
విమానయాన సంస్థల సేవాలోపాలకు సంబంధించి అనేక కథనాలు,ఫిర్యాదులు గతంలో అనేకం చూశాం. కొన్ని వివాదాల్ని రేపాయి. మరికొన్ని ఫిర్యాదులపై స్పందించిన విమానయాన రెగ్యులేటరీ సంస్థ ఆయా సంస్థలకు మొట్టికాయలు వేయడం కూడా మనకు తెలిసింది. తాజాగా దిగ్గజ ఎయిర్‌లైన్ ఎయిరిండియా మరో వివాదం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదీ ఒక నటుడు విమర్శలు గుప్పించడం వార్తల్లో నిలిచింది.
హాస్యనటుడు వీర్ దాస్ ఎయిరిండియాపై మండిపడ్డారు. ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు రూ.50 వేలు పోసి ఒక్కో టికెట్ కొన్నా ఫలితం లేదంటూ విమర్శించారు. టేబుల్ విరిగిపోయిందని, లెగ్ రెస్ట్‌లు విరిగిపోయాయని, సీటు ఇరుక్కుపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో మంగళవారం ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వైరల్ గా మారింది. అలాగే తన భార్య కాలు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందస్తుగా వీల్ చైర్ సర్వీసు బుక్ చేసుకున్న తర్వాత కూడా వీల్‌చైర్ రాలేదని దాస్ ఆరోపించారు.
Dear @airindia Please reclaim your wheelchair. I’m a lifetime loyalist. I believe you’ve got the nicest cabin crew in the sky, this post pains me to write. My wife and I book Pranaam and a wheelchair because she’s got a foot fracture that’s still healing. We’re flying to delhi.…
— Vir Das (@thevirdas) April 14, 2025
"ప్రియమైన ఎయిరిండియా,ఈ పోస్ట్ రాయడం నాకు బాధగా ఉంది. దయచేసి మీ వీల్‌చైర్‌ను మీరు తీసుకొండి. నేను జీవితాంతం విశ్వాసపాత్రుడిని." అన్నారు. ఇదే పోస్ట్‌లో ఇంకా "విరిగిన టేబుల్, విరిగిన లెగ్ రెస్ట్‌లు, వంగిపోయిన సీటు దుర్భరమైన ప్రయాణమని వీర్ దాస్ పేర్కొన్నారు. విమానం రెండు గంటలు ఆలస్యం.. ముందుగానే వీల్‌చైర్ , ఎన్‌కామ్ (విమానాశ్రయాలలో మీట్-అండ్-గ్రీట్ సేవలు) ముందుగానే బుక్ చేసుకున్నాం అయినా ఫలితం లేదు. దాని గురించి అడగడానికి అసలక్కడ ఎవరూ లేరు" అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
నాలుగు బ్యాగులు మోస్తూ, సాయం చేయమని సిబ్బందిని అడిగితే, క్యాబిన్ సిబ్బందిగానీ, గ్రౌండ్ సిబ్బందిగానీ అస్సలు పట్టించుకోలేదన్నారు. అలాగే నొప్పితో ఉన్న తన భార్య స్టెప్‌లాడర్ ఉపయోగించి దిగాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. విమానాశ్రయంలో ఎక్కడ చూసినా వీల్ చైర్స్ కనిపిస్తున్నాయి.. కానీ ముందుగా బుక్ చేసుకున్న తనకు ఆ సౌకర్యం లేదు సిబ్బంది ఎవరూ లేరంటూ ఆగ్రహించారు. అందుకే తన భార్య కోసం ఒకటి లాక్కోవలసి వచ్చింది.అలా భార్యను లగేజ్ క్లెయిమ్‌కు తీసుకెళ్లి, అక్కడినుంచి పార్కింగ్‌కు వెళ్లామని వివరించాడు. అలాగేఎయిర్‌పోర్ట్‌లో సెకండ్‌ఫ్లోర్‌లో మీ వీల్ చైర్ ఉంది తెచ్చుకోండి అంటూ ఎయిరిండియాకు సూచించారు. దాస్ పోస్ట్‌పై ఎయిరిండియా స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సంబంధింత వివరాలు అందించాలని సమాధానమిచ్చింది.