
∙ మ్యూజిక్ వరల్డ్
ఇండియన్ పాప్‌లో తనదైన స్టైల్ సృష్టించుకొని దూసుకు పోతోంది పందొమ్మిది సంవత్సరాల గిని. ‘ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్’గా కూడా ప్రశంసలు అందు కుంటోంది.... తండ్రి ఉద్యోగ రీత్యా, గిని కుటుంబం ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండేది కాదు. అయితే ఎక్కడికి వెళ్లినా ఆమెతో స్థిరంగా ఉన్నది మాత్రం సంగీతమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నప్పుడు కుటుంబం మొత్తం కారులో వెళ్లేది. కారులో నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ప్లే అయ్యేది. భూపెన్ హజారిక నుంచి హరిహరన్ వరకు ఎంతో అద్భుతమైన గొంతులను వినే అవకాశం వచ్చేది.
కారు బ్యాక్ సీట్‌లో కూర్చున్న గిని పాట ప్లే అవుతున్నప్పుడు వారితో గొంతు కలిపేది. అలాపాటలతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత గానం ప్రాణమై పోయింది. మొదట్లో ప్రముఖ గాయకులను అనుకరించినా, ఆ తరువాత మాత్రం గానంలో తనదైన శైలిని సృష్టించుకుంది. కాలిగ్రఫీ, ఒరిగామి, గుర్రపు స్వారీ, కోడింగ్... ఏదైనా సరే, నేర్చుకోవాలనే ఆలోచన వస్తే పట్టుదలగా నేర్చుకునేది. యూట్యూట్ వీడియోలు చూస్తూ గిటారు ప్లే చేయడం నేర్చుకుంది. పాటలు రాయడంలో, కంపోజ్ చేయడంలో తన టాలెంట్ నిరూపించుకుంది.