Kirron Kher: గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ గెలుపు కిరణం.. భర్త కళ్లలో ఎన్ని కన్నీటి సముద్రాలో..

Kirron Kher Battling Cancer, Returns To Indias Got Talent Set As A Judge - Sakshi

Kirron Kher, Battling Cancer, Returns To India's Got Talent Set As A Judge: కిరణ్‌ ఠాకూర్‌ సింగ్‌ సందు ఎవరు? అంటే జవాబు చెప్పడానికి తటపటాయిస్తారుగానీ, ‘కిరణ్‌ ఖేర్‌’ అనే పేరు మాత్రం సుపరిచితం. నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్‌ బెనగల్‌ ‘సర్దారీ బేగమ్‌’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్‌ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె చంఢీగఢ్‌ పార్లమెంట్‌ సభ్యురాలు.

కొన్ని నెలల క్రితం ఆమెకు క్యాన్సర్‌ అనే విషయం ప్రకటితమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతో బాధపడ్డారు. సోషల్‌ మీడియాలో సానుభూతి మాటలు వెల్లువెత్తాయి. కిరణ్‌ఖేర్‌ చికిత్స కోసం వెళ్లే ముందు తనయుడు సికిందర్‌ ఖేర్‌ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్‌ చేశాడు. అందులో ఆమె ఎప్పటిలాగే ఉన్నారు. అదే చిరునవ్వు. ‘కెమెరాను కాస్త నా ముందుకు తీసుకురా’ అన్నారు. అలాగే చేశాడు. అప్పుడు... స్నేహితులు, అభిమానులు, బంధువులు, సన్నిహితులను ఉద్దేశించి కిరణ్‌ ఖేర్‌ ఇలా అన్నారు... ‘హలో! థాంక్యూ ఎవ్రీబడీ ఫర్‌ యువర్‌ గుడ్‌ విషెస్‌ అండ్‌ లవ్‌’ ఎప్పటిలాగే చీర్‌ఫుల్‌ వాయిస్‌!

చికిత్స జరుగుతున్న సమయంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ప్రజలతో పంచుకునేవారు కిరణ్‌. హాస్పిటల్‌లో ఉన్న సమయంలో కూడా సమస్యల్లో ఉన్నవారికి అండగా ఉండేవారు. ఫోన్‌ ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కరించారు. చండీగఢ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మించాలనేది ఆమె కల. తన అనారోగ్యం ఆ కలను ఆపలేకపోయింది. ఎప్పటికప్పడు, ఎవరితోనో ఒకరితో ఈ ప్లాంట్‌ గురించి మాట్లాడుతూనే ఉండేవారు. పని వేగం పుంజుకోవడానికి ప్రయత్నించేవారు. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి చండీగఢ్‌కు వెళ్లాలనేది ఆమె బలమైన కోరిక. అయితే ఆరోగ్యజాగ్రత్తల రీత్యా వైద్యులు నిరాకరించారు. ప్రస్తుతం థెరపీ కోసం నెలకు ఒకసారి హాస్పిటల్‌కు వెళ్లాలి. ‘ఎప్పటిలాగే చురుగ్గా ఉన్నారు’ అని చాలామంది ఇచ్చే ప్రశంసలకు ఆమె ఇచ్చే సమాధానం... ‘పనే నా బలం. పనే నా ఆరోగ్యం. పనే నా ఉత్సాహం’ పని లేకుండా తనను తాను ఊహించుకోలేని కిరణ్‌ మళ్లీ పనిలోకి దిగారు. రియాల్టీ షో ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ సెట్‌లోకి రావడం తొలి అడుగుగా చెప్పాలి. ఈ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జడ్జిగా ఆమె ప్రతిభను గురించి సెట్‌లో ఉన్న శిల్పాషెట్టిలాంటివారు గొప్పగా మాట్లాడారు.

 ఆ ప్రశంసల మాధుర్యాన్ని కిరణ్‌ ఆస్వాదించారో లేదో తెలియదుగానీ, ఆరోజు తాను ధరించిన నగలపైన తానే జోక్‌ వేసి అక్కడ ఉన్నవారిని గట్టిగా నవ్వించారు. వారితో పాటు తాను కూడా గొంతు కలిపారు. దురదృష్టమా మళ్లీ రాకు... ఆ నవ్వుల్లో  ఎంతబలం ఉందో చూశావు కదా! కిరణ్‌ చికిత్సకు వెళుతున్న రోజు భర్త అనుపమ్‌ ఖేర్‌ కళ్లలో ఎన్ని కన్నీటి సముద్రాలు ఉన్నాయో తెలియదుగానీ... వాటిని దాచుకొని ఆరోజు ధైర్యంగా అన్నాడు... ‘ఆమె ఫైటర్‌. అంతే’ అతడి ఆత్మవిశ్వాసం వృథా పోలేదు అని కిరణ్‌జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! కిరణ్‌జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top