రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ తెలిపింది.
ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్‌లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.


