Russia-Ukraine war: బలపడుతున్న శక్తి

Russia-Ukraine war: Women are fighting a different kind of war - Sakshi

‘మహిళ మగవారికన్నా బలహీనమైనది. ఆమె మనసు బహు సున్నితం. రకరకాల భావోద్వేగాలలో ఆమె స్థిరంగా ఉండలేదు...’ ఇలాంటి స్టేట్‌మెంట్లను ఏళ్లుగా వింటున్నాం. ఇప్పుడు స్త్రీ తనేం తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. శక్తిని పుంజుకుంటోంది. ఆ శక్తి ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో నుంచి పుట్టుకొచ్చింది.

సమస్య వచ్చినప్పుడే సమర్థత స్థాయి ఏంటో అర్థమవుతుంది. దీనికి సరైన అర్థంలా ప్రపంచానికి కొత్తగా పరిచయం అవుతోంది ఉక్రెయిన్‌ మహిళ. మందుపాతర నిర్మూలనలో శిక్షణ పొందుతున్న మహిళల సంఖ్య అక్కడ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నేళ్లక్రితం వరకు ఈ రంగంలో మహిళలకు అవకాశాలు ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం వెనకంజ వేసింది. కానీ, యుద్ధం తర్వాత మహిళల్లో వచ్చిన మార్పులతో స్త్రీ శక్తి బలపడుతోంది.

ఎలా పుట్టిందంటే..
భయం లేకుండా ముందుకు వచ్చే మహిళలకు రెండేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చి, ప్రేరణగా నిలుస్తోంది హన్నా అనే 34 ఏళ్ల మహిళ. దీంతో ఇక మహిళలు చేయలేరు అనుకున్న మరో 450 రకాల ఉద్యోగాలలో నిషేధాన్ని తొలగించి అక్కడి ప్రభుత్వం మహిళలకు ఆహ్వానం పలికింది. భయం నుంచి భరోసా వైపుగా కదులుతున్న మహిళ మార్గం మరింతగా శక్తిమంతం అవుతోంది.

ఉత్తర ఉక్రేనియన్‌లోని చెర్నిహివ్‌ను చూస్తే చాలు ఐదు నెలల క్రితం జరిగిన యుద్ధం చేసిన నాశనం ఎలా ఉంటుందో చూడచ్చు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు, దెబ్బతిన్న పెద్ద పెద్ద బిల్డింగులతో రోడ్లు మూసుకుపోయి ఉంటాయి. ‘ఇక్కడ పేలని మందుపాతరలు ఉన్నాయి’ అని సూచించే బోర్డ్‌ ఉన్నచోట ‘మందుపాతరల వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా గుర్తించాలో, దూరంగా ఎలా ఉండాలో’ హన్నా తన చుట్టూ ఉన్న వారికి వివరిస్తుంటుంది. మందుపాతర నిర్మూలనలో శిక్షణ పొందుతున్న మహిళలకు ఆమె ప్రేరణగా నిలుస్తోంది. హన్నా రెండేళ్ల క్రితం మందుపాతరలను తొలగించే ఫౌండేషన్‌లో చేరింది. కిందటి ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగినప్పుడు ఆమె నార్త్‌ ఉక్రెయిన్‌వైపుగా వెళ్లింది. యుద్ధ నాశనం తర్వాత మందుపాతరల నుండి నగరాలను, పట్టణాలను సురక్షితంగా మార్చడానికి చెర్నిహివ్‌ పనిచేస్తోంది.

ఏం చేస్తోందంటే...
తూర్పు ఉక్రెయిన్‌లో 2014 జరిగిన అలజడుల కారణంగా మహిళలు అధిక సంఖ్యలో కొత్త పాత్రలను పోషించడంతో రక్షణ, భద్రతా రంగాలలో మార్పులు వేగవంతం అవడం కొంతకాలంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు స్త్రీలు సమాజంలో పోరాట పాత్రల నుండి నిషేధించబడ్డారు. ఇప్పటికీ పురుషులతో సమానమైన హోదా, ప్రయోజనాలు, గుర్తింపు లేకుండా పోరాటంలో పాల్గొంటూనే ఉన్నారు.

ఎంతోకాలంగా ఉన్న మూస పద్ధతులను ఎదుర్కొనేందుకు యుద్ధంలో ఒక శక్తిగా మారారు అక్కడి మహిళలు. పురుషులు ఇప్పటికే సైన్యంలో మెజారిటీ సంఖ్యలో యోధులుగా ఉండటంతో, మహిళలు తమ కుటుంబాలు చూసుకోవడంతోపాటు వ్యాపారాలను నడుపుతున్నారు. దీంతో అన్ని రంగాల్లో మహిళ స్థానం మరింతగా శక్తిని పుంజుకుంటోందని స్పష్టం అవుతుంది. ఉక్రేయిన్‌ సామాజిక శాస్త్రవేత్త అన్నా క్విట్‌ మాట్లాడుతూ –‘సాధారణంగా మహిళలలో అవగాహన పితృస్వామ్యంగా ఉంటుంది. ఈ యేడాది పెరిగిన యుద్ధంతో ఎదుర్కోవడానికి మహిళల భాగస్వామ్యం పెరిగింది’ అని వివరించడం చూస్తుంటే సమస్య మహిళను సమర్థవంతంగా ప్రపంచానికి చూపడానికే అనేది స్పష్టం అవుతోంది.

ప్రపంచం చూపు తనవైపు
నిజానికి సైన్యం, యుద్ధం మహిళల స్థలం కాదు. ఇది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న మాటే. కానీ, నేడు అన్నిదేశాలలో మహిళలకు సాయుధ దళాలలో పురుషులతో సమానమైన చట్టపరమైన హోదా ఇచ్చింది. ఈ మార్పు మరిన్ని కొత్త మార్పులకు, అవకాశాలకు మార్గం విస్తృతం చేసింది. ఫలితంగా ఉక్రెయిన్‌లో మహిళలకు నిషేధంలో ఉన్న రంగాలను గుర్తించి, అక్కడి చట్టాలను పక్కన పెట్టి 450 రక్షణ, భద్రతాపరమైన వృత్తులలో దేనిలోనైనా మహిళలు చేరచ్చు అని ఆహ్వానం పలికింది. వీటిలో మందుపాతర తొలగింపుతో పాటు ట్రెక్కింగ్, వెల్డింగ్, అగ్నిమాపక, భద్రత, రక్షణ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఉక్రెయిన్‌ దేశ సాయుధ దళాలలో 50,000 మందికి పైగా మహిళలు ఉన్నారని, యుద్ధం మొదలైననాటి నుంచి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంద’ని అక్కడి రక్షణ శాఖ వెల్లడించింది.

అయినప్పటికీ కీలక నిర్ణయాధికారులు, మెజారిటీ యోధులు పెరుగుతున్న మహిళల సంఖ్య స్పçష్టంగా చెప్పడం లేదనేది నిపుణులు చెబుతున్న మాట. నిజానికి మహిళలు తమకు ఏ మాత్రం గుర్తింపులేకున్నా కీలకమైన పనులు చాలా చేస్తారు. రకరకాల సంఘర్షణల్లో ఉన్న సమాజాలను నిలబెట్టే అన్ని విషయాల్లోనూ స్త్రీలు తమ సమర్థతను చూపుతారని ఉక్రెయిన్‌ మహిళ యుద్ధరంగాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుండటం స్పష్టం చేస్తోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top