సీతాకోక చిలుకలకు వేసవి పాఠాలు | Psychologist P Jyothiraja about after tenth class children | Sakshi
Sakshi News home page

సీతాకోక చిలుకలకు వేసవి పాఠాలు

Apr 9 2025 2:04 AM | Updated on Apr 9 2025 2:04 AM

Psychologist P Jyothiraja about after tenth class children

’ ఆఫ్టర్‌ టెన్త్‌ క్లాస్‌

టెన్త్‌ క్లాస్‌ పూర్తయ్యి కాలేజీలోకి అడుగుపెట్టబోయే పిల్లల మానసిక స్థితి అప్పుడే కొత్తగా రెక్కలు వచ్చిన సీతాకోక చిలుకల్లా ఉంటుంది. కాలేజీ చదువులతో మరో ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడుతున్న పిల్లలకు ఈ వేసవి సమయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికీ ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలేలా ఏం ఇవ్వాలి..? ఎలా ఇవ్వాలి.. ?! విలువైన కానుకలు మన వద్దనే ఉన్నాయి... 

చదువులు, ఒత్తిడుల నుంచి ఒక్కసారిగా రిలాక్స్‌ అయిన అనుభూతి. ‘ఈ విశ్రాంతి సమయాన్ని నాణ్యంగా, భవిష్యత్తుకు ఉపయోగపడేలా మార్చుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది..’ అని వివరించారు లైఫ్‌స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్‌ పి.జ్యోతిరాజ. మళ్లీ కాలేజీలు తెరిచేవరకు రెండు నెలల సమయం అయినా ఉంటుంది. దానిని సరిగ్గా ఉపయోగిస్తే పిల్లల భవిష్యత్తుకు మేలైన ఎన్నో విషయాలను పెద్దలు పంచవచ్చు అంటున్నారు.

ఇప్పటివరకు అదే స్కూల్, అదే టీచర్లు, ఇల్లు.. పిల్లలు ఓ సౌకర్యవంతమైన జీవనంలో ఉండి ఉంటారు. ఇప్పుడు మొదటిసారి మరో ప్రపంచంలోకి వెళ్లబోతున్నారు. కాలేజీలో ఏ గ్రూప్‌లో చేరాలో నిర్ణయాలు ఎలాగూ చేసి ఉంటారు. అది చదువుకు సంబంధించింది అయితే, ఈ సమయంలో పిల్లలు నేర్చుకోవాల్సిన జీవననైపుణ్యాలు చాలానే ఉన్నాయి. ఈ రోజుల్లో ఫోన్లతోనే పిల్లలు తమ సమయాన్ని గడిపేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనే కాకుండా సోషల్‌గా తమ చుట్టూ ఉన్నవారితో ఎలా కలిసిపోవాలో తెలిసేలా చేయాలి. పెద్దలు వృత్తి ఉద్యోగాలు అంటూ తీరికలేకుండా ఉంటారు. కానీ, ఈ వేసవిలో కొన్ని రోజులు సెలవులు పెట్టుకొని పిల్లలకు సమయం కేటాయించడం తప్పనిసరి.

ముందు వరసలో ట్రావెల్‌...
మీరనుకున్న బడ్జెట్‌లో ఒక చిన్న ట్రిప్‌కి ప్లానింగ్‌ ప్రిపేర్‌ చేయమని పిల్లలకే చెప్పవచ్చు. అందరూ కూర్చొని ప్లాన్‌ చేయవచ్చు. దీనివల్ల ట్రావెలింగ్‌ పట్ల పిల్లలకు సరైన అవగాహన కలుగుతుంది. ట్రావెల్‌ వల్ల పెద్దవాళ్లు పిల్లలతో క్వాలిటీ టైమ్‌ గడిపినట్టు ఉంటుంది. థీమ్‌ పార్కులు, వాటర్‌ పార్కులు, మ్యూజియంల సందర్శన పట్టణ ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని చదువుకు సంబంధించిన చారిత్రక ప్రదేశాలు, వన్య్రపాణుల సంరక్షణ కేంద్రాల జాబితానూ రూపొందించుకోవచ్చు. ఇది పిల్లల్లో ట్రావెలింగ్‌ పట్ల అవగాహన కలిగేలా, వారి భవిష్యత్తు ప్రణాళికకు పునాదులు వేసేలా ఉంటుంది. ప్రయాణానికి ఏమేం తీసుకువెళ్లాలో... ఎలా సిద్ధపడాలో, ఫొటో ఆల్బమ్స్‌ తయారీ.. ఇలా ప్రతిదీ పెద్దలు కూడా కలిసి సొంతంగా తయారు చేసేది ఉంటుంది కాబట్టి ప్రతిదీ మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 

దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటూ బీచ్‌సైడ్‌ రిసార్ట్‌లు, గ్రామీణ ప్రాంతాల ఆకర్షణను తక్కువ అంచనా వేయవద్దు. ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ విశ్రాంతి తీసుకోవచ్చు. సైక్లింగ్, ఈత లేదా పెడల్‌ బోర్డింగ్‌ వంటి కార్యకలాపాలనూ ఆస్వాదించవచ్చు. ట్రావెల్‌ డిస్కౌంట్‌లను పొందడానికి ముందుగానే బుకింగ్‌ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో వెళ్లదగిన ట్రెక్కింగ్‌ ప్లేస్‌లు, కొత్త క్రీడలు, ఫిట్‌నెస్‌ కోసం సాధన చేయడం, సైక్లింగ్‌.. కుటుంబ ఐక్యతను సాధిస్తాయి. 

ఎక్కడకు వెళ్లినా ఆరోగ్య భద్రతా చర్యలు తప్పనిసరి అవసరం. వీటితోపాటు వైద్య అత్యవసర పరిస్థితులు, వెంట తీసుకెళ్లిన వస్తువులు మిస్‌ అయితే, ప్రయాణ ప్రణాళికలో మార్పులను కవర్‌ చేసే సమగ్ర ప్రయాణ బీమా.. ప్రతిదీ జీవన నైపుణ్యాలలో భాగమే. ఇవన్నీ టెక్ట్స్‌బుక్స్‌లో లభించేవి కావు. పెద్దలే పిల్లలకు పరిచయం చేయాల్సినవి. టీనేజ్‌లో చేసిన పరిచయాలు వారి జీవితాంతం గుర్తుండి పోయేంతగానూ ఉంటాయి.

కలిసి చేసే వంట..
వంటిల్లు ఎక్కువ సమయం గడపడానికి సరైన అవకాశం. కొత్త ప్రయోగాల వంటి ప్రత్యేకతలను వంటపట్టేలా చేయవచ్చు. సెలవులను ఎంజాయ్‌ చేయాలనుకుంటే వంట ఏంటి అని ముందే పిల్లలు ముఖం ముడుచుకునే అవకాశాలు లేకపోలేదు. అందుకని, ఫన్‌ వంటను క్రియేటివ్‌గా రకరకాల కలినరీ, బేకింగ్, ఇటాలియన్‌ ఫుడ్‌ అంటూ పిల్లలు  ఆసక్తిగా పాల్గొనేలా చేయవచ్చు. ఇందుకు, ఆన్‌లైన్‌ వేదికల సాయమూ తీసుకోవచ్చు. ప్రతిరోజూ కాకుండా వారంలో రెండు–మూడు రోజులు పిల్లల ఆసక్తిని బట్టి ప్లాన్‌ చేయవచ్చు. ఈ వేసవిలో నేర్చుకున్న, నేర్పిన వంట రేపు పిల్లలు సొంతంగా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పెద్దలకూ ఓ మంచి జ్ఞాపకంగా, పిల్లలకు వంట కూడా నేర్పించామన్న ధీమా ఉంటుంది.

పచ్చం‘ధనం’
ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్‌ ఉంటేనే గార్డెనింగ్‌ అనుకునే రోజులు కావు. టాయ్‌ గార్డెన్, బాల్కనీ, ఇండోర్‌ గార్డెన్‌ థీమ్స్‌... ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిని కుటుంబం అంతా కలిసి కొత్త థీమ్‌తో రూపొందించుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఇంటికి పచ్చదనం, మనసుకు ఆహ్లాదం వీటి ద్వారా పొందవచ్చు.

ఆధ్యాత్మిక, సంగీత వికాసం
అన్నీ ఫన్నీగా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు అనేదేమీ ఉండదు. కొన్ని కథలు, భగవద్గీత, రామాయణ పురాణేతిహాస గ్రంథాలు, మ్యూజిక్‌ క్లాసులు .. ఇంట్లో ఉంటూనే ఆన్‌లైన్‌లో షార్ట్‌ టర్మ్‌ క్లాసులలో చేరి, నేర్చుకోవచ్చు. పిల్లల కాలేజీ సబ్జెక్ట్‌ మినహా వారిలో ఆసక్తిని పెంచే ఏ విషయాన్నైనా తెలియజెప్పడానికి వెనకంజ వేయకూడదు.

ఫిట్‌నెస్‌ కోసమూ టైమ్‌
తల్లిదండ్రులు, పిల్లలు కలిసి మార్నింగ్‌ వాక్, పార్క్‌లను చుట్టేయడం వల్ల ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్‌ క్లాసులో చేరడం, స్విమ్మింగ్‌ నేర్చుకోవడం, జుంబా డ్యాన్స్‌లలో పాల్గొనడం.. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. ఏ పనిచేసినా అందులో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు అవి వారి భవిష్యత్తుకు కూడా ఉపయోగ పడతాయనుకుంటే వెనకంజ వేయనక్కర్లేదు. లేదంటే ప్రతిరోజూ బద్ధకంగానే గడిచిపోతే చూస్తుండగానే వేసవిరోజులు వెళ్లిపోతాయి. కాలేజీ చదువుల్లోని కొత్తదనాన్ని, అవగాహనను మరింత ఆనందంగా స్వీకరించడానికి ఈ రెండు నెలల వేసవి సమయం ఎంతగానో ఉపయోగపడుతుంది. 
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

హ్యాండిల్‌ విత్‌ కేర్‌
టెన్త్‌క్లాస్‌ పూర్తయిన పిల్లలది టీనేజ్‌ దశ. కాలేజీకి వెళుతున్నామనే ఉత్సాహం, కొత్త ప్రపంచం చూస్తామనే ఆత్రుత ఉంటాయి. గాజుబొమ్మల్లా పెరిగిన పిల్లలను రూల్స్‌తో కాకుండా పెద్దవాళ్లు గైడ్‌గా ఉండాలి. తాము చెప్పిందే కరెక్ట్‌ అని కాకుండా ఈ వయసు పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయో వాళ్లతో సంభాషించడం ద్వారా ఒక స్నేహ వాతావరణం నెలకొంటుంది. పిల్లలు కూడా తమ ఆలోచనలను ఓపెన్‌గా పేరెంట్స్‌తో పంచుకుంటారు. ఇప్పుడు చాలావరకు చిన్న కుటుంబాలు కాబట్టి ఎవరికి వారే అన్నట్టు ఉంటుంటారు. ఈ వేసవిలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు.. బంధువులను కలవడం లేదా అపార్ట్‌మెంట్లలో కూడా కొన్ని కుటుంబాలు కలిసి ఏదైనా గ్యాదరింగ్‌ అయ్యే ఈవెంట్స్‌ ఏర్పాటు చేయడం ఈ వయసు పిల్లలకు మేలు చేస్తుంది. ఒక మంచి జ్ఞాపకంగానూ మిగిలిపోతుంది. – పి.జ్యోతిరాజ, లైఫ్‌ స్కిల్‌ ట్రైనర్, సైకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement