
అక్టోబర్, నవంబర్‌లో భారీగా ముహూర్తాలు
ఉండడంతో పెళ్లి సందడి షురూ
అక్టోబర్, నవంబర్‌లో భారీగా ముహూర్తాలు ఉండడంతో పెళ్లి సందడి షురూ అయ్యింది. షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, బంగారం షాపులు కొనుగోలు దారులతో సందడి మారుతున్నాయి. రెండు నెలల పాటు పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండడం, ఆ తరువాత మూడు నెలల పాటు ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది ఈ రెండు నెలల్లోనే వివాహాలు జరిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
నగరంలో పెళ్లి సందడి మొదలైంది.. దీంతో నగరంలోని ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, కల్యాణ మండపాలకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఈ నెలలో ఇప్పటికే మొదటి వారంలో పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు జరిగాయి. అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి నవంబర్ 27 వరకూ వరుస ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్ 12 నుంచే హడావుడి మొదలైంది. దీంతో పాటు అక్టోబర్ 24, 26, 29, 30, 31 తేదీలు, నవంబర్ 7, 8, 15, 22, 26, 27 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆ తరువాత నవంబర్ 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ మూఢాలు ఉన్నట్లు చెప్పారు. అంటే నవంబర్ చివరి నుంచి డిసెంబర్, జనవరి నెలల్లో ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇంచుమించు మూడు నెలల పాటు వివాహాలు జరిపేందుకు అవకాశం లేకపోవడంతో చాలామంది ఈ రెండు నెలల్లోనే తమ ఇళ్లల్లో భాజా భజంత్రీలు మోగించాలని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!