ప్రశాంత  సుందరి

P Satyavathi Gave Tribute To Shanta Sundari Sharing Her Memories - Sakshi

నివాళి

ఆర్‌.శాంతసుందరి(8 ఏప్రిల్‌ 1947 – 11 నవంబర్‌ 2020)

చాన్నాళ్ల క్రిందట కేవలం వరూధిని గారిని, శాంతసుందరి గారిని మొదటిసారి కలవడానికే తెనాలిలో ఒక సమావేశానికి వెళ్ళాను. అప్పటికే ఆవిడ కేవలం కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి కాదు. మంచి అనువాదకురాలు. నిజం చెప్పొద్దూ, నేను నాకెంతో ఇష్టమైన కుటుంబరావు గారి భార్యనీ, కూతురునీ కలవాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను. ఆ విషయం వాళ్ళిద్దరితో అన్నాను. మిమ్మల్ని చూస్తే కుటుంబరావు గారిని చూసినట్లే వుంది అన్నాను కూడా. శాంత నవ్వేశారు. ఆవిడ అలా ఎప్పుడూ నవ్వుతూ వుంటారని తరువాత అర్థమైంది.

ఆవిడ ప్రశాంతసుందరి. హాస్యప్రియ. సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యత, ప్రేమల కలబోత. ఈ విషయాలన్నీ ఆవిడతో నా పదిహేనేళ్ల స్నేహంలో అర్థమయ్యాయి. ఆ తెనాలి సభ పరిచయం స్నేహం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. నా స్నేహం కుటుంబరావు అమ్మాయితో కాదు శాంతతోనే.

ఆవిడకి  తన మాతృభాష అయిన తెలుగులో వున్నంత అభినివేశం, అభిమానం హిందీ పట్ల కూడా వున్నాయి. అందుకే అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ అలవోకగా అనువాదాలు చేశారు. వృద్ధురాలైన తల్లిని చూసుకుంటూ, ఇంటిని నిర్వహించుకుంటూ, స్నేహాలు కాపాడుకుంటూ, అనుకున్న సమయానికి పబ్లిషర్స్‌కి అనువాదం అందిస్తూ ఒక్క నిమిషం కాలం వృ«థా కాకుండా జీవించిన ఆవిడ ఇలా అర్ధంతరంగా వెళ్ళిపోవడం  ఆమెను ఇష్టపడే వారికి కష్టమే. ఆమె ప్రయాణంలో ఆమె సహచరుడు గణేశ్వరరావు గారి సహకారం గొప్పది. వాళ్ళది స్నేహమయ సహజీవనం. ఆమె జబ్బుపడిన ఈ కొద్ది కాలంలో వాళ్ళ అమ్మాయి వచ్చేవరకూ ఆయన ఒక్కరే కాచుకున్నారు. ఆమె భౌతిక నిష్క్రమణను ఆయన ఎలా తట్టుకుంటారా అని బెంగ. 

శాంత తెలుగు నుంచి హిందీకి చేసిన ‘కాలుతున్న పూలతోట’ (సలీం రచన)కు కేంద్ర మానవ హక్కుల సంఘం ప్రథమ బహుమతి ఇచ్చింది. అలాగే భారతీయ అనువాద్‌ పరిషత్‌  ‘డాక్టర్‌ గార్గీ గుప్త ద్వివాగీశ్‌ పురస్కార్‌’తో సత్కరించింది. ‘ఇంట్లో ప్రేమచంద్‌’ హిందీ నుంచి చేసిన తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద పురస్కారం కూడా అందుకున్నారు. ‘బేబీ హాల్దార్‌’ హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. తెలుగు రచయిత్రుల కథల సంకలనం, కవితల సంకలనం కూడా హిందీలోకి తెచ్చారు.

అనేక మంది కవుల కవిత్వాన్ని, ముఖ్యంగా శివారెడ్డి, పాపినేని శివశంకర్, ఎన్‌.గోపి కవిత్వం హిందీలోకి అనువదించారు. ఆమె అనువాదాలు అందరికీ అర్థమయ్యేలాగా అలతి పదాలతో చదవచక్కగా వుంటాయని అంతా ఒప్పుకుంటారు. శాంత తమిళం నుంచి వైరముత్తు కవితలు కూడా తెలుగు చేశారు. ఏదైనా రచన తనకు నచ్చితేనూ, ఆలోచనా విధానం పాఠకులకు ఎంతో కొంత ప్రయోజనం వుంటేనే అనువాదం చేస్తానని చెప్పారు.

శాంత సుందరి ఇంగ్లిష్‌ నుంచి చాలా అనువాదాలు చేశారు. అవన్నీ బహుళ జనాదరణ పొందిన పుస్తకాలు. ఎక్కువమంది చదివిన ‘హౌ టు విన్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌ పీపుల్‌’ లాంటి డేల్‌ కార్నిగీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ‘ఫైవ్‌ పాయింట్‌ సమ్‌ వన్‌’ లాంటి చేతన్‌ భగత్‌ నవలలు, పలువురి ప్రశంసలు పొందిన ఆనంద్‌ నీలకంఠన్‌ ‘అసురుడు’, ‘అజేయుడు’ వంటి పుస్తకాలే కాక ప్రపంచ ప్రశంస పొందిన ‘సేపియ’(యువల్‌ నోవా హరారీ) కూడా తెలుగు పాఠకులకు కానుక చేశారు. ఆ పుస్తకం సీక్వెల్‌ను అనువాదం చేస్తూవుండగా కేన్సర్‌ వ్యాధికి ఆమె మెదడు మీద అసూయ కలిగింది. ‘ఇక చాల్లే కలం ముయ్‌’ అని కసిరేసింది. అసూయ పుట్టదా మరి! హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి, ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేస్తే!

భర్త గణేశ్వరరావు సహకారం గురించి చెబుతూ, ఆయన తన ఎడిటర్, క్రిటిక్‌ కూడా అనీ, మార్పు, చేర్పులపై చర్చించుకునే వాళ్ళమనీ, ఆయన సలహా సహకారం లేనిదే నేను ఇంత చేయగలిగే దాన్ని కాను అంటారు చాలా నిజాయితీగా. ఆమె ముక్కుసూటి మనిషి. తనకు నచ్చనిది మొహమాటానికి అసలు ఒప్పుకోరు.ఎంత మృదువుగా వుంటారో అంత పట్టుదలగా కూడా వుంటారు. శత వర్షాలకు చేరువగా వస్తున్న వరూధిని గారు, దశాబ్దాల సహజీవనం తరువాత ఈ ఎడబాటును తట్టుకోవలసిన గణేశ్వరరావు గారు కంటి ముందు మెదులుతూ వుంటే ఇంత హఠాత్తుగా నిష్క్రమించడం ఏం బాగుంది శాంత గారూ? 
-పి.సత్యవతి 
9848142742

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top