దేవి నవరాత్రులు మొదలై..అప్పుడే నాలుగో రోజుకి చేరుకున్నాయి. దేశమంతట దసరా వేడుకలతో శోభాయమానంగా ఉంది. అమ్మలుగన్న అమ్మ ఆ దుర్గమ్మను భక్తులంతా వివిధ రీతుల్లో కొలుచుకుంటూ భక్తిపారవశ్యంతో మునిగితేలుతున్నారు. ఎటుచూసినా భవాని దీక్షలు, నవరాత్రి ఉత్సవాలు. ఈ తరుణంలో ఓ మహిళ వినూత్న రీతీలో తన భక్తిని ప్రదర్శించింది. ఆమె అసాధారణ నవరాత్రి దీక్ష చూస్తే షాకవ్వాల్సిందే. దీన్ని చూసేందుకు జనాలంతా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వింత భక్తి విన్యాసం ఎక్కడ చోటు చేసుకుందంటే
ఈ అద్భుత ఘటన బిహార్లో చోటు చేసుకుంది. బీహార్లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల మధుమాల దేవి అనే మహిళ నవరాత్రి సందర్భంగా చేస్తున్న భక్తి ప్రక్రియ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంది. దుర్గాదేవి ఆరాధనలో భాగంగా మధుమాల ఏకంగా 2,516 పదునైన మేకులు అమర్చిన పడకపై పడుకుని నవరాత్రి దీక్ష చేస్తోంది. తన ఇంట్లోనే ఈ దీక్ష చేస్తోంది. ఆమె ఛాతీపై పవిత్రమైన కలశం ఉంచగా, పక్కనే త్రిశూలం కూడా ఉంది. ఆమె నవరాత్రి తొలి రోజు నుంచి ఆహారం, నీరు తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తోంది. ఆమె దీక్షను వీక్షించేందుకు సమీప ప్రాంతాల నుంచి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
ఈ దీక్ష కోసమే ప్రత్యేకంగా మేకులతో చేసిన చెక్క పడకను తయారు చేశారట. ప్రతి మేకు ఐదు అంగుళలా పొడవుతో మొత్తం 32 కిలోలు ఉంటుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ మేకులపై పలుచని వస్త్రం పరిచి..దానిపై మధుమాల దేవి పడుకుంటుందట. ఈ దీక్ష సమయంలో దానిపైనే ఆమె శయనమట. ఈ విభిన్నమైన దుర్గా ఆరాధన అక్కడ చర్చనీయాంశమై ప్రజలలో ఆసక్తిని రేకెత్తించి ఆమె ఇంటికి క్యూ కట్టేలా చేసింది.
ఇదిలా ఉండగా ఆమె భర్త రంజిత్ చౌరాసియా తన భార్య మధుమాల దేవికి అమ్మవారంటే మహా ఇష్టమని, ఆ తల్లిపై అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని అన్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు అమ్మవారికి సంబంధించిన కల వచ్చిందని అప్పటి నుంచి మరింత నమ్మకం ఏర్పడి ఇలా అమ్మవారిని ఆరాధిస్తోందని చెప్పారు. గతేడాది కూడా నవరాత్రి సమయంలో కలశం ఏర్పరిచి..తొమ్మిదిరోజుల పాటు పూజలు చేసినట్లు తెలిపారు.
అలాగే తాము పూజించే దుర్గాదేవి విగ్రహం తమ ఇంటిలోపల భూమిలోనే దొరికిందని, దానికోసం ప్రత్యేకంగా ఆలయం ఏర్పాటు చేసి కొలుచుకుంటున్నట్లు తెలిపారు. ఇక తన భార్యకు మద్దతుగా తాను కూడా ఉపవాసం ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఈ దంపతులకు 14 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి: నవరాత్రులు మాదిరిగా..అక్కడ తొమ్మిది రోజుల శాకాహార వేడుక..!


