బర్త్‌డే పార్టీపై స్పందించిన సింగర్ మంగ్లీ.. డీసీపీ కామెంట్స్‌ | Singer Mangli Reaction On Her Birthday Party Controversy, Watch Video Inside | Sakshi
Sakshi News home page

బర్త్‌డే పార్టీపై స్పందించిన సింగర్ మంగ్లీ.. డీసీపీ కామెంట్స్‌

Jun 12 2025 8:00 AM | Updated on Jun 12 2025 9:32 AM

Singer Mangli Reaction On Her Birthday Party

గాయని మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకు ఇచ్చిన పార్టీ రచ్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి ఇచ్చిన పార్టీలో డ్రగ్స్‌, గంజాయి ఉపయోగించారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని సోషల్‌మీడియాలో ఆ వార్తలు వైరల్‌ అయ్యాయి. తను ఏర్పాటు చేసిన విందులో తన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారని అక్కడ ఎలాంటి డ్రగ్స్‌, విదేశీ మద్యం సరఫరా చేయలేదని ఆమె ఒక వీడియోతో వివరణ ఇచ్చారు. పోలీసులు కూడా దానిని ధ్రువీకరించారు.

మంగ్లీ ఇచ్చిన పార్టీలో మద్యం, డీజే వినియోగం కోసం అనుమతి తీసుకోలేదని చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ ఇలా చెప్పారు. 'మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ మొదలైంది. త్రిపుర రిసార్ట్‌ నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయని మా ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది.  అక్కడ మద్యం వినియోగిస్తున్నారని కూడా తెలిసింది. దీంతో సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

అప్పుడు 10 మంది మహిళలతో పాటు 12మంది పురుషులు ఉన్నారు. పార్టీలో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాము. అయితే,  జిల్లెలగూడకు చెందిన వ్యాపారి కొసనం దామోదర్‌రెడ్డికి గంజాయి పాజిటివ్‌గా వచ్చింది. మిగిలిన వారిలో ఎవరికీ రిపోర్ట్‌లో పాజిటివ్‌ రాలేదు. కానీ, అతను కూడా మంగ్లీ ఇచ్చిన పార్టీలో గంజాయ్‌ తీసుకోలేదని, అంతకుముందే మరోచోట తీసుకున్నట్లు తెలిసింది.' అని డీసీపీ తెలిపారు. పోలీసులు చేసిన సోదాల్లో విదేశీ మద్యం కానీ, ఇతర మత్తు పదార్థాలు కానీ లభించలేదని చేవెళ్ల ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌ శ్రీధర్‌ కూడా పేర్కొన్నారు.

వివరణ ఇచ్చిన మంగ్లీ
తన పుట్టినరోజు నాడు జరిగిన అంశంపై సింగర్‌ మంగ్లీ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ' పుట్టినరోజు  వేడుకలు నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి చేసుకున్నాను. అయితే, మద్యం బాటిల్స్, డిజే సౌండ్స్‌కి అనుమతి తీసుకోవాలి అనే అవగాహన నాకు లేదు. తెలియక తప్పు జరిగింది. అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదు.  డ్రగ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకొని వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.  పోలీసులకు పూర్తిగా సహకరిస్తాము. దయచేసి నాపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దు.' అని ఆమె చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement