
మలబార్ హిల్‌లో నైసర్గిక ఎలివేటెడ్‌కు పర్యాటకుల నుంచి విశేష స్పందన
ప్రారంభించిన వారంరోజుల్లో 10 వేలకు పైగా పర్యాటకుల రాక
ఎంట్రీ టికెట్ల ద్వారా బీఎంసీకి రూ.27 లక్షల ఆదాయం
సింగపూర్‌లోని ట్రీ టాప్ వాక్ తరహాలో నిర్మాణం
మలబార్ హిల్ ప్రాంతంలో నెల రోజుల కిందట ప్రారంభించిన ‘నైసర్గిక ఎలివేటెడ్ మార్గం’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం అనందాన్ని ఆస్వాదించగా ఇప్పుడా సంఖ్య ఏకంగా లక్షకుపైనే చేరింది. పర్యాటకుల ఎంట్రీ టికెట్ల ద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి రూ.27 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. కొందరికి టెకెట్లు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. లేదంటే ఈ ఆదాయం మరింత పెరిగేదనే బీఎంసీ వర్గాలు తెలిపాయి.
రూ.30 కోట్ల వ్యయం
శివసేన యువనేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే 2022లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ తరహాలో ‘ట్రీ టాప్ వాక్’ నిర్మించాలని సంకల్పించారు. ఆ మేరకు కమలా నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న మలబార్ హిల్‌లో నైసర్గిక ఎలివేటెడ్ మార్గం పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యాయి. అందు కు రూ.30 కోట్లు ఖర్చుచేసిన ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం గత నెల నుంచి వినియోగంలోకి వచి్చంది. ప్రారంభం నుంచి ఈ ఎలివేటెడ్ మార్గానికి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించసాగింది.
ట్రీ టాప్ వాక్ తరహాలో..
మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యానవనం ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచ్చితంగా ఈ రెండు ఉద్యాన వనాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులను మరింత ఉత్సాహపరిచాలనే ఉద్దేశంతో సింగపూర్‌లో ఉన్న ‘ట్రీ టాప్ వాక్’ తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించారు. ఇలాంటి ఎలివేటెడ్ మార్గాన్ని ముంబైలో నిర్మించడం ఇదే ప్రథమం కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మార్గానికి వందలాది చెట్లు అడ్డువచ్చినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉద్యానవనంలోని వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అలాగే కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చర్నిరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్‌క్లెస్ (మెరైన్ డ్రైవ్) తదితర విహంగం ద్వారా దృశ్యాలను తిలకించవచ్చు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.25 వసూలు చేస్తున్న నైసర్గిక ఎలివేటెడ్ మార్గానికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. శని, ఆదివారాలైతే కిక్కిర్సిన జనాలు, పర్యాటకులు ఉంటున్నారు. టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే అమ్ముడు పోవడంతో ఆఫ్‌లైన్‌లో లభించడం లేదు. దీంతో అనేక మంది పర్యాటకులు నైసర్గిక ఎలివేటెడ్ మార్గం ద్వారా ప్రకృతి అందాలను తిలకించకుండానే వెనుదిరుగుతున్నారు.