
టైటిల్: సార్ మేడమ్
నటీనటులు: విజయ్ సేతుపతి, నిత్యా మేనన్, యోగిబాబు, రోషిని హరిప్రియన్, దీప శంకర్, మైనా నందిని, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్ తదితరులు
నిర్మాణ సంస్థలు: సత్య జ్యోతి ఫిలిమ్స్
నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
దర్శకత్వం: పాండిరాజ్
సంగీతం: సంతోష్ నారాయణన్
విడుదల తేది: ఆగస్టు1, 2025
సరికొత్త కథలను ప్రేక్షకుల దగ్గరచేయడంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ వంటి స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటిది వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే భారీ అంచనాలు ఉంటాయి. ఈ జోడీ నటించిన కొత్త చిత్రం 'సార్ మేడమ్'.. భార్యాభర్తల అనుబంధం నిత్య జీవితంలో ఎలా ఉంటుందో దర్శకుడు పాండిరాజ్ చూపించారు. తమిళ్లో జులై 25న 'తలైవన్ తలైవి' పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఆగష్టు 1న రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథేటంటే..
ఏడడుగుల బంధం ఎలా ఉంటుందో 'సార్ మేడమ్' చిత్రంలో చూపించారు. పెళ్లైన వారందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) సొంత గ్రామంలోనే పరోటా మాస్టర్గా ఒక హోటల్ నడుపుతుంటాడు. ఇందులో చేయి తిరిగిన పరోటా మాస్టర్గా ఆయనకు పేరు ఉంటుంది. తనుకు పెళ్లి చెయ్యాలని రాణి (నిత్యా మీనన్) అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. పెళ్లి చూపుల్లోనే ఇరుకుటుంబాలు ఒప్పుకుంటాయి. ఎలాగైన తమ కుమారుడికి పెళ్లి చేయాలని పదో తరగతి మాత్రమే చదవిన వీరయ్య డబుల్ MA చేశాడని ఆపై ఇల్లు తమ సొంతమని కొన్ని అబద్దాలు చెబుతారు. అయితే, వీరయ్య కుటుంబ నేపథ్యం గురించి నిజం తెలుసుకున్నాక ఆ సంబంధం వద్దనుకుంటారు.
కానీ, పెళ్లి చూపుల్లోనే ప్రేమలో మునిగిపోయిన వీరయ్య, రాణి పెద్ద వాళ్లను కాదని పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సంతోషంగా హోటల్ రన్ చేసుకుంటూ వారి సంసార జీవితాన్ని గడుపుతారు. రాణిని మొదటి మూడు నెలలు అత్తమామలు, ఆడపడుచుతో సహా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే, ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలౌతుంది. రాణిపై అత్త పెత్తనంతో పాటు ఆడపడుచు సాధింపులు మొదలవుతాయి. దీంతో తరుచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒకరోజు అవి తారాస్థాయికి చేరుకుంటాయి. దీంతో వీరయ్య, రాణి ఇద్దరూ విడిపోవాలని విడాకులు తీసుకోవాలనుకుంటారు. ఎంతో ప్రేమగా ఉన్న ఆ జంట విడిపోయేందుకు కారణాలు ఏంటి..? భార్యాభర్తల గొడవలకు ఎవరు కారణం అయ్యారు..? రాణి అన్నయ్యతో వీరయ్యకు ఉన్న గొడవ ఏంటి..? సంతోషంగా ఉన్న కాపురంలో మొదట అగ్గిరాజేసింది ఎవరు..? అనేది అసలు కథ.

ఎలా ఉందంటే..
భార్యాభర్తల బంధం బలంగా నిలబడాలంటే ప్రేమ, గౌరవం, నమ్మకం, పరస్పర అవగాహనతో కూడి ఉండాలి. పొరపాట్లు జరగడం సహజం. అప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి.. ఆపై క్షమాపణ చెప్పడానికి వెనుకాడకూడదు. 'సార్ మేడమ్' సినిమా కూడా ఇలాంటి మెసేజ్నే ఇస్తుంది. భార్యాభర్తల అనుబంధాన్ని నిలుపుకునేందుకు వారు పడే పాట్లు కష్టంగానే ఉన్నా చూసే వారికి అందంగానే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటికే పెళ్లైన, పెళ్లి చేసుకోవాలనకునే వారందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ కథలో చాలా సీరియస్‌నెస్ ఉంటుంది. కానీ, దర్శకుడు పాండిరాజ్ చాలా సహజంగా అందరినీ ఆలోచింపచేసేలా నవ్విస్తూనే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్కు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. భార్యభర్తల మధ్య తరుచూ కనిపించే గిల్లికజ్జాలు, గొడవలు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాయి.
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా తండ్రికి తెలియకుండా కూతరు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు అత్తమామలు చేసే ప్రయత్నం నుంచి కథ ఆరంభం అవుతుంది. అలా వారి గతాన్ని చాలా ఫన్నీగా చెబుతూ.. మొదట వీరయ్య, రాణిల పెళ్లి ఎలా అయింది..? పెళ్లి తర్వాత రాణిపై అత్త, ఆడపడుచు ఆధిపత్యం చేయడం. కోడలిపై మామగారికి ఉన్న అభిమానం. భార్యపై భర్తకు ఉన్న ప్రేమ.. ఇలా ఒకటేంటి ఎన్నో ఈ కథలో మనకు కనిపిస్తాయి. సంతోషంగా సాగుతున్న సంసారంలో కొన్నిసార్లు గొడవలు సహజం. ఆ గొడవల మధ్యలోకి అత్తమామలు దూరితే సంఘర్షణ డబుల్ అవుతుంది. సినిమా అంతా బాగున్నప్పటికీ ఈ కథ ఎక్కువగా రెండు పాత్రల చుట్టూ తిరగడం కాస్త మైనస్, పదేపదే గొడవ పడటం వంటి అంశాలు రిపీటెడ్గా అనిపిస్తాయి. అంతే తప్పా ఇందులో మైనస్లు పెద్దగా లేవు. కొన్ని సీన్లు ఎక్కువగా సాగదీశారనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఆకాశ వీరయ్యగా విజయ్ సేతుపతి, రాణి పాత్రల్లో నిత్యా మేనన్ ఫుల్ ఎనర్జిటిక్‌గా మెప్పించారు. వారి మధ్య కనిపించే కెమిస్ట్రీ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. సినిమాలో అప్పుడప్పుడు కనిపించే యోగిబాబు తన పంచ్లతో నవ్విస్తాడు. సరైన సమయంలో తన పాత్ర ఎంట్రీ ఇస్తుండటంతో బాగా అనిపిస్తుంది. ఆపై విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టేశాడు. అటు తల్లికి... ఇటు భార్యకు నచ్చచెబుతూ తను మాత్రం ఇద్దరి మధ్య నలిగిపోతుంటాడు. ఒక సామాన్యుడి జీవితానికి వీరయ్య పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది.
ఆపై అత్తింటి వాళ్లతో పాటు భర్తతో గొడవపడేటప్పుడు రాణి పాత్రలో నిత్యా మేనన్ దుమ్మురేపింది. అదే సమయంలో తన పుట్టింట్లో భర్త గురించి గొప్పగా చెప్పుకున్న సీన్ ప్రతి అమ్మాయి జీవితాన్ని తాకుతుంది. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవల్లోకి కుటుంబ సభ్యులు, చుట్టాలు ఎలా ఎంట్రీ ఇస్తారో ప్రీ క్లైమాక్స్‌లో అర్థం అయ్యేలా దర్శకుడు బాగా చూపించాడు. కథకు తగ్గట్టుగా సంగీతం బాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపిస్తుంది. సినిమా పూర్తి అయిన తర్వాత ఈ కథకు కనెక్ట్ అయిన ప్రతిఒక్కరు నవ్వుతూనే ఆలోచిస్తారు. జీవితం అంటే ఇదే కదా అంటూ బయటకు వచ్చేస్తారు.