఎండల్లోనూ నో బెంగ! | Sagubadi Amazing Results With Rice Husk Biochar And Weed Mats | Sakshi
Sakshi News home page

సాగుబడి: ఎత్తు మడులపై సేంద్రియ వంగ.. మండే ఎండల్లోనూ నో బెంగ!

Jun 9 2026 7:47 AM | Updated on Jun 9 2026 7:47 AM

Sagubadi Amazing Results With Rice Husk Biochar And Weed Mats

సాగుబడి..

మండుటెండల్లోనూ లాభదాయకంగా సేంద్రియ సాగు

5 ఏళ్లు చెక్కుచెదరని పర్మినెంట్‌ బెడ్స్‌పై

ఎకరానికి ఏడాదిలో 48 టన్నుల వంకాయల దిగుబడి

వరి పొట్టు బయోచార్, వీడ్‌ మ్యాట్‌తో అద్భుత ఫలితాలు

కరువొచ్చినా, భారీ వర్షాలొచ్చినా సరే రైతుకు గట్టి ఆదాయ భద్రత

దీర్ఘకాలం దిగుబడినిచ్చే కూరగాయ పంటల సాగు ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది కరువు బారిన పడే ముప్పు పొంచి ఉందా? ఏడాది పొడవునా కూరగాయ తోటలను ఎల్‌నినో కరువు నుంచి రక్షించుకుంటూ అధిక దిగుబడిని పొందటానికి ప్రత్యేక లేక సేంద్రియ సాగు వ్యూహాలేమైనా ఉన్నాయా? ముమ్మాటికీ ఉన్నాయంటున్నారు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణులు శివశంకర్‌ షిండే! 47 డిగ్రీల సెల్సియస్‌ ఎండను, నీటి ఎద్దడిని దీటుగా తట్టుకునే వినూత్న సేంద్రియ సాగు పద్ధతిని తమ ‘న్యూలైఫ్‌ ఫౌండేషన్‌’ ప్రదర్శనా క్షేత్రంలో ఆవిష్కరించటం విశేషం. కరువొచ్చినా, భారీ వర్షాలొచ్చినా సరే భద్రత చేకూర్చే సంగతులతో ప్రత్యేక కథనం.

నేల బాగా తడిచిన తర్వాతే..
రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాత వారం వ్యవధిలో తగినంత వర్షం పడిందని నిర్ధారించుకున్న తర్వాతే వర్షాధార పంటలు విత్తుకోవాలని, ఒకటీ అరా వర్షాలు పడగానే తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. తగినంత వర్షం అంటే?.. తేలికపాటి, ఎర్ర నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు, నల్లరేగడి నేలల్లో 60 నుంచి 75 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత లేదా 15–20 సెం.మీ. (6 నుంచి 8 అంగుళాల) లోతు నేల తడిచిన తర్వాతే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం తదితర పంటలను విత్తుకోవాలి. వరి సాగు చేయదలచిన రైతులు జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర, ఉలవ వంటి పచ్చిరొట్ట పైరులు విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవటానికి ఇది అనువైన సమయం.


సేంద్రియ సేద్యంపై 9 నెలల ‘అక్షయకల్ప’ శిక్షణ
వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ‘అక్షయకల్ప–రెయిన్‌ మ్యాటర్‌ ఫెలోషిప్‌’ కార్యక్రమం త్వరలోప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, బయోగ్యాస్‌ ఉత్పత్తి, బయోడైజెస్టర్‌ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్‌ శిక్షణ, తరువాత 6 నెలలుప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకారవేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకుప్రాధాన్యం 
ఉంటుంది. వివరాలకు.. 70222 77155.

శాశ్వత మడుల నిర్మాణం
ఈ సాగు పద్ధతిలో ఐదేళ్ల వరకు చెక్కుచెదరని శాశ్వత ఎత్తుమడులను (పర్మినెంట్‌ రెయిజ్డ్‌ బెడ్స్‌) ఒక అడుగు ఎత్తు, మూడు అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు.

  • భూమి తయారీ: మొదటి ఏడాది మాత్రమే దుక్కి అవసరం అవుతుంది.

  • బయోచార్‌ వినియోగం: ఎకరానికి 5 టన్నుల వరి పొట్టు బొగ్గును (బయోచార్‌) మట్టిలో కలుపుతారు. ఇది మట్టి కన్నా 4 రెట్లు ఎక్కువగా నీటిని పట్టి ఉంచుతుంది.

  • వీడ్‌ మ్యాట్‌: మడులపై డ్రిప్‌ లైన్లు పరిచి, నాలుగు అడుగుల నలుపు వీడ్‌ మ్యాట్‌ కప్పుతారు. ఇది వర్షపు నీటిని లోపలికి పంపిస్తూ, కలుపును పూర్తిగా నివారిస్తుంది.

  • మొక్కలు నాటడం: ఈ మడులపై ఎకరానికి 2 వేల అంటుకట్టిన పర్పుల్‌ లాంగ్‌ వంగ మొక్కలను నాటుతారు.


ద్రవరూప ఎరువులతో సమతుల్య పోషణ
పంటకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే అందిస్తారు.

  • బయోడైజెస్టర్‌: ఎకరానికి ఏడాదికి 3 టన్నుల మాగిన పశువుల లేదా కోళ్ల ఎరువును బయోడైజెస్టర్లో వేసి 24 గంటల్లో పోషక ద్రవాన్ని తయారుచేస్తారు. దీనిని డ్రిప్, పిచికారీ ద్వారా వారానికి రెండు సార్లు ఇస్తారు.

  • ద్రావణాలు: వేపాకులు, వయ్యారిభామ, తలంబ్రాల ఆకులను పది రోజులు నిల్వ చేసి ఆ రసాన్ని అందించడం ద్వారా సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమిస్తున్నారు. 
        కొనుగోలు చేసిన సేంద్రియ పురుగుమందును అడపాదడపా వాడుతూ చీడపీడలను సమర్థవంతంగా అరికడుతున్నారు.

రసాయన సాగు – సేంద్రియ సాగు పోలిక
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లిలో వడ్ల ఆనందాచారి రసాయనిక సేద్యంలో తెల్లవంగను పండిస్తున్నారు. రసాయన సాగుతో పోలిస్తే శివశంకర్‌ అనుసరిస్తున్న శాశ్వత మడులపై సేంద్రియ సాగులో పెట్టుబడి తొలి ఏడాది ఎక్కువగా ఉన్నప్పటికీ, దిగుబడి నాలుగింతలు వస్తుంది. ఐదేళ్ల పాటు మడుల నిర్మాణ ఖర్చు ఉండదు కాబట్టి, తర్వాతి సంవత్సరాలలో పెట్టుబడి తగ్గి నికర లాభం బాగా పెరుగుతుంది. వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే ఈ విధానం రైతులకు ఆర్థిక భద్రతను చేకూరుస్తుంది. సాధారణ వంగ రకాల పంటకాలం 6–8 నెలలు మాత్రమే కాగా, అంటుకట్టిన వంగ తోట 12 నుంచి 18 నెలల పాటు (కొన్నిసార్లు రెండేళ్లు) దిగుబడినిస్తుంది.

పర్మినెంట్‌ బెడ్సే పంటకు పునాది!
వరి పొట్టు బొగ్గుతో కూడిన పర్మినెంట్‌ బెడ్సే పంటకు పునాది. మట్టి కన్నా 4 రెట్లు ఎక్కువగా నీటిని పట్టి ఉంచే శక్తి దీనికి ఉంది. అందువల్లే, రోహిణీ కార్తెలోనూ రెండు రోజులకోసారి డ్రిప్‌ నీరిచ్చినా వంగ తోట చూస్తున్నారుగా ఎలా ఉందో? వీడ్‌ మ్యాట్‌ లోపలికి వర్షం దిగుతుంది. మట్టికి గాలి ఆడుతుంది. కానీ, కలుపు అసలు పెరగదు. ఒకసారి వేస్తే ఐదేళ్ల వరకు చెక్కుచెదరదు. ఒక పంట అయిపోయాక మరో పంట.. బెడ్స్‌పై మొక్కలు నాటుకోవటమే. ఏళ్ల తరబడి నిలిచే శాశ్వత బెడ్స్‌పై విజ్ఞతతో చేసే సేంద్రియ సేద్యం ఇది. సమతుల్య పోషణపై అవగాహన, క్రమం తప్పని ఆచరణే కీలకం.


– శివశంకర్‌ షిండే (81210 08002), సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, బుచ్చిగూడెం, ఫరూక్‌నగర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా

నిర్వహణ: పంతంగి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement