ఆ స్నేహపాశం తెగిపోలేదు..

Ramnaresh Dubey Pays Tribute To Friend Syed Wahid Ali Madhya Pradesh - Sakshi

కులం, మతం అనేవి  ఉంటాయని కొంచెం వయసు వచ్చాక తెలుస్తుంది. ‘మీరేవిట్లు’ అని ఎవరో అడుగుతారు. ఇంటికొచ్చి అమ్మను అడుగుతాం ‘అమ్మా.. మీరేవిట్లు అంటే ఏంటి?!’ అని. కొన్నాళ్లు ఆ కన్ఫ్యూజన్‌ వేధిస్తుంటుంది. అందరూ ఒకేలా ఉండకుండా ఏంటిది! అని. బెస్ట్‌ ఫ్రెండ్‌ రహీమ్‌ గాడు మసీదుకు వెళతాడని తెలిసినా.. ఎందుకు వాళ్లింట్లో వాళ్లు గుడికి రారు అనే సందేహం అప్పటి వరకు కేశవ్‌ కి వచ్చి ఉండదు. వాళ్లింటికి మసీదు దగ్గర కాబట్టి వాళ్లంతా అక్కడికి వెళ్తుంటారు అనుకుంటాడు. రహీమ్‌కీ ఇవేమీ తెలియవు. కేశవ్‌ గాడితో అప్పటికే అనేకసార్లు గుడికి కూడా వెళ్లి, చేతిలో కేశవ్‌ వాళ్ల అమ్మ పెట్టిన కొబ్బరి ముక్కను తనూ కళ్లకు అద్దుకుని తినే ఉంటాడు. పెద్దయ్యాక ఇవేవీ ఉండవు. లేకుండా చేస్తాయి సంప్రదాయాలు, ఆచారాలు. రహీమ్, కేశవ్‌ ఎప్పటికీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ గానే ఉంటారు. కేశవ్‌కి ఐ.ఐ.టి లో సీటు రావాలని రహీమ్‌ అల్లాను ప్రార్ధిస్తాడు.

రహీమ్‌కి వీసా రావాలని కేశవ్‌ వేంకటేశ్వరుడిని వేడుకుంటాడు. మనిషి ఉన్నంతకాలం ఈ స్నేహం ఉంటుంది. ‘పెట్టె’ ను మోయడానికి కేశవ్, ‘కట్టె’ ను మోయడానికి రహీమ్‌ భుజం ఇస్తూనే ఉంటారు. రామ్‌ నరేష్‌ దూబే, సయ్యద్‌ వాహిద్‌ అలీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. స్కూల్‌ మేట్స్‌. కాలేజ్‌ మేట్స్‌. మధ్యప్రదేశ్, సాగర్‌ జిల్లాలోని చతుర్భట గ్రామం వాళ్లది. అలీ లాయర్‌ అయ్యాడు. దూబే పురోహితుడు అయ్యాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో అలీ చనిపోయినప్పుడు దూబే తన వృత్తిబాట్లను తెంచుకుని మరీ వెళ్లి అలీతో మరుభూమి వరకు నడిచాడు. ఆ స్నేహపాశం తెగిపోలేదు. ఇప్పుడివి ఆలయాలలో పూజలు జరిపించి పితృదేవతలకు తర్పణం వదిలే రోజులు. ఏటా పక్షం రోజులు ఉంటాయి. ఈ ఏడాది.. పితృదేవతలతో పాటు తన మిత్రుడికీ తర్పణం వదిలాడు దూబే!! దేవతలారా దీవించండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top