వేసవి బెడద
వేమన చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ అన్నాడు గాని చెవిలో దోమ అనాలి. దోమల బాధలు మనిషికి ఇంతింత గాదయా అని అందరూ రాత్రయితే అనుకోవడమే. దోమలది సర్వసమాన దృష్టి. ఇంటి యజమానినైనా, ఇంటికొచ్చిన అతిథినైనా ఒకేలాగా చూస్తాయి. అంతు చూస్తాయి. అయితే గమనించి చూస్తే కొందరి దగ్గర ఏవో సిఫార్సు లెటర్సు ఉన్నట్టుగా వారిని తక్కువ కుట్టడం... మరికొందరిని రేషన్ క్యూలో నిలుచున్నవారిలా లెక్కలేనట్టుగా చూసి ఎక్కువ కుట్టడం చేస్తుంటాయి.
‘నా రక్తం తియ్యగా ఉన్నట్టుంది దోమలకి’ అంటూ ఉంటారు ఇలాంటి వాళ్లు. కాని దోమలు కొందరిని ఎక్కువగా కుట్టడం రక్తం తీయగా ఉండటం వల్ల కాదు. దోమలకు మనిషి రుచి రక్తం గురించి పట్టింపు లేదు అయితే అవి మానవ శరీరం నుండి వెలువడే అనేక రకాల జీవసంకేతాలపై ఆధారపడతాయి. వాటిని అధికంగా వెదజల్లే వారిని సులభంగా గుర్తించి వారిని ఎక్కువగా కుడతాయి.
మీ నిశ్వాసే మీ గూగుల్ లొకేషన్
దోమలు అదేదో గూగుల్ మ్యాప్‌లో చూసి మిమ్మల్ని గుర్తుపట్టి కుట్టడానికి కారణం మీరు వదిలే నిశ్వాస. అందులోని కార్బన్ డయాక్సైడ్ (íసీఓ2) లో దోమలు గుర్తు పట్టే ప్రత్యేకమైన సెన్సర్లు ఉంటాయి, ఈ సెన్సర్లు వాటికి దారి చూపి మీ దాకా తీసుకొస్తాయి. అంటే మీ నిశ్వాసలో ఎక్కువ మొత్తంలో సీఓ2 ఉంటే మిమ్మల్ని ఈజీగా గుర్తు పట్టి వెంట పడతాయి.
పిల్లల కంటే పెద్దలను దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణం పిల్లల కంటే పెద్దలు ఎక్కువ సిఓ2 వదులుతారు. గర్భిణీ స్త్రీల శరీరం నుంచి కూడా ఎక్కువ సీఓ2 విడుదలవుతుంది కాబట్టి వారు దోమల్ని ఎక్కువగా ఆకర్షించవచ్చు. అదేవిధంగా వ్యాయామం చేసిన వారు లేదా మంచి మెటబాలిజం ఉన్న వారు దేహ రసాయనాలు విడుదల చేస్తూ దోమలకు తమ ఆచూకీ ఇస్తారు. ఒకసారి ఆచూకీ తెలుసుకున్నాక ఇక అక్కడే అవి రొద పెడుతూ తిరుగుతాయి.
మీది వేడి శరీరమా?
దోమలు నిశ్వాసలోని సీఓ2ను గుర్తించి దగ్గరగా వచ్చినట్టే మీది వేడి శరీరం అయితే దానిని కూడా బాగా గుర్తు పడతాయి. దోమలు సూక్ష్మమైన ఉష్ణోగ్రతలను గుర్తిస్తాయి. మానవ చర్మంలో వెచ్చదనాన్ని అవి సులభంగా గుర్తించగలవు. రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉన్న చోట వాటికి వేడి తెలుస్తుంది. అదీగాక కదులుతున్న శరీరం గాలిలోకి ఎక్కువ వేడిని, వాసనను విడుదల చేస్తుంది. దీనిని ఫోన్ కాల్‌లాగా అందుకుని దోమలు వాలి కుట్టగల కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించి కుడతాయి. మనం ఎంత దుప్పటి కప్పుకున్నా కాపు కాచి అందుకే కుడతాయి.
మరి బ్లడ్ గ్రూప్ సంగతేంటి?
దోమలు కొన్ని నిర్దిష్ట బ్లడ్ గ్రూప్‌లను ఇష్టపడతాయనే ఒక సాధారణప్రతిపాదన ఉంది. ఏ, బీ, ఏబీ ఇలా ఈ గ్రూపులు ఉన్నావారి కంటే ‘ఓ’ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. అయితే ఈ విషయం ఇంకా సాధికారికంగా నిరూపణ కాలేదు. శాస్త్రవేత్తలు ఈ సంగతి గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ముందు చెప్పినట్టు దోమలు ఒక వ్యక్తిపై వాలడానికి రక్తాన్ని గుర్తించడం కంటే శ్వాసలోని కార్బన్ డయాక్సైడ్‌ను శరీర వేడి, చర్మం నుండి వెలువడే రసాయన వాసనలనే ఎక్కువ గుర్తిస్తాయి.
మీ చర్మం.. దాని మీది బ్యాక్టీరియా
మిమ్మల్ని దోమలు కుట్టడానికి, మీ చర్మంపైన ఉండే బ్యాక్టీరియాకు సంబంధం ఉంది. మానవ చర్మం సహజంగానే శరీరంలో నివసించే ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాకు నిలయం. ఈ సూక్ష్మజీవులు చెమట, ఇతర జీవన క్రియల సమయంలో రకరకాల రసాయన వాసనలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి వ్యక్తికీ వేరు వేరు బ్యాక్టీరియా స్థాయి వేరు వేరు చర్మ వాసనలు ఉంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు దోమలను ప్రత్యేకంగా ఆకర్షించే వాసనలను ఉత్పత్తి చేయగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి, దీనివల్ల కొందరిని ఇతరుల కంటే ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది.
దోమ గారి యమా సంగతులు
→ దోమలు చాలా వేగంగా రెక్కలు కొడతాయి. ఒక దోమ సెకనుకు సుమారు 500 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది. అందుకే అది చెవి దగ్గరకు వచ్చినప్పుడు మనకు ‘కుయ్’మనే రొద వినిపిస్తుంది. దోమ కుట్టునైనా భరించడం సులభమేమో కానీ ఈ రొద వినడం కష్టం. మనకు సుపరిచితమైనది ఆ గుయ్.. కారం.
→ దోమలు పులి, సింహం కంటే ప్రాణాంతకమైన జీవులు. సైజులో చాలా చిన్నగా ఉన్నప్పటికీ మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేసి ప్రాణాలు కబళిస్తాయి. మోటుగా చెప్పాలంటే యుద్ధాల్లో చనిపోయేవారి కంటే దోమకాటుకు చనిపోయేవారి సంఖ్య ఎక్కువ.
→ శునకాలే కాదు దోమలు కూడా మిమ్మల్ని దూరం నుంచే వాసన పసిగట్టగలవు. మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్ ద్వారా 10 నుండి 15 మీటర్ల దూరం నుంచే ఇక్కడ మనిషి ఉన్నాడని అవి గ్రహిస్తాయి. ఎగురుకుంటూ వచ్చి కసక్కున కుట్టి వదలుతాయి.
→ దోమల్లో మగవి సాధుజీవులు. పాపం ఇవి చెట్ల మీద పుట్ల మీద ఎగురుతూ తేనె లాంటివి తాగి బతుకుతాయి. ఆడ దోమలు అలా కాదు. వాటికి బ్లడ్ కావాలి. గుడ్లు పెట్టడానికి మన రక్తం నుండి ప్రోటీన్ అవసరం కాబట్టి అవి మన రక్తం కోసం వెంట పడతాయి.
→ దోమలకు చూపు చాలా తక్కువ. కాబట్టి అవి కంటి పరిధిలో అడ్డంగా స్పష్టంగా కనిపించే ఆకారాలను వెతుకుతాయి. ముదురు రంగు దుస్తులు ధరించిన మనిషి వాటికి స్పష్టంగా కనిపిస్తాడు.
→ దోమలకు పాదాలు ఇష్టం. అందుకే దోమలు కుట్టే మనిషి కాళ్లు గీరుకుంటూ కనిపిస్తాడు. దోమలు తరచుగా చీలమండలు, పాదాలను కుడతాయి, ఎందుకంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా వాటికి నచ్చిన బలమైన వాసనలను ఉత్పత్తి చేసి వాటికి మనిషి ఆచూకి ఇస్తుంది.
ఐస్‌లాండ్‌లో దోమ–ప్రమాదం
ఐస్‌లాండ్‌లో దోమలు ఉండవు. కాని ఇటీవల ఒక దోమ కనబడటం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దోమలు జీవించి, పునరుత్పత్తి చేయడానికి వెచ్చని ఉష్ణోగ్రతలు కావాలి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, ఐస్‌లాండ్ వంటి చల్లని ప్రాంతాలు కూడా వాటికి మరింత అనుకూలంగా మారుతున్నాయి. దీనివల్ల డెంగ్యూ జ్వరం, మలేరియా, చికున్ గున్యా వంటివి దోమల ద్వారా ఎక్కడెక్కడకు వ్యాపిస్తాయా అని సైంటిస్ట్‌లు ఆందోళన చెందుతున్నారు.
ఎండాకాలం... దోమల కాలం. మనిషికి మహమ్మారుల నుంచైనా విముక్తి ఉందేమోగాని దోమ నుంచి లేదు. రాత్రయ్యి లైట్ ఆఫ్ చేయగానే ఈ దండు బయలుదేరి చుక్కలు చూపించడం నిత్యకృత్యం. అయితే ఇవి కొందరిని ఎక్కువ కుడతాయి. కొందరిని క్షమించి వదిలిపెడతాయి. కారణాలు తెలిస్తే మీరు ఔరా అంటారు.


