
ప్రాణుల పట్ల భాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రతి అడుగూ విలువైనదే. ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతు సంరక్షణ, దత్తత, మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో హైదరాబాద్ నగర వేదికగా నిర్వహించిన ‘పెయింట్ విత్ పప్పీస్’ అనే వినూత్న కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రముఖ గ్లోబల్ కంపెనీ ‘మార్స్’ ఆధ్వర్యంలోని మార్స్ గ్లోబల్ అడాప్షన్ వీక్–2025లో భాగంగా ఈ వర్క్‌షాప్ నిర్వహించింది. ఆర్ట్, ఆనందం, ఆదరణ కలగలిపిన ఈ మార్స్ వెల్‌నెస్ డ్రైవ్ మూగజీవాల పట్ల కళాత్మక ఆత్మీయతను ప్రదర్శించింది.
పాజిటివ్ వైబ్స్‌తో ఆర్ట్ థెరపీ..
ఈ ప్రత్యేక కార్యక్రమం ‘పావాసన’ అనే జంతు సంక్షేమ సంస్థతో కలిసి మార్స్ కార్యాలయంలో నిర్వహించింది. 100 మందికి పైగా అసోసియేట్లు ఇందులో పాల్గొని, చిన్న చిన్న పప్పీలతో కలిసి చిత్రలేఖనం చేస్తూ మానసిక విశ్రాంతి, ఆనందం, కరుణను ఒకే వేదికపై ప్రదర్శించారు. ఈ అడాప్షన్ వీకెండ్ హైదరాబాద్‌తో పాటుగా దేశవ్యాప్తంగా 11 నగరాల్లో జరిగింది. 14 ఎన్జీఓలు, వందలాది వాలంటీర్లు, వేల మంది సందర్శకులు దీనిలో భాగమయ్యారు.
హైదరాబాద్‌లో బ్లూ క్రాస్, ఎన్‌ఎస్‌ఏఏఎస్ మేడ్చల్ సహకారంతో అడాప్షన్, వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. నిరాశ్రయ జంతువులు ‘ఫరెవర్ హోమ్స్’ సహాకారాన్ని పొందాయి. అంతేకాకుండా మార్స్ సంస్థ తన ‘టూ లీవ్స్ చేంజ్‌డ్’ అనే అంతర్జాతీయ సంస్థ చొరవతో భారత్‌తో పాటు అమెరికా, యుకే, థాయ్‌లాండ్, మెక్సికో వంటి 25 దేశాల్లో ఈ మానవతా కార్యక్రమాన్ని విస్తరించింది.
ఒక పెంపుడు జంతువును దత్తత తీసుకోవడం అంటే ఆ ప్రాణికి మాత్రమే కాకుండా మన జీవితంలో మార్పుకు ఆహా్వనం పలకడమేనని మార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి తెలిపారు. కేవలం అవగాహన కలి్పంచడమే కాకుండా మూగజీవాల పట్ల దయ, సంరక్షణకు మార్గం చూపే ప్రయత్నమని పేర్కొన్నారు.
కామ్ సంస్థ భాగస్వామ్యంతో చేసిన అధ్యయనంలో జంతువుల వల్ల యజమానుల్లో 88 శాతం మంది ఆందోళన, ఒత్తిడి తగ్గుతుందని వెల్లడైందని, 76 శాతం మంది మానసిక సాంత్వనను పొందుతున్నట్లు తేలిందన్నారు. ఇది సృజనాత్మకత, సేవల కలయిక అని పావాసన సహ వ్యవస్థాపకురాలు అన్నన్య అభివరి్ణంచారు.