ఇలపై జనించిన కరుణ కిరణం

Merry Christmas 2021: Beautiful Message On Christmas - Sakshi

‘చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహమందున...చెంత చేరను రండి సర్వజనాంగమా..సంతసమొందుమా!’ అని హృదయపూర్వకంగా కీర్తన పాడే సుదినం క్రిస్మస్‌. సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకంలో బాలునిగా జన్మించిన యేసుక్రీస్తు ఆగమనాన్ని కీర్తించే సంతస దినం క్రిస్మస్‌. ప్రపంచవ్యాప్తంగా నేడు కోట్లాదిమంది హృదయాల్లో ఆనందం పెల్లుబికే రోజు.

ఇది చారిత్రాత్మక పర్వదినం. క్రిస్మస్‌ అనగా క్రీస్తును ఆరాధించుట. తన మనస్సును దేవుని ప్రేమతో నింపుకొని పరిపూర్ణ ఆరాధనలో పరవశిస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొలపాలనే ఆశతో నిండిన వ్యక్తి కలం నుండి జాలువారిన మాటలివి. ‘ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్‌. రాజాధిరాజు ప్రభువైన క్రీస్తుకు నమస్కరింప రండి... నమస్కరింప రండి’. 

చాలా సంవత్సరాల కిందట ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్ని వేలానికి సిద్ధపరిచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటకు చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని స్వంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్‌ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్‌ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్‌ చేసి దానిమీద ఒక క్రిస్మస్‌ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్‌ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. 

క్రిస్మస్‌ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు అని దూత రాత్రివేళ పొలంలో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు  శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్ధం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు అనేది లేఖన సత్యం (రోమా 2:23).

పాపం దేవునికి మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపంలో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడిచేశాడు. క్రిస్మస్‌ దేవుడు మనకు సమీపంగా వచ్చాడన్న సందేశాన్ని జ్ఞాపకం చేస్తుంది. కన్యక గర్భవతియై కుమారుని కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని

క్రీస్తు పుట్టుటకు కొన్ని వందల సంవత్సరాల ముందు యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. మనతో మనలో నివసించడానికి ప్రభువు ఇష్టపడి కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించాడు. మరియ యోసేపులు నజరేతు నుండి బేత్లెహేమునకు వచ్చినప్పుడు సత్రంలో వారికి స్థలం లేనందున యేసును కనిన తరువాత మరియ ఆయన్ను పశువుల తొట్టెలో పరుండబెట్టింది. ఊహకు అందని ఆశ్చర్యం అది. సర్వశక్తిగల దేవుడు భువిలో జన్మిస్తే ఆయన్ను పరుండబెట్టాల్సిన స్థలమా అది?

అయితే ప్రభువైన దేవుడు పశువుల శాలలో మరియు తొట్టెలో పరుండబెట్టుట వలన మొదటిగా అతి సామాన్యులైన గొర్రెల కాపరులు నిర్భయంగా దర్శించగలిగారు. ఆ కాలంలో గొర్రెల కాపరులను చాలా తక్కువగా చూసేవారు. అలాంటి అభాగ్యులకు దేవుని దర్శన భాగ్యం కలిగింది. దేవుడు అందరికి సమీపంగా ఉండువాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు అన్న సత్యం మనుజాళికి ఎంతో ఊరట నిచ్చింది. జీవిత ద్వారాలు తెరిచి సందేహాలు మరిచి దేవున్ని తలిస్తే దేవుని స్పర్శను అనుభవించగలము.

క్రిస్మస్‌ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్టించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్‌ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైక వేద్యం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్‌ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ నిన్ను వీడనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు.

ఓపికతో శ్రమపడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు వారిని నడిపించింది. ఆ సందర్భంలో వారు అత్యానందభరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం.

నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించ గలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్ధం వేరే వుండదు.

నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు...కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు అని ఒక అపర కుబేరుడు మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. భౌతిక అవసరాలు తీర్చబడితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. 

క్రీస్తుకు తన హృదయంలో చోటివ్వడం ద్వారా తాను పొందిన అనుభూతిని ఒక వ్యక్తి ఇలా వర్ణిస్తాడు. ‘దేవుడే నా యిల్లు. గడచిన కాలమంతా అంతంలేని దారుల్లో అంధుడిలా నడిచాను. నాలో నేనేదో దేవులాడుకున్నాను. దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను. ఆశలు సమసి భయాలు ఆవరించినప్పుడు రక్షకుడైన క్రీస్తును దర్శించాను. ఆయన ప్రేమగల కౌగిల్లో జీవించాలని నిర్ణయించుకున్నాను. దేవుడే నాకు ఆనందంతో పాటు అన్నీ అనుగ్రహించాడు’.

శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్ధం. దేవుడు అందరికి సమీపంగా ఉండువాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు అన్న సత్యం మనుజాళికి ఎంతో ఊరట నిచ్చింది. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్‌ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. 

– డా. జాన్‌ వెస్లీ, క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top